Sonusood: ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonusood) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్లో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఇటు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే రీల్ హీరోగా కంటే రియల్ హీరో అనిపించుకుని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి సోనూసూద్ 52 సంవత్సరాల వయసులో కూడా ఇంకా స్టిల్ యంగ్ గానే కనిపించడంతో ఈయన ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు? ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అంటూ పలు రకాలుగా అభిమానులు సైతం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి సోనూసూద్ 52 ఏళ్ల వయసులో కూడా ఇంత యంగ్గా, ఫిట్గా ఉండడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ నటుడు సోనూసూద్ 52 సంవత్సరాల వయసులో కూడా తన సిక్స్ ప్యాక్ బాడీతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన బాడీ ఫిట్నెస్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. తన ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టారు. సోనూ సూద్ మాట్లాడుతూ.. నేను ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతాను. ప్రతిరోజు ఒక గంట పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, ధ్యానం వంటివి చేస్తాను. ఇక కఠినమైన డైట్ పాటించను. కానీ ఇంటి భోజనాన్ని మితంగా మాత్రమే తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను”. అంటూ సోనూసూద్ తెలిపారు. మొత్తానికైతే తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
సోనూసూద్ విషయానికి వస్తే తెలుగు, తమిళ్ , హిందీ చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్నారు. పంజాబ్ లోని మోగ అనే పట్టణంలో జన్మించారు. నాటకాలలో కూడా నటించి తన నటనతో మెప్పించారు. తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన అరుంధతి సినిమాలో ఉత్తమ విలన్ పాత్రకు ఏకంగా నంది అవార్డును దక్కించుకున్నారు. సోనూసూద్ నటించిన తెలుగు చిత్రాల విషయానికొస్తే ఏక్ నిరంజన్, జులాయి, ఆగడు, సీత, అభినేత్రి, తీన్ మార్, కందిరీగ, మిస్టర్ మేధావి వంటి పలు చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు.
శక్తి సాగర్ సూద్, సరోజ్ సూద్ దంపతులకు జన్మించారు. నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఈయన ఆ తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ వంటివి చేసేవారు. అప్పుడే సినిమాల్లోకి రావాలనే కోరిక బలపడింది. దాంతో నెల రోజుల పాటు నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. 1996లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు అమ్మాయి సోనాలీని వివాహం చేసుకున్నారు.