Hayden Betrayal: హాలీవుడ్ నటి హేడెన్ పనెట్టియర్ (Hayden Panettiere) తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక అత్యంత భయంకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి ఇటీవల నోరు విప్పారు. ‘హీరోస్’ వంటి పాపులర్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు పొందిన ఆమె, ఇండస్ట్రీలో తాను నమ్మిన ఒక మహిళా స్నేహితురాలు చేసిన ద్రోహం గురించి వివరించారు.
జే శెట్టి నిర్వహించే ‘ఆన్ పర్పస్’ పాడ్‌కాస్ట్‌లో హేడెన్ పాల్గొని తన జీవిత చరిత్ర ‘దిస్ ఈజ్ మీ: ఏ రికనింగ్’ (This Is Me: A Reckoning) లోని కొన్ని చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆమెకు 18 ఏళ్ల వయసున్నప్పుడు, ఆమె ఒక మహిళా ఇండస్ట్రీ ఫ్రెండ్‌ను తన రక్షకురాలిగా, అత్యంత సన్నిహితురాలిగా భావించేవారు. కానీ ఆ మహిళే ఆమెను ఒక ఉచ్చులోకి లాగారు.
ఒక సందర్భంలో ఆ స్నేహితురాలు హేడెన్‌ను ఒక పడవ మీదకు తీసుకెళ్లారు. అది సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత, ఆమెను కింద ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ బట్టలు లేకుండా ఉన్న ఒక అత్యంత ప్రసిద్ధ వ్యక్తి పక్కన హేడెన్‌ను బలవంతంగా పడుకోబెట్టారు. ఆ వ్యక్తితో శృంగారం చేయాలని ఆ స్నేహితురాలు సూచించినట్లు హేడెన్ ఆరోపించారు.
ఆ సమయంలో తన పరిస్థితిని వివరిస్తూ, “నేను ప్రమాదంలో ఉన్నానని గ్రహించినప్పుడు నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. కానీ అప్పటికే మేము సముద్రం మధ్యలో ఉన్నాము, అక్కడి నుండి దూకి తప్పించుకునే పరిస్థితి లేదు,” అని ఆమె తెలిపారు. అయితే ఆమె ఆ పరిస్థితికి లొంగిపోకుండా గట్టిగా ప్రతిఘటించారు. “నేను చాలా కోపంగా తిరగబడ్డాను. ‘ఇది జరగడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశాను,” అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ గది నుండి బయటకు వచ్చి పడవలో వేరే చోట దాక్కున్నానని ఆమె చెప్పారు.
Reada also-Brahmamudi Rekha : ‘బ్రహ్మముడి ‘ రేఖ ఆస్తులు.. ఇన్నేళ్లలో అంత సంపాదించిందా..?
ఈ సంఘటనలో హేడెన్ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఆమె భయపడి పారిపోతుంటే, అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు ఎవరూ ఆమె పట్ల సానుభూతి చూపలేదు. అటువంటి పనులు అక్కడ సర్వసాధారణమని, ఆ వ్యక్తికి అది ఒక సాధారణ రోజని ప్రవర్తించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నమ్మిన వ్యక్తి నుండి ఎదురైన ఈ ద్రోహం ఆమెను మానసికంగా చాలా కృంగదీసింది.
హేడెన్ ఈ ఇంటర్వ్యూలో కేవలం ఈ వేధింపుల గురించి మాత్రమే కాకుండా, తన జీవితంలోని ఇతర కష్టాలైన మాదకద్రవ్యాల వ్యసనం, తన కుమార్తె సంరక్షణ బాధ్యతను కోల్పోవడం మరియు తన తల్లితో ఉన్న క్లిష్టమైన సంబంధాల గురించి కూడా నిర్భయంగా మాట్లాడారు. హాలీవుడ్ గ్లామర్ వెనుక ఉన్న ఇటువంటి చీకటి నిజాలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధైర్యంగా ఈ విషయాలను బయటపెట్టడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.