GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కార్పొరేషన్ ఎన్నికలకు వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు, ఎంఎంసీలోని 76 వార్డులకు ఇప్పటికే ఎంఐఎం పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించటం, గత కొద్ది సంవత్సరాలుగా స్తబ్దత నెలకొన్న టీడీపీ పార్టీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఈ నెల 17వ తేదీన జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేయటం వంటి పరిణామాలు త్వరలోనే జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో కోర్ అర్బన్ రీజియన్ లోని మొత్తం 300 వార్డుల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఈ ప్రయత్నాలు మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతంలోని నేతల్లో స్పష్టంగా కన్పిస్తుంది. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేశారంటూ కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వైరల్ గా మారటంతో కార్పొరేటర్‌గా పోటీ చేయాలని భావిస్తున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు అప్రమత్తమైనట్లు తెలిసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్డుల రిజర్వేషన్ పోస్టులకు జీహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేసిన సంగతి తెల్సిందే. మరో వైపే కాస్త రాజకీయ నేపథ్యం కల్గిన నేతలు మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను ఎన్నికల ముందు ఖరారు చేస్తారని భావించి, తాము పోటీ చేయాలని భావిస్తున్న డివిజన్లలోని సామాజిక వర్గాల వారీగా ఓటర్లను లెక్కేసి, ఆ సామాజికవర్గానికి వార్డు రిజర్వు అయ్యే అవకాశముందని భావిస్తూ, సదరు సామాజికవర్గానికి చెందిన నేతలను అలర్ట్ చేస్తున్నట్లు తెలిసింది.
ఎంఐఎం(MIM) పార్టీ మాత్రం నెల రోజుల క్రితం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 76 మున్సిపల్ వార్డులకు ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అంతేగాక, కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని 150 వార్డులకు కూడా టికెట్ ఆశించిన వారి నుంచి వారి కుల ధృవీకరణ పత్రాలతో పాటు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాగో మజ్లీస్ పార్టే గెలిచే అవకాశాలెక్కువగా ఉన్నందున, వార్డుల వారీగా ఒక వర్గానికి చెందిన జనాభాను అంచనా వేసి, ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: 30 ఏళ్ల వయసు తరువాత మీ రోజువారి అలవాట్లతో ప్రమాదం.. జీవనశైలిలో ఈ మార్పులు చేయడం తప్పనిసరి
ఇప్పటి వరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 74 మున్సిపల్ వార్డులకు ఏ పార్టీ కూడా ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించకపోయినా, ఈ కార్పొరేషన్ లోని డివిజన్ల నుంచి పోటీకి చాలా మంది సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక్కో మున్సిపల్ వార్డు నుంచి నలుగురు నుంచి ఆరుగురు ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెల్సింది.
కోర్ అర్బన్ రీజియన్లో అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీకి రానున్న డిసెంబర్ మాసంలో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు, ఈ మేరకు ఏర్పాట్లు చేసే దిశగా సిద్దం కావాలని కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్ వింగ్ కు సంకేతాలు వచ్చినట్లు తెలిసింది. తొలుత జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించి, వచ్చే ఫలితాలను బట్టి సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెల్సింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసే లోపు మల్కాజ్ గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలోని వార్డుల సంఖ్యను ఒక్కో కార్పొరేషన్ లో వందకు పెంచేలా, ప్రస్తుతమున్న వార్డులను పునర్విభజించాలని కూడా యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ లేకపోలేదు.
ఆ తర్వాత మేయర్ సీటుతో పాటు మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేసి, ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలోని 150 వార్డుల్లో అత్యధిక వార్డుల్లో ఎంఐఎం పార్టే గెలిచే అవకాశమున్నందున, మేయర్ పీఠం కూడా ఎంఐఎం చేజిక్కించుకునే అవకాశాలెక్కువగా ఉండగా, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల లోని ఎక్కువ వార్డులు అధికార పార్టీ గెలిచి, మేయర్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా అధికార పార్టీ సమీకరణలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: గూగుల్ నుంచి బిగ్ లీక్.. Pixel 11లో ఈ ‘పిక్సెల్ గ్లో’ ఫీచర్ చూస్తే ఫ్యూజులు అవుట్!