Kakani Govardhan Reddy: సుమారు 3 నెలలపాటు జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ మాజీ మంత్రిలో కొత్త జోష్ కనిపిస్తుందా? మరోసారి రాష్ట్రంలో తాను కీలక నేతగా మారాలని ప్రయత్నిస్తున్నారా? అధికార పార్టీకి సై అంటే సై అనే రీతిలో సవాల్ విసురుతున్నారా? ఇదే నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న చర్చ. తమ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు, తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికను రచించుకునేందుకు ఆయనకు జైలే వేదిక అయిందన్న వార్తలు సైతం వస్తున్నాయి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి..? ఏంటా కొత్త జోష్?
జైలుకెళ్లి వచ్చాక.. కాకాణిలో కొత్త జోష్..?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే.. నెల్లూరు జిల్లా రాజకీయాలు మరొక ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో వివాదం తెరపైకి వచ్చి రాజకీయ చర్చకు దారితీస్తూ ఉంటుంది. అలాంటి జిల్లాలో ప్రస్తుతం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారం సరికొత్తగా మారింది. జైలుకెళ్ళి వచ్చాక ఆయనలో కొత్త జోష్ కనిపిస్తోంది. వైసీపీ ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డితో కలిసి కొనసాగుతున్న వారిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. ఆనం కుటుంబానికి సన్నిహితంగా ఉండే కాకాణి, జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరులో మంచి పేరే తెచ్చుకున్నారు. ఒక దశలో ఆనం కుటుంబానికి కాకాణికి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే ఆయన వైసీపీ గూటికి చేరారు. వైసిపి నెల్లూరు జిల్లా కన్వీనర్ గా ఎక్కువ కాలం పని చేస్తూ పార్టీని భుజ స్కందాలపై వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ముఖ్య అనుచరుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు.
2014, 19లో సర్వేపల్లి నుంచి వరుస విజయాలు
2014లో, 2019లో రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాకాణి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ విస్తరణలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇచ్చారు నాటి సీఎం జగన్. మంత్రిగా కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత అంతకుముందు కంటే ఎక్కువ బాబు. లోకేష్, పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై లెక్క లేనన్ని కామెంట్స్ చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక కాకాణి అవినీతి వెలుగులోకి
2024 ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం కుప్ప కూలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ అవినీతిపై దృష్టి సారించారు. అందులో భాగంగా వరదాపురం వైట్ క్వార్ట్జ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్రపై ఆరా తీశారు. కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ కి వెళ్లారు కాకాణి. గతంలో ఉన్న 8 కేసుల్లో విచారణ చేపట్టి వాటిల్లోనూ రిమాండ్లు విధిస్తూ వచ్చారు. ఏకంగా 86 రోజులపాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదిగా ఉన్నారు. ఇటీవల ఆయనకు అన్ని కేసుల్లోనూ వరుసగా ఊరట లభించి బెయిల్ ఇచ్చింది హైకోర్టు.
మీడియాతో మాట్లాడొద్దు, నెల్లూరుకు రావద్దన్న షరతులు
వివిధ కేసుల్లో పిటి వారెంట్లు ఇచ్చిన సమయంలో విచారణ నిమిత్తం ఆయన జైలు నుంచి బయటికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ చిరునవ్వు నవ్వుతూ తనకోసం వచ్చిన నాయకులకు, చేతులు ఊపుతూ వెళ్లేవారు కాకాణి. ఈ క్రమంలో హైకోర్టు బెయిల్ ఇచ్చాక కొన్ని షరతులు విధించింది. కేసుల గురించి మీడియా ఎదుట మాట్లాడకూడదని, నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని, ప్రతి ఆదివారం విచారణాధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జైలు నుంచి విడుదలైన వెంటనే కాకాణి తాడేపల్లికి వెళ్లిపోయారు. అయితే అంతకుముందు జైలు వద్ద మీడియాతో గట్టిగానే మాట్లాడారు. పలు కేసులు గురించి కూడా ప్రస్తావించారు. ఇక అక్కడి నుంచి అమరావతికి వెళ్లాక హైకోర్టు ఇచ్చిన షరతులపై తిరిగి కోర్టులో పిల్ వేయగా నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టకూడదనే నిబంధన ఫై స్టే విధించింది కోర్టు..
మాజీ ఎమ్మెల్యే సతీమణికి పరమార్శ
తిరిగి నెల్లూరుకు వచ్చిన కాకాణి మొదట కావలి నియోజకవర్గం వెళ్లారు. అక్కడి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పై వివిధ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన సతీమణి ఆదిలక్ష్మిని పరామర్శించారు. స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, ప్రతి అధికారినీ గుర్తించుకుంటామని, ఖచ్చితంగా తమ ప్రభుత్వం 2029 లో వస్తుందని అన్నారు. తాము పవర్ లోకి వచ్చాక అందరి కథలూ తెలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత నెల్లూరు లోని తన నివాసానికి వచ్చిన కాకాణిని జిల్లాకి చెందిన వైసిపి నేతలు వరుసగా కలిశారు. మాజీ మంత్రి అనిల్ తో పాటు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు కాకాణితో భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ, జిల్లాలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై కాకాణితో చర్చించారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ మీడియాతో మాట్లాడిన కాకాణిలో నూతన ఉత్సాహం కనిపించింది. పక్క రోజు తన కుమార్తె పూజిత రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మాజీ సీఎం జగన్ తో తాడేపల్లిలో భేటీ అయ్యారు. తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్లో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు తో కలిసి ఫిర్యాదు చేశారు..
Also Read: ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. కాళ్లు నరికి.. రైల్వే పట్టాలపై..
ప్రస్తుతం కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ లో రాష్ట్ర నాయకత్వంలో కీలక నేతగా మారాలని ప్రయత్నం చేస్తున్నారనేది జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతోన్న చర్చ. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీతోపాటు అనేకమంది వైసీపీ నేతలు జైలుకి వెళ్లి వచ్చారు. జైలుకెళ్ళి వచ్చాక ఆ నేతలు దాదాపు సైలెంట్ అయ్యారు. కాకాణి మాత్రం నూతనోత్సాహం ప్రదర్శిస్తూ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తన జిల్లా అధ్యక్ష బాధ్యతను తిరిగి స్వీకరిస్తూ పార్టీ బలోపేతానికి కార్యచరణ రచిస్తున్నారు. అలానే తన కుమార్తె పూజిత రెడ్డికి ఇప్పటికే మహిళా భాగంకి సంబంధించి రాష్ట్ర పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కింది. ఈ నేపద్యంలో తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ పై కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారట. మొత్తానికి జైలుకెళ్ళి వచ్చాక కాకాణిలో కొత్త జోష్ వచ్చిందని నెల్లూరు వైసీపీ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. మరి ఈ జోష్ ఇలానే కొనసాగుతుందా కాకాణి భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఏంటి..? తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే..
Story By Adinarayana, Bigtv