High Blood Sugar: ఇటీవల ఓ మహిళ బ్లెడ్ టెస్ట్‌కు సంబంధించిన వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 48 ఏళ్ల మహిళ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇందులో ఆశ్యర్యపోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా.. ? సదరు మహిళ ప్రతి రోజు వాకింగ్‌తో పాటు, సరైన ఆహార నియమాలు పాటించారు. అయినప్పటికీ ఆమె రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
సదురు మహిళ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు రక్తంలో చక్కెర 128 mg/dL, గత మూడు నెలల సగటు చక్కెర స్థాయి (HbA1c) 6.4, భోజనం తర్వాత 140 mg/dL గా ఉంది. ఆమె క్రమం తప్పకుండా నడుస్తున్నప్పటికీ, ఇటీవల పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ఆమెను ఆందోళనకు గురి చేసింది. దీంతో ఆహారం పట్ల కూడా చాలా శ్రద్ధ వహించింది. మహిళ కుటుంబంలో కూడా ఎవరికీ మధుమేహం లేదు. మరి ఆమెలో ఎందుకు చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ మహిళకు ఏడాది క్రితం మోనోపాజ్ వచ్చింది. ఈ దశలో స్త్రీలలో ఈస్ట్రోజెన అనే హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఈ హార్మోన్ల క్షీణత మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచడమే కాకుండా.. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తుంది. ఇదే హై బ్లడ్ షుగర్ కు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈస్ట్రోజెన్ రక్తంలో చక్కెరను ఎలా నియంత్రిస్తుంది ?
ఈస్ట్రోజెన్ శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కండరాలకు ఇన్సులిన్ చేరుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగేకొద్దీ లేదా మోనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినప్పుడు, ఇన్సులిన్ సున్నితత్వం క్షీణిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు, ఇతర హార్మోన్లు పెరుగుతాయి. ఈ మార్పుల వల్ల ఇన్సులిన్ స్రావం తగ్గి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది.
టైప్ 2 మధుమేహంతో పాటుగా వచ్చే ఇతర సమస్యలు ఏంటి ?
మోనోపాజ్ తర్వాత, రక్తంలో పెరిగిన చక్కెర పొట్ట చుట్టూ కొవ్వుగా మారుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ వంటి రక్త కొవ్వులు పెరిగి, అధిక రక్తపోటు, ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ వ్యాధి కూడా వేగంగా పెరుగుతుంది. మధుమేహం, తక్కువ ఈస్ట్రోజెన్ కలయిక వల్లఇన్ఫెక్షన్లు మరియు లైంగిక సమస్యలు వంటివి కూడా అధికమవుతాయి.
జాగ్రత్తలు:
బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరిగి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఇది మధుమేహం ఉన్నా లేకపోయినా.. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. అలాగే.. వ్యాయామం ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది. ఇది ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల ప్రభావితమవుతుంది.
మీ రక్తంలో చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్. మూత్రపిండాల పనితీరును క్రమం తప్పకుండా పరీక్షించుకునే అలవాటు చేసుకోండి. పోషకాలు ఎక్కువగా ఉన్న, చక్కెర తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పీచు పదార్థాలు, లీన్ ప్రోటీన్లు. అసంతృప్త కొవ్వులు ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కాల్షియం, విటమిన్ డి స్థాయిలను పరీక్షించుకుని, అవసరమైతే సప్లిమెంట్లను తీసుకోండి. పొగతాగడం మానుకోండి. ఎందుకంటే మధుమేహం, మోనోపాజ్ సంబంధిత ప్రమాదాలు పొగతాగడం వల్ల తీవ్రమవుతాయి.
హార్మోన్ థెరపీ సంగతేంటి?
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) మోనోపాజ్ తర్వాత మహిళల్లో రక్తంలో గ్లూకోజ్, కొవ్వు, కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే.. ఇది అందరికీ సరిపడకపోవచ్చు. ఎందుకంటే ఇది కొన్ని రకాల క్యాన్సర్లు, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణ సమయంలో మోనో పాజ్ వచ్చిన తర్వాత HRT వల్ల కలిగే ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ సమతుల్యం చేసుకోవాలి