PS5 Price Hike| గేమింగ్ ప్రియులకు ప్లేస్టేషన్, XBOX కన్సోల్స్ ఎంతో ఇష్టం. మరీ ముఖ్యంగా ప్లేస్టేషన్‌కు డిమాండ్ ఎక్కువ. ప్లేస్టేషన్ తయారు చేసి సోనీ కంపెనీ తాజాగా గేమింగ్ ఇష్టపడే వారికి గట్టి షాకిచ్చింది. ప్లేస్టేషన్ 5 (PS5) ధరలను మళ్లీ పెంచింది. PS5 ధరలు కొన్ని నెలల క్రితమే సోనీ పెంచింది. అయితే ఇప్పుడు కొత్త ధరలు ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వస్తాయి.
స్టాండర్డ్ డిస్క్ వెర్షన్ ధర ఇప్పుడు $649.99 అయింది (ఇంతకు ముందు $549.99).
డిజిటల్ ఎడిషన్ ధర $599.99కి పెరిగింది (ఇంతకు ముందు $499.99).
అత్యంత ఖరీదైన PS5 Pro మోడల్ ధర ఇప్పుడు $899.99 అయింది (ఇంతకు ముందు $749.99).
ఒక సంవత్సర కాలంలో సోనీ ధరలు పెంచడం ఇది రెండోసారి. గత ఆగస్టు నెలలో సోనీ సుమారు $50 పెంచింది. రెండుసార్లు పెంచిన ధరలు కలిపితే స్టాండర్డ్ PS5 ధర ఇప్పుడు $100 ఎక్కువ అయింది.
PS5 లాంచ్ సమయంలో ధర $499.99 ఉండేది. అయితే ఇప్పుడు సుమారు $650కి చేరింది. PS5 Pro 2024లో $699.99కి విడుదల అయింది. 18 నెలల్లోనే దాదాపు $900కి చేరుకుంది.
ఈ ధర పెంపు సోనీకి మాత్రమే పరిమితం కాదు. మైక్రోసాఫ్ట్ Xbox కన్సోల్స్ ధరలు పెంచింది. నింటెండో కంపెనీ కూడా Switch ధరను $299 నుంచి $339కి పెంచింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా గేమర్లు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది.
ఈ ధర పెంపు వెనుక పలు కారణాలు ఉన్నాయి. అమెరికాలో వాణిజ్య సుంకాలు (టారిఫ్స్) ఎలక్ట్రానిక్ భాగాల దిగుమతి ఖర్చును పెంచాయి. ఉక్రెయిన్, ఇరాన్ సంఘర్షణలు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. ఇది రవాణా, తయారీ ఖర్చులను పెంచింది. మరొక ప్రధాన కారణం ర్యామ్ ధరల పెరుగుదల. AI డేటా సెంటర్లు ఎక్కువ మెమరీ కావాలని డిమాండ్ చేయడం వల్ల ర్యామ్ ధరలు పెరిగాయి. దీని వల్ల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఖర్చు పెరిగింది.
సోనీ ఇంకా భారతదేశంలో అధికారికంగా కొత్త ధరలు ప్రకటించలేదు. అయితే గత సంవత్సరం డిజిటల్ ఎడిషన్ ధరను రూ.44,990 నుంచి రూ.49,990కి పెంచింది. ఆ సమయంలో ఏ ప్రకటన చేయకుండా సైలెంట్‌గా ధరలు పెంచేసింది. డిస్క్ వెర్షన్ అప్పటికి రూ.54,990 వద్దే ఉంది. ఇప్పుడు గ్లోబల్ మార్పుల వల్ల భారతీయ గేమర్లు కూడా త్వరలో ధరల పెరుగుదల చూడవచ్చు.
Also Read: ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే వాషింగ్ మెషిన్స్.. బడ్జెట్‌లో 5-స్టార్ రేటింగ్‌తో బెస్ట్ ఇవే
కొత్త తరం కన్సోల్ కొనాలంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు కావాలి. బడ్జెట్ తక్కువ ఉన్నవారు కొనకుండా వేచి ఉండవచ్చు. కొందరు పాత కన్సోల్స్ లేదా PC గేమింగ్ వైపు మొగ్గు చూపవచ్చు. డిస్కౌంట్లు లేదా ఫెస్టివల్ ఆఫర్ల కోసం వేచి ఉండే వారు కూడా ఉంటారు.
సోనీ ధరలు.. పెంచడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సవాళ్లను ప్రతిబింబిస్తోంది. గేమింగ్ హార్డ్‌వేర్ కూడా ద్రవ్యోల్బణం, సరఫరా సమస్యలకు మినహాయింపుకాదు. ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచడం వల్ల గేమర్లకు చౌక ఆప్షన్లు తగ్గాయి. రాబోయే నెలల్లో గేమర్లు ఈ ధరల పెంపునకు ఎలా స్పందిస్తారో చూడాలి.
ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ప్లేస్టేషన్ ధరలు.. సోనీ కంపెనీ ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కస్టమర్లు ధరలు జాగ్రత్తగా చెక్ చేసి కొనుగోలు చేయాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ప్లేస్టేషన్ PS5 ధరలు, ఉండవచ్చు. ధర విషయంలో ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు. పై తెలిపిన వివరాలు మీ అవగాహన కోసమే.