Uday Kiran Life:తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో ‘హ్యాట్రిక్ హీరో’గా, కుర్రకారు కలల రాకుమారుడిగా వెలిగిన ఉదయ్ కిరణ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు చెక్కుచెదరలేదు. ఇటీవల ఆయన సోదరి శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి పంచుకున్న విషయాలు చూస్తుంటే, ఆ చిరునవ్వు వెనుక ఎంతటి వేదన దాగుందో అర్థమవుతుంది.
Read also-Rakaasa Movie: నిహారిక స్కెచ్చ్ అదిరింది భయ్యా.. ఓవర్సీస్‌లో జాక్‌పాట్ కొట్టేసినట్టే!
ఉదయ్ కిరణ్ కేవలం తెరపైనే కాదు, నిజజీవితంలోనూ ఎంతో సున్నిత మనస్కుడు. ఆయన పెళ్లి గురించి శ్రీదేవి మాట్లాడుతూ, అది పక్కా ప్రేమ వివాహమని తెలిపారు. ఉదయ్ కిరణ్ విషిత ఒకరినొకరు ఇష్టపడ్డారని, తన ప్రేమ విషయం చెప్పడానికి ఉదయ్ ఎంతో ఆత్రుతగా తనను (అక్కను) హైదరాబాద్ రమ్మని పిలిచాడని గుర్తు చేసుకున్నారు. విషితను పరిచయం చేసేటప్పుడు ఉదయ్ కళ్ళలో ఒక తెలియని మెరుపు, ఎంతో సంతోషం కనిపించిందని ఆమె వివరించారు. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, ఉదయ్ తన భార్యను ప్రాణంగా ప్రేమించేవాడని ఆమె పేర్కొన్నారు.
బయటి ప్రపంచానికి ఉదయ్ కిరణ్ ఒక సక్సెస్ ఫుల్ హీరోగా కనిపిస్తున్నా, ఆయన కుటుంబం వరుస విషాదాలను ఎదుర్కొంది. ఉదయ్ కిరణ్ కేవలం 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన అన్నయ్యను కోల్పోయారు. సమాజంలో జరిగే అన్యాయాలను చూసి తట్టుకోలేక వారి అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం ఉదయ్‌ను మానసికగా బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత 2006లో తల్లి మరణం ఆయనను మరింత ఒంటరిని చేసింది. తల్లి చనిపోయిన తర్వాత అక్కే తనకు అన్నీ అయి చూసుకున్నారు.
ఉదయ్ కిరణ్ మరణం ఒక మిస్టరీ అని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న రోజు ఉదయం కూడా అక్కతో సుమారు 10 నిమిషాల పాటు ఎంతో సాధారణంగా మాట్లాడారు. ఆ సంభాషణలో ఎక్కడా ఆయన కుంగుబాటుకు గురైనట్లు గానీ, ప్రాణాలు తీసుకుంటాను అన్నట్లు గానీ సూచనలు ఇవ్వలేదు. పైగా, “అక్కా.. ఈ ఏడాది కచ్చితంగా గొప్ప సినిమాతో పుంజుకుంటాను (I will come back with a bang)” అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా, ఆయన మనసులో ఏదో బలమైన సంఘర్షణ జరిగి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉదయ్ కిరణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక స్వచ్ఛమైన మనసున్న మనిషి. ఆయన సినిమాల్లోని పాటలు, ముఖ్యంగా ‘మనసంతా నువ్వే’ లోని మెలోడీలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. “మంచోళ్లను దేవుడు త్వరగా తీసుకెళ్తాడు” అని శ్రీదేవి అన్న మాటలు ఉదయ్ అభిమానుల గుండెలను పిండేస్తున్నాయి. భౌతికంగా ఆయన లేకపోయినా, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆయన ఒక ‘చిరకాలం నిలిచిపోయే తార’గా ఉండిపోతారు.