Bandi Sanjay Vs Etela: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీలో చిచ్చు రేపుతున్నాయా? నాయకుల మధ్య సయోధ్యం కుదరడం లేదా? ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసేవరకు వెళ్లిందా? ఇంతకీ ఆ ఇద్దరు నేతలెవరు? కార్యకర్తలు ఏమన్నారు? ఇంటా బయటా ఇదే చర్చ మొదలైంది.
కరీంనగర్ కమలంలో వర్గపోరు
బీఆర్ఎస్ విపక్షానికి పరిమితం కావడంతో తెలంగాణలో బలపడాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. సమయం, సందర్భానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. కాకపోతే గ్రూపుల రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఆయా నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ఇద్దరు నేతల్లో ఒకరు కేంద్రమంత్రి బండి సంజయ్ కాగా, మరొకరు ఎంపీ ఈటెల రాజేందర్. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలో ఎవర్ని కదిపినా చెబుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ నేతలు తమ పట్టు నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హుజురాబాద్ పార్టీ నేతల విషయంలో మొదలైన వివాదం ముదిరిపాకాన పడింది. కొంతకాలంగా ఇరువురు మధ్య వర్గ పోరు నడుస్తోంది.
ALSO READ: జగ్గారెడ్డి సంచలన నిర్ణయం, రాజకీయాలకు దూరం
ఒకరికొకరు పేర్లు ప్రస్తావించకుండానే డైలాగ్ వార్‌కి దిగారు. స్థానిక సంస్థలు దగ్గర పడుతున్న వేళ మరోకసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. వర్గ పోరు ఈటెలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందని సొంత జిల్లాలో గుసగుసల మొదలయ్యాయి. తనను నమ్మి వచ్చిన అనుచరులకు నియోజకవర్గంలో విలువ లేకపోవడంతో ఈటెల ఆగ్రహాంతో రగిలి పోతున్నారట.
వాస్తవానికి ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గానికి ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. పలుమార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. బీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న సమయంలో విభేదాల కారణంగా కాషాయి కండువా కప్పుకొన్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఓడిపోవడం, మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటి చేసి గెలవడం జరిగిపోయింది.
ఓడిపోయన తర్వాత చాలా రోజులు హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు దూరంగా ఉండిపోయారు. బీజేపీలో చేరిన తర్వాత క్యాడర్ బలంగా తయారు అయ్యిందని, ఎంపిగా బండి సంజయ్ గెలుపులో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజారిటి వచ్చిందనేది ఈటెల అభిప్రాయం.
కలకలం రేపుతున్న ఈటెల వ్యాఖ్యలు
ఇటీవల పార్టీ పదవుల పంపకాల్లో జిల్లా, మండల కమిటీల నియామకంలో ఈటెల అనుచరులకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఘాటుగానే విమర్శలు చేశారు ఈటెల. తాను రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్‌లతో కోట్లాడి వచ్చినవాడినని, నీ ప్రతాపం ఏంటంటూ చేసిన వ్యాఖ్యలు చేసిన కలకలం రేపుతున్నాయి.
ఎంపీ ఈటెలపై హుజురాబాద్ పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారట. దసరాకి కమలాపూర్‌లోని తన ఇంటికి వచ్చిన ఈటెల, అనుచరులతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. టికెట్ రాకపోతే ఎవ్వరూ బాధపడవద్దని, అవసరమైతే అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీనుండి టికెట్ ఇప్పించి గెలిపించుకుంటానని హామీ ఇచ్చారట.
ఈ వ్యవహారం ఇప్పుడు కమలంలో కలకలం రేపింది. బీజేపీలో ఉంటూ మరో పార్టీ నుండి టికెట్ ఇప్పిస్తానని ఎలా అన్నారని హుజురాబాద్ బీజేపీ క్యాడర్ కారాలు మిరియాలు నూరుతోంది. కొత్త- పాత నాయకులంటూ విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
దీనిపై రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలేమోగానీ జిల్లాలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నట్లు కనిపిస్తోంది. విభేదాల రాజకీయ క్రీడలో ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు చిత్తవుతారో చూడాలి.