Simran:ఒకప్పటి అందాల తార, అభినయ సుందరి సిమ్రాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందంతో, నటనతో , చలాకీతనంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె తెలుగు,తమిళ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది . ఉత్తరాదికి చెందిన ఈ ముద్దుగుమ్మను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం ద్వారా ‘అబ్బాయిగారి పెళ్లి’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. 1999 నుంచి 2004 వరకు తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగిన ఈమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. సాధారణంగా సిమ్రాన్ అంటేనే అద్భుతమైన డాన్స్, నటన గుర్తుకొస్తాయి. అలాంటి ఈమె తాజాగా బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా బాలీవుడ్ సౌత్ నటీనటుల పట్ల ప్రదర్శించే వివక్షను ఎండగడుతూ ఆమె చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ గౌరవం ఉండదని కేవలం బేరాలు మాత్రమే ఉంటాయి అంటూ బాలీవుడ్ పరువు తీసేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే సిమ్రాన్ మాట్లాడుతూ… “బాలీవుడ్ లో హిందీ సినిమాలలో నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ నేను అన్నింటిని తిరస్కరించాను . అక్కడ వారితో సరైన కమ్యూనికేషన్ మనకు కుదరదు. సౌత్ లో మేము సంపాదించుకున్న పేరును, గుర్తింపును బాలీవుడ్ వారు అస్సలు గుర్తించరు. మేము ఏదో జీరో నుంచి మొదలు పెడుతున్నాం ..కొత్త నటీనటులే అన్నట్టుగా మాతో వ్యవహరిస్తారు. ఇది నన్ను బాగా కలచివేసింది.
ముఖ్యంగా మా వెంట వచ్చే స్టాఫ్ సంఖ్యను కూడా పరిమితం చేస్తారు. హోటల్ గదులు, విమాన టికెట్ల విషయంలో కూడా వాళ్ళు రాజీపడరు. ఇవన్నీ చూడడానికి చిన్న విషయాలుగా అనిపించవచ్చు. కానీ దశాబ్దాల కాలంగా సినిమా కోసం ప్రాణమిచ్చిన మాలాంటి వారికి ఇది చాలా అవమానకరంగా అనిపిస్తుంది. అక్కడ ఉండే ఆధిపత్యం చూశాక అసలు బాలీవుడ్ చిత్రాలలో పనిచేయాలి అనే ఆసక్తి కూడా పోతుంది” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమపై సిమ్రాన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. సౌత్ సినీ పరిశ్రమ నేడు ఎల్లలు దాటి ప్రపంచ స్థాయిలో గుర్తింపు అందుకుంటుంటే.. ఇంకా సౌత్ నటీనటుల పట్ల ఈ వివక్షత ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మరి ఇప్పటికైనా బాలీవుడ్లో సౌత్ నటీనటుల పట్ల చూపిస్తున్న తీరు మారాలి అని పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి దీనిపై బాలీవుడ్ సినీ పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ALSO READ:ఓటీటీలోకి వచ్చిన రూ.200 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ!
ఇదే సమయంలో బాలీవుడ్లో నటీనటుల గురించి మాట్లాడుతూ..” బాలీవుడ్ లో స్టార్ లందరూ అలాగే ఉండరు ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఎంతో వినయపూర్వకంగా ఉంటారు. ఆయనతో కలిసి పనిచేయడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సౌత్ నటి అని వివక్ష చూపకుండా గౌరవించే వ్యక్తులు అక్కడ కేవలం తక్కువ మంది మాత్రమే ఉన్నారు” అంటూ ఆమె అభిప్రాయపడింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.