June Releases : అసలే బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి అంతంత మాత్రం.ఈ ఏడు ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదీ సూపర్ హిట్టు అన్నది ఒక్కటి లేదు.ఇదిలా ఉంటె వచ్చే జూన్ నెలలో టాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ అరడజనుకు పైగా సినిమాలు వస్తున్నాయి కానీ, అందులో సగం సినిమాలకు కనీస బజ్ కూడా లేకపోవడం గమనార్హం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో జూన్ బాక్సాఫీస్ ఓపెన్ అవుతోంది. ఈ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి కానీ, ఆ అంచనాలే ఇప్పుడు చిత్ర యూనిట్‌కు పెద్ద మైనస్‌గా మారేలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ఈ సినిమాతో కళకళలాడుతాయని నమ్ముతున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే విచ్చలవిడిగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశారు. ప్రచారం కూడా అదే రేంజ్ లో నడుస్తోంది. అయితే, కథలో దమ్ము లేకపోతే కేవలం ప్రచార ఆర్భాటాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో చాలా కష్టం . ఒకవేళ మొదటి రోజు టాక్ తేడా వస్తే, ఈ భారీ బిజినెస్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఘోరంగా నష్టపోయే ప్రమాదమే ఎక్కువ .
ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే
ఇక రెండో వారంలో ‘సింగ్ గీతం’ అనే సినిమా వస్తోంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతి సినిమాకీ కొత్తగా ఆలోచిస్తారనే పేరుంది కానీ, ఆయన గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయ్యాయనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ‘సింగ్ గీతం’ కూడా ఆయన శైలిలో సాగే ఓ కొత్త ప్రయోగమేనంట. అయితే ప్రయోగాల పేరుతో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి లాంటి కొత్త లేదా అంతగా గుర్తింపు లేని ముఖాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఇదొక ఓవర్ ది టాప్ కామెడీ లాగా అనిపిస్తోంది కానీ, నేటి ఆడియన్స్ కు ఈ కంటెంట్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది డౌటే.
బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కావడం లేదు
ఇక మూడో వారంలో సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలోకి వస్తోంది. సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేషన్ లో నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ అయితే రిలీజైంది. సినిమా కథ-జానర్ ఏంటనేది అందులోనే క్లియర్‌గా చెప్పేసారు. అయితే, లాంగ్ గ్యాప్ తర్వాత సమంత స్క్రీన్ పైకి వస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అనుకుంటున్నారు కానీ, సమంత సోలో మార్కెట్ ఎలా ఉంటుందో యశోద, శాకుంతలం సినిమాలతో ప్రూవ్ అయింది.పై పెచ్చు లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కావడం లేదు కూడా.దీనికి తోడు నందినీ రెడ్డి మార్క్ క్లాస్ ఎమోషన్స్ ఈ యాక్షన్ జానర్‌కు సెట్ అవుతాయా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
జనాలు ఎంతవరకు ఆదరిస్తారో
ఇక జూన్ బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ నెలాఖరున ‘లెనిన్’ వస్తోంది. చాలా రోజుల తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా ఇది. అఖిల్ కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ హిట్ కూడా లేకపోవడం అతని మార్కెట్‌ను దెబ్బతీసింది. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టుడియోస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి రెండు పెద్ద బ్యానర్లు కలిసినప్పటికీ, మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఓ మోస్తరు అంచనాలు మాత్రమే ఉన్నాయి. అఖిల్ లుక్, మేకింగ్ పరంగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు దీవానా, ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు, బాలన్ లాంటి అవుట్ డేటెడ్ సినిమాలు కూడా వస్తున్నాయి. వడ్డే నవీన్ రీఎంట్రీ ఇస్తున్న ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ సినిమాను జనాలు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
అటు తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ కూడా జూన్ లోనే వస్తోంది. ఇన్ని సినిమాలు ఉన్నా కంటెంట్ వీక్‌గా ఉంటే జూన్ నెల బాక్సాఫీస్ డల్‌గా మారడం ఖాయం. మరి వీటన్నింటిలో భారీ అంచనాలు మోస్తున్న పెద్ది అయినా టాలీవుడ్ ని గట్టెక్కిస్తుందో లేదో చూడాలి .
Also read :‘పెద్ది’ రేట్లు అరాచకం .. జూన్ 3 ప్రీమియర్ షో టికెట్ ఎంతో తెలుసా ?