Sankranthi Movies At US Box Office: ఇప్పటి సంక్రాంతి సీజన్‌లో ఐదు తెలుగు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. భారతదేశంలో పండుగ వాతావరణం సినిమాలకు బాగా కలిసివస్తుంది. అదే ప్రభావం అమెరికా మార్కెట్‌లో కూడా కనిపిస్తుంది. అక్కడ సంక్రాంతి సెలవులు లేకపోయినా.. తెలుగు ప్రేక్షకుల మూడ్‌కి తగ్గట్టుగానే కలెక్షన్లు ఉంటాయి. ప్రస్తుతం అమెరికా బాక్సాఫీస్‌లో ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
అమెరికాలో ఇప్పటికే రెండు సినిమాలు రేస్ నుంచి దాదాపుగా బయటకు వెళ్లిపోయాయి. అవి భర్త మహాసాయులకు విజ్ఞప్తి.. ది రాజా సాబ్. రవితేజ నటించిన భర్త మహాసాయులకు విజ్ఞప్తి గురువారం కేవలం 12 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ 9 వేల డాలర్లకే పరిమితమైంది. ఈ సంఖ్యలు చూస్తే ఈ రెండు సినిమాలకు అమెరికాలో రికవరీ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
మిగతా మూడు సినిమాల పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉంది. చిరంజీవి.. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు అమెరికాలో టాప్‌లో నిలిచింది. ఈ సినిమా ఇప్పటివరకు 2.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చడంతో కలెక్షన్లు నిలకడగా వస్తున్నాయి.
తర్వాత స్థానంలో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు ఉంది. ఈ సినిమా ఇప్పటివరకు 6.52 లక్షల డాలర్లు వసూలు చేసింది. యువ ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.
అండర్‌డాగ్‌గా విడుదలైన శర్వానంద్ సినిమా నారి నారి నడుమ మురారి కూడా నెమ్మదిగా పుంజుకుంటోంది. ఇప్పటివరకు 1.72 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఈ సినిమాకు మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.
అమెరికాలో శుక్రవారం నుంచి లాంగ్ వీకెండ్ ప్రారంభమవుతుంది. మార్టిన్ లూథర్ కింగ్ డే సెలవు కూడా ఉండటంతో వచ్చే మూడు నుంచి నాలుగు రోజులు చాలా కీలకం. ఈ సమయంలో ఈ మూడు సినిమాలు ఎలా నిలబడతాయన్నదే.. వారం చివరికి వాటి ఫైనల్ ఫేట్‌ను నిర్ణయించనుంది.