Realme Narzo 90 Series 5G: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ.. త్వరలో భారత మార్కెట్‌లోకి Narzo 90 సిరీస్ 5G ఫోన్లను విడుదల చేయనుంది. ఇది 2025 డిసెంబరు 16 తర్వాత రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో వచ్చిన Narzo 80 సిరీస్‌కు తర్వాతి అప్‌డేట్‌గా నిలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. దాని ప్రకారం రియల్‌మీ నుంచి రాబోతున్న కొత్త ఫోన్‌లో భారీ బ్యాటరీ, మెరుగైన కెమెరాలు, 5G కనెక్టివిటీ వంటి కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండబోతున్నట్టు టెక్ నిపుణుల అంచనా.
ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా రియల్‌మీ కొత్త సిరీస్‌ను పరిచయం చేయనున్నట్లు లీక్స్ సూచిస్తున్నాయి. రియల్‌మీ కంపెనీ కూడా ఈ ఫోన్లను Amazon Specials అని ప్రకటించింది. అంటే.. ఇవి అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయించబడే అవకాశం ఉంది. సంస్థ పంచుకున్న వివరాల ఆధారంగా.. కామిక్-స్టైల్‌లో రూపొందించిన టీజర్‌లో రెండు వేర్వేరు కెమెరా లేఅవుట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇవి రెండు వేర్వేరు మోడల్స్ అని అంచనా వేయవచ్చు.
రియల్‌మీ నుంచి రాబోతున్న Narzo 90 సిరీస్‌లో ఒక ఫోన్ కెమెరా డిజైన్ iPhone 16 Pro Max లాగా ఉంటుంది. మరొక ఫోన్ చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌తో వస్తోంది. ఈ మోడల్ Narzo 90x 5G అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు ఫోన్లు రియల్‌మీ కొత్త స్టైల్ ట్రెండ్‌ను అనుసరిస్తూ, ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి రానున్నాయి.
ఇకపోతే.. ఫ్లాట్ ఫ్రేమ్స్, రౌండెడ్ కార్నర్స్ లాంటి ప్రీమియం లుక్ డిజైన్‌తో ఈ ఫోన్లు రావొచ్చని స్పష్టంగా తెలుస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. దీని గురించి అమెజాన్ ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే, వెబ్‌సైట్‌లో మాత్రం ‘Super Charged’, ‘Power maxed’ వంటి పదాలు ఉండటంతో, భారీ బ్యాటరీలు, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే, Snap Sharp అనే ట్యాగ్ రియల్‌మీ నార్జో 90 సిరీజ్ 5జీ ఫోన్ల కెమెరా పని తీరును సూచిస్తోంది. దీంతోపాటు Glow Maxed అనే పదం ఎక్కువ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని సూచిస్తుంది.