ఇన్ స్టా గ్రామ్ చూస్తున్నప్పుడు మన మనసులో ఉన్న ఆలోచనలు అక్కడ యాడ్స్ రూపంలో ప్రత్యక్షం అవుతుండటం మనం చాలాసార్లు గమనించే ఉంటాం. కనీసం మనం ఆ ప్రోడక్ట్స్ గురించి అప్పటి వరకు సెర్చ్ చేసి ఉండకపోవచ్చు, వాటి గురించి ఇంటర్నెట్ లో వాకబు చేసి ఉండకపోవచ్చు. కానీ అవే మనకు కనపడుతుంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. పారపొటున ఇన్ స్టా ఓపెన్ చేసి మనం స్నేహితులతో ఆ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడితే ఆ వాయిస్ రికార్డ్ లను ఇన్ స్టా భద్రపరుచుకుంటుందా..? అలా మనం అనే మాటల్ని రహస్యంగా విని మనకు కావాల్సిన యాడ్స్ ని ఇన్ స్టా పేజ్ లో డిస్ ప్లే చేస్తుందా? చాన్నాళ్లుగా ఇదే విషయంపై ఆరోపణలున్నాయి. మెటా సంస్థ చేతిలో ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై కూడా ఇవే ఆరోపణలు వినిపించేవి. తాజాగా మరోసారి ఆ ఆరోపణలపై ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి స్పందించారు. అవన్నీ అభూతకల్పనలేనని చెప్పారు.
మరి యాడ్స్ ఎలా?
మనసులో మనం దేనిగురించి ఆలోచిస్తున్నామో దాని గురించి వెంటనే ఇన్ స్టా పేజ్ లో యాడ్ డిస్ ప్లే అవుతుంది. మనం సడన్ గా షాక్ అవుతాం. కనీసం దాని గురించి ఎవరికీ చెప్పకపోయినా ఎలా జరిగిందని అనుకుంటాం. మన చేతలే దానికి కారణం అంటున్నారు నిపుణులు. మనకి ఏదైనా నచ్చితే దాని గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తాం. ఆ డేటాని గూగుల్ ఇతర సంస్థలతో పంచుకుంటుంది. ఒకవేళ మనం ఏఐ టూల్ తో దేని గురించయినా మాట్లాడితే వెంటనే ఆ డేటా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తో పంచుకుంటుంది. అలా కూడా మన మనసులోని విషయాలు సోషల్ మీడియాకు తెలిసిపోతాయి. ఇంకేముంది. వెంటనే దానికి సంబంధించిన యాడ్స్ అక్కడ ప్రత్యక్షమవుతాయి. అదే అసలు కిటుకు.
Also Read: మీ పేరు, అడ్రస్, హిస్టరీ అన్నీ ట్రాక్ చేస్తున్న బ్రౌజర్లు..
మైక్రోఫోన్ అంత ప్రమాదకరమా?
వాయిస్ కాల్స్ మాట్లాడేందుకు ప్రతి ఫోన్ లో ఇన్ బిల్ట్ మైక్రో ఫోన్ ఉంటుంది. మనం ఫోన్ దగ్గర మాట్లాడే ప్రతి మాటా దానికి తెలిసిపోతుంది. అయితే ఆ మైక్రోఫోన్ ద్వారా బయటకు వెళ్లే మాటలు రికార్డ్ అవుతాయా, వాటిని ఏయే యాప్స్ రికార్డ్ చేస్తాయి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఏ కంపెనీ ఆయినా తాము నిబంధనల ప్రకారమే నడచుకుంటామని చెబుతుంది. ప్రజల వ్యక్తిగత వివరాలను తాము సేకరించము అని చెబుతుంది. అలాగే ఇన్ స్టా గ్రామ్ కూడా మైక్రోఫోన్ ద్వారా తాము ఎవరి సంభాషణలు వినడం లేదని చెబుతోంది. అంతమాత్రాన ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని గుడ్డిగా నమ్మలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు ఏ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నా దానికి అన్ని పర్మిషన్లు ఇవ్వకూడదని అంటున్నారు. మన కాల్ డేటా, ఫొటో గ్యాలరీ, వీడియో, ఆడియో ఫైల్స్ ని యాక్సెస్ చేసే పర్మిషన్లు పరిమితంగా ఇవ్వాలని సూచిస్తున్నారు. అవసరమైతే దిస్ టైమ్ ఓన్లీ అనే ఆప్షన్ ని వాడుకోవచ్చని చెబుతున్నారు.
Also Read: ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ధర కూడా రూ. 10వేల లోపే
బి-అలర్ట్..
మీరు ఎవరితోనూ మాట్లాడకపోయినా, గూగుల్ లో దేని గురించి సెర్చ్ చేయకపోయినా.. మీ మనసులో తిరుగుతున్న అంశాల గురించి యాడ్స్ ప్రత్యక్షమైతే ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివిధ యాప్స్ కి ఇచ్చే పర్మిషన్లు మరింత జాగ్రత్తగా రివ్యూ చేయాలని చెబుతున్నారు.