ఫేస్ బుక్ లేకపోతే మనుషులు బతకలేరా?
ఇన్ స్టా రీల్స్ చూడకపోతే అన్నం సహించదా?
యూట్యూబ్ లో ఒక్కరోజు వీడియోలు చూడకపోతే ప్రపంచం ఆగిపోతుందా?
నేపాల్ లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే అసలు ప్రపంచం ఎటువైపు వెళ్తుందా అనిపించకమానదు. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించిందంటూ జెన్ జెడ్ గా పిలవబడుతున్న యువత రోడ్లెక్కింది. ఏదో ఆందోళనలు చేసి సరిపెట్టలేదు, అల్లరకు దిగింది, అటు పోలీసులు ప్రతాపం చూపించారు. ఘర్షణల్లో ఏకంగా 23 మంది మరణించారు, 500 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ హింస తట్టుకోలేక ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసింది. అయినా అల్లర్లు సద్దుమణగకపోవడంతో ఏకంగా ప్రధానమంత్రి రాజీనామా చేశారు. ప్రభుత్వం పడిపోయింది. అధికారం సైన్యం చేతుల్లోకి వెళ్లింది. అయినా కూడా జెన్ జెడ్ విశ్రాంతి తీసుకోలేదు. సైన్యం ముందు వారి డిమాండ్లు పెట్టి ఆందోళనలు తీవ్రతరం చేశారు.
సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఏమవుతుంది?
భారత్ లో ఆమధ్య టిక్ టాక్ ని బ్యాన్ చేశారు. ఏం జరిగింది? ప్రత్యామ్నాయం వెదుక్కున్నారు ప్రజలు. టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్లంతా ఇన్ స్టాలో రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇన్ స్టా మాయమైతే ఏం చేస్తారు? ఇంకేదో చేస్తారు కానీ రోడ్డెక్కి అల్లర్లు చేస్తారా? చేయరనే చెప్పాలి. మరి నేపాల్ లో ఎందుకింత అలజడి. దానికి వేరే కారణం ఉందని అంటోంది జెన్ జెడ్. గత 30 ఏళ్లుగా రాజకీయ నాయకులు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని అంటోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి పాలనలో సంస్కరణలు చేపట్టాలని యువత కోరుకుంటోంది. ఈ క్రమంలో.. ఉద్యమ నిర్వాహకులు సైన్యం ముందు కీలక డిమాండ్లు ఉంచారు.
నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించాలని, వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించి రాష్ట్ర గౌరవం, గుర్తింపు ఇవ్వాలని, నిరుద్యోగం, వలస, సామాజిక అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, కొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిషేధం లేకపోతే రీల్స్ చేసుకునేవారేనా?
డిమాండ్లు బాగానే ఉన్నాయి కానీ, దానికోసం జెన్ జెడ్ ఎంచుకున్న మార్గం సరైనది కాదు అంటున్నారు విశ్లేషకులు. అంత సామాజిక స్పృహ ఉన్నవారు, రాజ్యాంగాన్నే మార్చేయాలని అడుగుతున్నవారు.. ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు. సోషల్ మీడియా బ్యాన్ తర్వాతే వారంతా ఎందుకు రోడ్లపైకి వచ్చారు. ఒకవేళ సోషల్ మీడియాని ప్రభుత్వం నిషేధించకపోయి ఉండి ఉంటే.. వీరిలోని చైతన్యం ఎక్కడికి పోయేది. ఎంచక్కా రీల్స్ చేసుకుంటూ, ఇన్ స్టా లో పోస్ట్ లు పెట్టుకుంటూ మరింత బద్ధకంగా ఉండేవారు కదా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. సోషల్ మీడియాపై బ్యాన్ లేకపోయి ఉంటే ఇప్పుడు బయటకొచ్చిన ఆందోళనకారులంతా పేపర్ పులులుగా మిగిలిపోయేవారేమో.
బోర్ కొట్టిన రాజ్యాంగం?
నేపాల్ లో ఉన్నది రాజరికం కాదు, నియంతృత్వం అంతకంటే కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వమే అక్కడ ఉంది. ప్రజాస్వామ్యాన్ని మించిన ప్రభుత్వ పాలనను నేపాల్ యువత కోరుకుంటోంది అంటే నిజంగా ఆశ్చర్యం అనిపించక మానదు. దఫ దఫాలుగా నేపాల్ లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1948లో గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ద్వారా తొలిసారి రాజ్యాంగం ఏర్పడింది. 2007లో ఇంటీరియమ్ కానిస్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ ద్వారా రాజరిక వ్యవస్థను పూర్తిగా తొలగించారు. 2015 సెప్టెంబర్ 20న పూర్తిస్థాయి రాజ్యాంగం నేపాల్ లో అమల్లోకి వచ్చింది. దీని ద్వారా నేపాల్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మారింది. అంటే పదేళ్లలోనే ఆ రాజ్యాంగంపై ప్రజలకు విసుగొచ్చిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సైన్యం ఏం చేస్తుంది?
అల్లర్లను నియంత్రించడం సైన్యానికి కూడా సాధ్యం కావడం లేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేడి చల్లారే వరకు సైన్యం ఓపిక పట్టడం ఒకటే మార్గం. అదీ కుదరకపోతే రాజ్యాంగాన్ని మార్చడం ఎలా అనేదానిపై కసరత్తులు జరగాలి. రాజ్యాంగ సవరణలకు మార్గాలుంటాయి కానీ, పూర్తిగా రాజ్యాంగాన్నే మార్చడం అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో అది అనుకున్నంత సులభం కాకపోవచ్చు. పోనీ జెన్ జెడ్ కి రాజ్యాంగం రాసే అవకాశం ఇస్తే ఇన్ స్టా లో అత్యథిక ఫాలోవర్లు ఉన్నవారే ప్రధాని పదవికి అర్హులు అనే ఆర్టికల్స్ కనపడతాయేమో. మొత్తమ్మీద నేపాల్ లో యువత సరైన దారిలో వెళ్తున్నట్టు లేదని స్పష్టమవుతోంది. అకారణంగా 33మంది మరణానికి వారు కారణం అయ్యారు. వందల కోట్ల ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు జెన్ జెడ్ మనసుల్ని కరిగిస్తాయో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.