Jana Nayagan Release: ఇళయదళపతి విజయ్ నటించిన.. చివరి చిత్రం జన నాయగన్ ప్రస్తుతం సెన్సార్ సమస్యలతో వార్తల్లో నిలుస్తోంది. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాలని మొదట ప్లాన్ చేశారు. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో.. సినిమా విడుదల వాయిదా పడింది.
గత కొన్ని వారాలుగా జన నాయగన్ నిర్మాతలు CBFCతో న్యాయపరమైన పోరాటం చేస్తున్నారని ప్రచారం జరిగింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు.. డైలాగులపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ సమస్య తలెత్తిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కోర్టు వరకు వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ కేసును వెనక్కి తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. జన నాయగన్ టీమ్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించి సెన్సార్ సర్టిఫికెట్ పొందాలని నిర్ణయించుకుంది. ఈ విషయంపై ఈరోజే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ పరిణామం సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలకు కారణమైంది. కొందరు నెటిజన్లు CBFCకి లొంగిపోయారు..అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది సరైన నిర్ణయమే అంటున్నారు.
సినీ పరిశ్రమకు చెందిన పలువురు విశ్లేషకులు ఏమంటున్నారంటే.. మొదట్లోనే రివైజింగ్ కమిటీకి వెళ్లి ఉంటే చాలా సమస్యలు అప్పుడే పరిష్కారమయ్యేవని. న్యాయపరమైన మార్గం ఎంచుకోవడం వల్ల సినిమా ఆలస్యం కావడమే కాకుండా..సమస్య మరింత క్లిష్టమైందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు రివైజింగ్ కమిటీ ప్రక్రియ ఎంత సమయం పడుతుందన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.
ప్రస్తుతం వరకు జన నాయగన్ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అందుకే ఈ వార్తలన్నీ ఊహాగానాలుగానే ఉన్నాయి. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో ఈ అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ కీలక దశను చిత్రబృందం ఎలా ఎదుర్కొంటుందో, సెన్సార్ సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. అప్పటివరకు జన నాయగన్ చుట్టూ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి.
ALSO READ: Eesha Rebba: తెలంగాణ యాసపై ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్.. కొట్టినట్లు ఉంటుంది అంటూ..!