మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. 65 ఏళ్ల మహిళ ధైర్యంతో చాకచక్యంగా నక్క దాడి నుంచి ప్రాణాలతో బయటపడింది. సాయంత్రం వేళ పొలంలో మేత కోస్తుండగా ఆమెపై నక్క దాడి చేసింది. దానితో దాదాపు 30 నిమిషాల పాటు పోరాడిన మహిళ, చివరికి చీర కొంగుతో నక్క గొంతుకు ఉరేసి చంపేసింది. గాయపడిన మహిళను సూరాజియా బాయి జాతవ్ గా గుర్తించారు. నక్కతో పోరాడిన తర్వాత సదరు మహిళ అపస్మారక స్థితికి చేరింది. అటుగా వచ్చిన రైతులు ఆమె పొలం ఒడ్డున పడి ఉండటాన్ని గమనించి హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స కొనసాగుతోంది.
శివపురి జిల్లాలోని బదర్వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్ఖాడి గ్రామంలో ఈ దాడి జరిగింది. సురాజియా బాయి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పశువులకు మేత కోయడానికి పొలానికి వెళ్ళింది. గడ్డి కోసి కట్ట కడుతుండగా అకస్మాత్తుగా ఆమెపై ఓ నక్క దాడి చేసింది. నక్క తొలుత ఆమె కాళ్ళు, చేతులను పదేపదే కరిచింది. షాక్ కు గురైనా ఆమెకు కాసేపు ఏం తోచలేదు. ఆ తర్వాత ఒళ్లంతా రక్తం కారుతున్నప్పటికా సురాజియా బాయి ధైర్యం కోల్పోలేదు. ఆమె రెండు చేతులతో నక్క దవడలను పట్టుకుని దాదాపు 30 నిమిషాలు పోరాడింది. ఒళ్లంతా రక్తస్రావం కావడంతో, ఆమె అలిసి పోయింది. చివరకు తన చీరలో కొంగును చించి ఉచ్చును తయారు చేసింది. దానిని నక్క మెడకు చుట్టింది. ఆ చీర కొంగును బలంగా లాగి పట్టుకుంది. తన ఒంట్లోని శక్తినంగా ఉపయోగించి చీర కొంగును గట్టిగా గుంజింది. మరోవైపు నక్కను తన కాలికింద అగణపట్టింది. ఊపిరాడక కాసేపట్లో నక్క చనిపోయింది. కాసేపటికే ఆమె కూడా స్పృహ కోల్పోయింది.
Read Also: గ్రామస్తులకు తిక్కరేగింది.. పులికి ఎరగా ఫారెస్టు అధికారులు, బోనులో పెట్టి మరీ..
గడ్డి కోసం పోలానికి వెళ్లి చీకటి అయిన రాకపోవడంతో కుటుంబ సభ్యులు కొంత మంది ఆమెను వెతుక్కుంటూ పొలానికి వచ్చారు. పొలం ఒడ్డును ఓ పక్క చనిపోయి పడి ఉన్న నక్కను, మరో పక్క సురాజియాను గమనించారు. వెంటనే ఆమెను బదర్వాస్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత శివపురి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చింది. ఆమె ఒంటి మీద 18 లోతైన గాయాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. కానీ, తల, మెడ, కడుపు లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో గాయాలు కాలేదని చెప్పారు. అందుకే, ఆమె ప్రాణాలతో బయటపడిందని డాక్టర్లు తెలిపారు. సురాజియా నక్కను చంపి తన ప్రాణాలను కాపాడుకుందనే వార్త ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందరూ ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
Read Also: ఈ దేశంలో ఇంటర్నెట్ లేదు.. సోషల్ మీడియా లేదు.. ఇంకా పాత విధానాల్లోనే జీవిస్తున్న జనం!