Supernatural Slasher Horror : 1980ల కాలంలోనే ఒక బొమ్మతో ఆడియన్స్ ని తెగ భయపెట్టారు. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా సూపర్ నేచురల్ స్లాషర్ హారర్ రకానికి చెందినది. ఇది మంత్ర తంత్రాల వంటి అతీత శక్తులతో పాటు, ఒక హంతకుడు వరుసగా హత్యలు చేస్తూ భయపెట్టే కథ. కేవలం దెయ్యం సినిమాలా కాకుండా, ఒక బొమ్మ మనుషులను వెంటాడి వేటాడటం అనే కొత్త కోణాన్ని ఈ సినిమా అప్పట్లోనే చూపించింది. ఇందులో ఆ బొమ్మ చేసే పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తూనే, మరికొంత సేపటికి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అందుకే ఇది సాదాసీదా హారర్ సినిమాగా మిగిలిపోకుండా, ప్రపంచవ్యాప్తంగా ఒక క్లాసిక్ కల్ట్ సినిమాగా గుర్తింపు పొందింది. ఇది ఒక ప్రాంఛైజీలా మారి ఇప్పటికే ఏడు భాగాలుగా భయపెట్టింది. అంతేకాదు తెలుగులో వచ్చిన ‘అమ్మో బొమ్మ’ లాంటి సినిమాలు దీనిని చూసి పుట్టుకొచ్చినవే.
1988లో వచ్చిన హారర్ క్లాసిక్ మూవీ పేరు ‘చైల్డ్స్ ప్లే’ (Child’s Play). టామ్ హాలండ్ దీనికి దర్శకత్వం వహించగా, ఇందులో కేథరీన్ హిక్స్, క్రిస్ సరండోన్, అలెక్స్ విన్సెంట్, బ్రాడ్ డౌరిఫ్ లీడ్ రోల్స్ లో ఉన్నారు. ఈ సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘చక్కీ’ బొమ్మ పాత్ర పరిచయమైంది. ఇది మొత్తం 7 సీక్వెల్స్ తో పాటు ఒక టీవీ సిరీస్ గా వచ్చి, ఒక పెద్ద హారర్ ఫ్రాంచైజీగా మారింది. సినిమాలో విలన్ పేరు చార్లెస్ లీ రేని అప్పట్లో పేరుమోసిన ముగ్గురు నేరస్థుల పేర్లను కలిపి పెట్టారు. అలాగే ఈ సినిమా కథ అప్పట్లో పిల్లల్లో ఉన్న బొమ్మల పిచ్చిని చూసి రాశారట. అప్పట్లో గ్రాఫిక్స్ లేకపోవడంతో చక్కీ బొమ్మ కదలడానికి రిమోట్ కంట్రోల్ మిషన్లు, వైర్లు వాడేవారు. కొన్ని కష్టమైన సీన్లలో అయితే ఒక మరుగుజ్జు నటుడితో బొమ్మ వేషం వేయించి కూడా షూటింగ్ చేశారు. ఇక చక్కీ పాత్రకు వాయిస్ ఇచ్చిన బ్రాడ్ డౌరిఫ్, తన వాయిస్ భయంకరంగా రావడం కోసం రికార్డింగ్ రూమ్‌లో గట్టిగా అరుస్తూ, పరిగెడుతూ ప్రాక్టీస్ చేసేవాడట. అలా అరిచి అరిచి ఆయన కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోయేవాడు కూడా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, హారర్ సినిమాల్లో చక్కీని ఒక ఐకానిక్ విలన్‌గా మార్చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంఛైజీ Amazon Prime Video లో అందుబాటులో ఉంది.
చార్లెస్ లీ రే అనే ఒక సీరియల్ కిల్లర్ పోలీసుల కాల్పుల్లో బాగా గాయపడతాడు. ప్రాణం పోతుందని తెలిసి ఒక బొమ్మల షాపులోకి దూరి ప్రాణాలు వదులుతాడు. చనిపోయే ముందు తన దగ్గరున్న మంత్ర తంత్రాల విద్యతో తన ఆత్మను అక్కడే ఉన్న ఒక ‘గుడ్ గై’ అనే బొమ్మలోకి మారుస్తాడు. అలా ఒక కిల్లర్ ఆత్మ ఆ బొమ్మలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత యాండీ అనే ఆరేళ్ల చిన్న బాబుకు తన తల్లి ఆ బొమ్మను పుట్టినరోజు కానుకగా ఇస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ బొమ్మ తన ప్రతాపం చూపిస్తుంది. పిల్లాడికి ఇబ్బంది కలిగించే వాళ్ళని రహస్యంగా చంపడం మొదలుపెడుతుంది. తన కొడుకు చెప్తున్నది నిజమేనని, ఆ బొమ్మే ఈ హత్యలు చేస్తోందని ఆ తల్లికి తెలిసేసరికి పరిస్థితి చేయి దాటిపోతుంది. ముఖ్యంగా ఆ కిల్లర్ ఆత్మ మళ్ళీ మనిషిగా మారాలంటే, ఆ పిల్లాడి శరీరంలోకి ప్రవేశించాలి. అందుకే ఆ బాబును పట్టుకోవాలని ఆ బొమ్మ రకరకాల ప్లాన్లు వేస్తుంది. చివరికి ఆ తల్లి, ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి ఆ ప్రమాదకరమైన బొమ్మను ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ సినిమా క్లైమాక్స్.
Read Also : ఓటీటీలో మతి పోగొడుతున్న మాస్టర్ పీస్ లు… యాక్షన్ థ్రిల్లర్ లలో ఈ మూడు తోపు మావా