Hyderabad News: హైదరాబాద్‌లో తొలి రోప్‌వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది హెచ్‌ఎండీఏ. చారిత్రాత్మక గోల్కొండ కోట నుంచి కుతుబ్‌షాహి సమాధుల వరకు అనుసంధానించే ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదముద్ర వేసింది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని అంచనా వేస్తోంది.
పట్టాలపైకి హైదరాబాద్ రోప్ వే
హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోప్ వే ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హెరిటేజ్ జోన్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఐదేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్‌ను పర్యాటక శాఖ సూత్రప్రాయంగా ఆమోదించింది. అప్పటి నుంచి ఓ అడుగు ముందుకేస్తే.. మూడు అడుగులు వెనక్కి పడుతోంది.
ఈ ప్రాజెక్టు వేగంగా చేపట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ చర్యలు ప్రారంభించింది. చారిత్రక నగరంలో పర్యాటకులకు ఆకట్టుకునేందుకు గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహి టూంబ్స్ వరకు రోప్‌వే నిర్మాణం జరగనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు కిలోమీటరున్నర. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్-పిపిపి విధానంలో అభివృద్ధి చేయనుంది.
టార్గెట్ రెండేళ్లు మాత్రమే
దీనివల్ల హెచ్‌ఎండిఎపై ఆర్థిక భారం తగ్గనుంది. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు నైట్‌ఫ్రాంక్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ మూడు నెలల్లో నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణానికి ఆన్‌లైన్ బిడ్డింగ్ ప్రకటన రానుంది.
ALSO READ: స్థానిక సంస్థల ఎన్నికలు.. బండి వర్సెస్ ఈటెల కోల్డ్‌వార్
రోప్‌వే నిర్మాణం సాకారమైతే చారిత్రక ప్రదేశాలను కేబుల్‌కార్‌లలో టూరిస్టులు సందర్శించవచ్చు. ఆ తర్వాత వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక-DPR రెడీ కానుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.100 కోట్లు ఖర్చవుతుందని అధికారుల ఓ అంచనా. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కనుంది.
ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న రోప్‌వేలపై అధ్యయనం చేయనుంది నైట్‌ఫ్రాంక్ సంస్థ. నిర్మాణం, నిర్వహణ, సాంకేతిక సామర్ధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. దేశంలో మనాలి, గ్యాంగ్‌టక్, డార్జిలింగ్, సిమ్లా వంటి 12 ప్రాంతాల్లో రోప్ వేలు అందుబాటులో ఉన్నాయి. అడవులు- ఎత్తైన కొండప్రాంతాలను కలిపేటట్టుగా వినియోగంలో ఉన్నాయి.
నిటారుగా ఉన్న పర్వత ప్రాంతాలను అనుసంధానించేలా కాకుండా గోల్కొండ-కుతుబ్ షాహి ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో నిర్మించవచ్చని అధికారులు తెలిపారు. రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తయితే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వారసత్వ ప్రదేశాల మధ్య దూరం రోప్ వే అందుబాటులోకి వస్తే కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. రెండు ప్రాంతాల్లో టెర్మినల్స్ ఉంటాయి. గోల్కొండ కోట ప్రవేశ ద్వారం దగ్గర ఒకటి, కుతుబ్ షాహి సమాధుల సముదాయం వద్ద మరొకటి ఉండనుంది.
ఈ రోప్‌వేలో ఆరు సీట్ల కేబుల్ కార్లు ఉంటాయని తెలుస్తోంది. ఒక్కో రైడ్‌కు ఛార్జీలు రూ.100 నుంచి 200 వరకు ఉండే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు. రోజువారీ 5 వేల సందర్శకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీకెండ్‌లో టూరిస్టుల సంఖ్య 10 వేలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.