How to clean phone back panel: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఫోన్ చేతిలోనే ఉంటుంది. దీనివల్ల ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై (వెనక భాగం) చెమట, దుమ్ము, వేలి ముద్రలు పడి మురికిగా మారుతుంది. అయితే..చాలా మంది ఆ మురికిని వదిలించడానికి ఇంట్లో దొరికే ఏ లిక్విడ్ పడితే అది, ఏ క్లాత్ పడితే అది పెట్టి గట్టిగా రుద్దేస్తుంటారు. పైకి ఇది క్లీనింగ్‌లా కనిపించినా.. లోపల మీ ఫోన్‌కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. మీరు కూడా ఇలాంటి తప్పులే చేస్తున్నారా?..
మీ ఫోన్‌ను ముంచేసే ప్రమాదకర తప్పులు:
మొబైల్ స్క్రీన్‌ను జాగ్రత్తగా చూసుకున్నంతగా చాలా మంది బ్యాక్ ప్యానెల్‌ను పట్టించుకోరు. మురికి ఎక్కువైనప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఫోన్ వెనక భాగాన్ని తప్పుడు పద్ధతుల్లో క్లీన్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో, అలాగే సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
1. శానిటైజర్లు, నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకం:
కరోనా సమయం నుంచి చాలా మందికి ఫోన్‌లపై శానిటైజర్ స్ప్రే చేసే అలవాటు పడిపోయింది. అలాగే కొందరు లేడీస్ నెయిల్ పాలిష్ రిమూవర్ వాడుతుంటారు. స్మార్ట్‌ఫోన్ల వెనుక భాగం ప్లాస్టిక్, గ్లాస్ లేదా లెదర్ మెటీరియల్‌తో వస్తుంది. వీటిపై ఒక ప్రత్యేకమైన ప్రొటెక్టివ్ కోటింగ్ ఉంటుంది. శానిటైజర్‌లోని ఆల్కహాల్ లేదా రిమూవర్లలోని కెమికల్స్ ఆ కోటింగ్‌ను పూర్తిగా దెబ్బతీస్తాయి. దీని వల్ల ఫోన్ రంగు వెలిసిపోవడమే కాకుండా.. ప్లాస్టిక్ ప్యానెల్స్ అయితే మెల్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
2. కఠినమైన బట్టలు, టిష్యూ పేపర్లు :
ఫోన్ మురికిగా ఉందని జీన్స్ ప్యాంట్ కో, దొరికిన టవల్ కో లేదా కిచెన్ టిష్యూ పేపర్లకో పెట్టి గట్టిగా రుద్దడం మనం రోజూ చూసేదే. చూడటానికి టిష్యూ పేపర్లు సాఫ్ట్‌గా ఉన్నా, వాటి ఫైబర్స్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ ప్యానెల్‌పై మైక్రో-స్క్రాచెస్ (కంటికి కనిపించని గీతలు) పడేలా చేస్తాయి. రోజులు గడిచేకొద్దీ మీ ఫోన్ బ్యాక్ ప్యానెల్ తన మెరుపును కోల్పోయి పాతదానిలా తయారవుతుంది.
3. డైరెక్ట్‌గా నీళ్లు చల్లడం లేదా సోప్ వాటర్ వాడకం:
ఫోన్ ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉందని చాలా మంది ధైర్యంగా దాన్ని బేసిన్ దగ్గరకు తీసుకెళ్లి నీళ్లతో కడిగేస్తుంటారు. వాటర్ రెసిస్టెంట్ అనేది కేవలం ప్రమాదవశాత్తు నీళ్లలో పడితే కాపాడడానికే కానీ.. కావాలని కడగడానికి కాదు. ఫోన్ కెమెరా గ్లాస్ చుట్టూ, స్పీకర్ గ్రిల్స్, ఛార్జింగ్ పోర్ట్ ద్వారా నీరు లోపలికి వెళ్లి మదర్ బోర్డ్ షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేస్తుంది.
మరి బ్యాక్ ప్యానెల్‌ను సేఫ్‌గా క్లీన్ చేయడం ఎలా?
మీ ఫోన్ ఎప్పుడూ కొత్తదానిలా మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ అండ్ సేఫ్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
మైక్రోఫైబర్ క్లాత్ వాడండి: కంటి అద్దాలు తుడిచే లేదా ల్యాప్‌టాప్ క్లీన్ చేసే ‘మైక్రోఫైబర్’ క్లాత్ మాత్రమే వాడండి. ఇది చాలా సాఫ్ట్‌గా ఉండి ఎలాంటి గీతలు పడకుండా చూస్తుంది.
ఐసోప్రోపైల్ ఆల్కహాల్ : ఒకవేళ మొండి జిడ్డు ఉంటే.. నేరుగా ఫోన్‌పై కాకుండా.. మైక్రోఫైబర్ క్లాత్‌పై ఒకటి లేదా రెండు చుక్కల ఐసోప్రోపైల్ ఆల్కహాల్ (ఇది ఎలక్ట్రానిక్స్ క్లీనింగ్ కోసం దొరుకుతుంది) వేసి సాఫ్ట్‌గా తుడవండి.
మొబైల్ వైప్స్ : మార్కెట్లో ప్రత్యేకంగా లభించే మొబైల్ స్క్రీన్ క్లీనింగ్ వైప్స్ వాడటం అన్నిటికంటే బెస్ట్.
ఫోన్ స్విచాఫ్ చేయండి: క్లీన్ చేసే ముందు ఎప్పుడైనా ఫోన్‌ను స్విచాఫ్ చేసి, ఛార్జింగ్ కేబుల్ తీసేసి, బ్యాక్ కవర్‌ను వేరు చేసిన తర్వాతే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి.
వేల రూపాయలు పెట్టి కొనుక్కునే స్మార్ట్‌ఫోన్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే దాన్ని క్లీన్ చేసే పద్ధతి కూడా అంతే క్లాస్‌గా ఉండాలి. చిట్కాలు ఫోన్‌లపై ప్రయోగిస్తే.. సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తప్పుడు పద్ధతులకు బైబై చెప్పేసి, పైన చెప్పిన సేఫ్ టిప్స్ ఫాలో అవ్వండి. మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోండి.