Jani master:టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ లో చోటు చేసుకున్న వివాదాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ అంటూ సాగుతున్న ఈ వార్ ఏకంగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ వర్సెస్ డ్యాన్సర్ అసోసియేషన్ గా మారిపోయింది. ముఖ్యంగా డ్యాన్సర్స్ అసోసియేషన్ కి అధ్యక్షురాలిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత రాజీనామా చేసిన పది మంది స్థానాల కోసం ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరగా.. మరొకవైపు ఫిలిం ఫెడరేషన్ ఎన్నికలు లేకుండా రాజీనామా చేసిన వారిని మళ్లీ కలుపుకోవాలని బెదిరిస్తున్నట్లు సమాచారం. . దీంతో ఫిలిం ఫెడరేషన్ తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని , ఫిలిం ఫెడరేషన్ ను మందలించాలి అంటూ జానీ మాస్టర్ నిర్మాతలను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు ఒక లేఖ తో పాటూ ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జానీ మాస్టర్ తన లేఖలో.. “బాధ్యతగల కొరియోగ్రాఫర్ గా, మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ TFTDDA గా నా మనోవేదనను నిర్మాతలు దృష్టికి తీసుకొచ్చాను. ఒక సినీ కార్మికుడిగా నేను నా ఎదుగుదలకు, నా సంక్షేమానికి దోహద పడింది సినీ నిర్మాతలే అని నమ్ముతున్నాను. అందుకే ప్రతి నిర్మాతను నేను దైవ సమానులుగా భావిస్తాను. ఎప్పటికీ కృతజ్ఞతతో నిర్మాతల కోసం మా శాయశక్తులా పనిచేస్తాము. చిన్న పెద్ద అని తేడా లేకుండా నిర్మాత బ్రతికి ఉంటే పదిమందిని బ్రతికిస్తాడు. నిర్మాత క్షేమంగా ఉంటే పదిమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాడు. అలాంటి నిర్మాత ఈరోజు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటున్నాడు. పైరసీ రూపంలో, థియేటర్ కొరతతో, కొంతమంది అవినీతికి పాల్పడి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారి నుండి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కూడా.. సినిమా మీద ఆసక్తితో వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనే మంచి ఉద్దేశంతో మా అందరికీ నిర్మాతలు పని కల్పిస్తున్నారు.
మా డ్యాన్సర్స్ కి నిర్మాతల నుంచి వచ్చిన డబ్బులు మా యూనియన్ లో ఉన్న కొంతమంది ప్రోగ్రాం ఇన్చార్జ్ లు దోచుకుని తింటున్న వారిపై చర్యలు తీసుకుంటుంటే.. ఫెడరేషన్ మాత్రం వారి తప్పులను కప్పిపుస్తూ.. వారికి సహకరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా.. మా అసోసియేషన్ కి ఫెడరేషన్ అడ్డుపడుతోంది. దీనికి నష్టపోయిన డ్యాన్సర్ సభ్యులు అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కమిటీ సభ్యులపై , ప్రెసిడెంట్ పై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు. ఇక అందుకే చర్యలు తీసుకున్న క్రమంలో ఫెడరేషన్ వారు అడ్డుపడుతూ , అవినీతి చేసిన వారి తప్పులను తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా డ్యాన్సర్స్ కష్టానికి తగిన డబ్బులు నిర్మాతలు ఇస్తుంటే.. ఆ డబ్బులను కొంతమంది దోచేస్తున్నారు. అలాంటి వారికి ఫెడరేషన్ పెద్దలు సహకరించడం బాధగా ఉంది.
డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ.. నిర్మాత క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా వంతు బాధ్యతగా మా అసోసియేషన్ లో ప్రస్తుత ప్రెసిడెంట్ గా ఉన్న వివి సుమలత దేవి గారి చొరవతో అవినీతి చేస్తున్న కొంతమంది ప్రోగ్రాం ఇన్చార్జీలను , వారు ప్రొడక్షన్ కంపెనీకి పెడుతున్న అక్రమ బిల్లులను పరిశీలించి , అవినీతి చేసిన వారిని సస్పెండ్ చేస్తూ.. మా యూనియన్ లో పదవీ బాధ్యతతో ఉన్న వారిపై కూడా నిర్మాతలను అలాగే మా డాన్సర్స్ ని మోసం చేసిన వారి పైన కూడా వారి పదవిని కూడా తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నాము. అలా అవినీతికి పాల్పడిన మా జనరల్ సెక్రటరీని పదవి నుంచి తొలగించాము. అయితే అతడికి సపోర్ట్ చేస్తూ కొంతమంది కమిటీ సభ్యులు రాజీనామాలు చేశారు. వారిని కూడా జనరల్ బాడీ మీటింగ్ లో తొలగించి ఉప ఎన్నికలు నిర్వహించుకోవాలని తీర్మానం తీసుకున్నాము.
