War Drama OTT : ఓటీటీలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ మంచి రేటింగ్ తో స్ట్రీమింగ్ అవుతోంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కాన్సంట్రేషన్ క్యాంప్ చుట్టూ సాగే ఈ సినిమాను చూస్తే గుండెలు జారిపోతాయి. జర్మనీలో హిట్లర్ హింసను ఈ సినిమా డిఫెరెంట్ గా చూపిస్తుంది. ఈ సినిమాలో హింసను నేరుగా చూపించరు. కేవలం క్యాంప్ గోడల అవతల నుండి వినిపించే అరుపులు, తుపాకీ కాల్పుల ద్వారా అక్కడ జరుగుతున్న భీభత్సాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తారు. ఒక పక్క దీని ఇన్ చార్జ్ విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, మరో పక్క ఆ ఇంటి ఎదురుగానే చావు కేకలు వినబడుతుంటాయి. ఈ సినిమాను చూస్తే మనుషులు ఇంత దారుణంగా ఎలా ఉంటారనిపిస్తుంది.
ఈ వార్ డ్రామా మూవీ పేరు ‘ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్’ (The Zone of Interest). జోనాథన్ గ్లేజర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్రిస్టియన్ ఫ్రీడెల్ ‘రుడాల్ఫ్ హాస్’ అనే క్రూరమైన కమాండెంట్ పాత్రలో నటించారు. పక్కనే వేలాది మంది చనిపోతున్నా, అది తన ఆఫీసు పనిలా భావిస్తూ, గంభీరంగా నటించి మెప్పించారు. ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ నటుడు, గాయకుడు కూడా. ఇక ఆయన భార్య ‘హెడ్విగ్ హాస్’ పాత్రలో సాండ్రా హుల్లర్ అద్భుతంగా నటించారు. తన ఇంటిని, తోటను చూసుకుంటూ చాలా గర్వంగా , మానవత్వం లేని గృహిణి పాత్రను ఆమె పండించారు. ఈ సినిమా 2024 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ సౌండ్ విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా MUBI, Amazon Prime Video ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధం టైమ్‌లో జర్మనీకి చెందిన రుడాల్ఫ్ హాస్ అనే పెద్ద ఆఫీసర్ ఒకడుంటాడు. ఇతను హిట్లర్ కు బాగా నమ్మిన బంటు కూడా. ఇతను కాన్సంట్రేషన్ క్యాంప్ మెయిన్ ఇన్‌ఛార్జ్. అంటే యూదులను గ్యాస్ ఛాంబర్లలో చంపించడం వంటి పనులకు హెడ్ అన్నమాట. ఇక ఇతను తన పెళ్లాం, పిల్లలతో కలసి సరిగ్గా ఆ క్యాంప్ పక్కనే ఒక పెద్ద బంగళా కట్టుకుని ఉంటారు. ఆ క్యాంప్ గోడకి అవతల వేలాది మందిని గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపేస్తుంటే, ఈ గోడకి ఇవతల మాత్రం వీళ్లు మొక్కలు పెంచుకుంటూ, పిక్నిక్‌లకు వెళ్తూ, ఈత కొడుతూ చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ సినిమాలో మనకి ఎక్కడా రక్తపాతం కనిపించదు. కానీ ఆ ఇంటి గోడ అవతల నుండి భయంకరమైన అరుపులు, తుపాకీ శబ్దాలు, మనుషులను కాల్చేస్తున్న పొగ గొట్టాల నుండి వచ్చే భయంకరమైన వెలుతురు ఇవన్నీ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. వీళ్ల పిల్లలు పక్కనే శవాల బూడిద పడుతున్నా పట్టించుకోకుండా ఆడుకుంటూ ఉంటారు. అంటే, పక్కనే అంత దారుణం జరుగుతున్నా మనకెందుకులే అన్నట్టు వీళ్లు బతకడం చూస్తే ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతుంది.
చివరికి హాస్‌కి వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, అతని పెళ్లాం మాత్రం ఆ బంగళా వదిలి రానని మొండికేస్తుంది. ఆమెకు తన విలాసవంతమైన జీవితమే ముఖ్యం అనుకుంటుంది. మనుషులు ఇంత రాక్షసులుగా ఎలా మారిపోతారో, పక్కవాడు చస్తున్నా తమ స్వార్థం చూసుకునే వాళ్ల మనస్తత్వం ఎంత చండాలంగా ఉంటుందో ఈ సినిమా మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.
Read Also : అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ముగింపు వరకు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు