Vijay Congress: తమిళనాట ఒక సరికొత్త రాజకీయ శకం ఆరంభమైంది. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాది మంది నీరాజనాలు అందుకున్న విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల ఉత్కంఠ తర్వాత, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) మెజారిటీని నిరూపించుకోవడంతో విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
2024లో తన రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్, 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆయన సభలకు అశేష జనవాహిని తరలివచ్చినప్పటికీ, ఆ క్రేజ్ ఓట్లుగా మారుతుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కరూర్ వంటి చోట్ల జరిగిన తొక్కిసలాట సంఘటనలు ఆయన ప్రయాణంలో సవాళ్లు విసిరాయి. అయితే, ఏప్రిల్ ఎన్నికల ఫలితాలు అన్ని అంచనాలను తలకిందులు చేశాయి. మే నెలలో వెలువడిన ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్పష్టమైన మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచినప్పటికీ, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుతో శనివారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.
విజయ్ విజయాన్ని పురస్కరించుకుని కూటమి పార్టీ అయిన కాంగ్రెస్ (TNCC) సోషల్ మీడియాలో ఒక వినూత్న వీడియోను పంచుకుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందించిన రజనీకాంత్ – కమల్ హాసన్ రీ యూనియన్ వీడియోను AI సాయంతో రీక్రియేట్ చేశారు. అసలు వీడియోలో రజనీ, కమల్‌లు “హీరో ఎవరు?” అని చర్చించుకుంటారు. అయితే కాంగ్రెస్ రూపొందించిన వెర్షన్‌లో రాహుల్ గాంధీ, విజయ్‌లు సమాన హోదాలో కనిపిస్తూ చివర్లో ‘ఫిస్ట్ బంప్’ చేసుకున్నట్లు చూపించారు. “కొన్ని కలయికలు ఆటను మారుస్తాయి” అంటూ కాంగ్రెస్ ఈ వీడియోను షేర్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది.
విజయ్ తన సినిమాల ద్వారా సామాజిక సందేశాలను అందిస్తూనే, తన అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ రాజకీయ అడుగులు వేశారు. ఆయన చివరి సినిమాగా భావిస్తున్న ‘జన నాయకన్’ (H. వినోద్ దర్శకత్వం) సెన్సార్ ఇబ్బందుల వల్ల సంక్రాంతికి విడుదల కాలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో, ఈ సినిమా త్వరలోనే విడుదలై సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత వంటి సినీ దిగ్గజాల వారసత్వాన్ని విజయ్ ఏ మేరకు కొనసాగిస్తారో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఒక నటుడిగా కాకుండా, ప్రజా నాయకుడిగా విజయ్ రేపటి నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.
?igsh=Ym92bHdmYWt6Z2Uz