అలాంటి సమయంలో ఫెడరేషన్ మాకు సహకారం అందించడం లేదు. అవినీతి చేసిన వారితో కలిసి పని చేయాలని మా ప్రెసిడెంట్ సుమలత దేవి గారిని, మిగిలి ఉన్న కమిటీ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా యూనియన్ అంతర్గత విషయాలలో తలదూర్చి మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. జూలై 16న ఫెడరేషన్ లో జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్లో మేము సస్పెండ్ చేసి తొలగించిన వారిని మళ్లీ వారి పదవిలో కొనసాగించాలని, కలుపుకొని పోవాలని మా ప్రెసిడెంట్ సుమలతా దేవి గారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. జనరల్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరైన వారిలో కొంతమంది కౌన్సిల్ మెంబర్లు అన్న మాటలకు మాకు తీవ్ర మనస్తాపం కలిగింది.
ALSO READ:విజయ్ – త్రిష రిలేషన్ పై మరో జంట షాకింగ్ కామెంట్!
నిర్మాతల డబ్బులు కదా.. మీ అసోసియేషన్ డబ్బులు దోచుకోలేదు కదా.. తప్పేముంది ఇలాంటివి చూసి చూడనట్టు వెళ్లిపోవాలి అని మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు వింటున్నా కూడా ఫెడరేషన్ పెద్దలు మౌనంగా ఉండడం మా అసోసియేషన్ అధ్యక్షురాలు, కమిటీ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. పేరుకి ఫెడరేషన్ పెద్దలు నిర్మాతలు శ్రేయస్సు కోసం ఉన్నాం అంటున్నారు కానీ నిర్మాతలను మోసం చేస్తున్న వారిని చూసి చూడనట్లు పోవాలని మాట్లాడుతున్నారు. అలాంటి వారిని మళ్లీ పదవుల్లోకి తీసుకోండి అని మాపై అధికారం చాలా చెలాయిస్తున్నారు. వినకపోతే ఫెడరేషన్ నుండి ‘నాన్ క్రో ఆపరేషన్’ చేస్తామని బెదిరిస్తున్నారు. ఫెడరేషన్ పెద్దలు ఒకవైపు కార్మికుల క్షేమమే మా ధ్యేయం అని చెబుతూ మరొకవైపు డాన్సర్స్ కి చెందాల్సిన డబ్బులను దోచుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు..
మా ప్రెసిడెంట్ ఒంటరి మహిళగా మా అసోసియేషన్ లో జరుగుతున్న అవినీతిని బయట పెడుతూ.. నిర్మాతలను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ.. మా యూనియన్ అభివృద్ధికి తోడ్పడుతుంటే.. ఫెడరేషన్ వారికి అధికారాలు ఉన్నాయని లేనిపోని రూల్స్ చెబుతూ మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటూ.. వారు చెప్పినట్టే వినాలి అని, లేకుంటే ఫెడరేషన్ లో సభ్యత్వం తొలగిస్తామని బెదిరిస్తున్నారు. అంతేకాదు ఒక మహిళ మేము చెబితే వినదా? మా పరువుకు భంగం కలుగుతుందని నెపంతో లింగ భేదం కనబరుస్తున్నారు. మేము , డ్యాన్సర్స్ యూనియన్ ఎల్లవేళలా నిర్మాత క్షేమాన్ని కోరుకుంటాము. అలాంటి నిర్మాతను మా డ్యాన్సర్స్.. మోసం చేసే బేరర్స్ ను, ప్రోగ్రాం ఇన్చార్జిలను, వారి అవినీతిని సహించము. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. అయితే మాకు ఫెడరేషన్ నుండి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కాబట్టి నిర్మాతలు చొరవ తీసుకొని మా విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి, ఫెడరేషన్ వారు చేస్తున్న నాటకీయ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని , మా డ్యాన్సర్స్ యూనియన్ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకుండా మేము స్వేచ్ఛగా ఉప ఎన్నికలు జరుపుకునేలా చూడాలని నిర్మాతల పెద్దలను ప్రాధాయపడుతున్నాను. మా విన్నపాన్ని స్వీకరించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను” అంటూ ఒక సుదీర్ఘ లేఖ పంచుకున్నారు జానీ మాస్టర్.