ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద తప్పు చేసినట్టు తెలుస్తున్నది. ఈ విషయం మొన్నటివరకు ఎవరికి తెలియరాలేదు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్లపై నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు గడువు ముంచుకొస్తున్న తరుణంలో ఆయన త్వరగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే శాసనసభ స్పీకర్‌కు అత్యున్నత న్యాయస్థానం రెండు చాన్సులు ఇచ్చింది.ఇకమీదట ఇచ్చేది లేదని ఇదే చివరి అవకాశం అని స్పష్టంచేసింది. ఈలోపు విచారణ పూర్తి చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయిన విషయం తెలిసిందే.
దానం నాగేందర్‌తో పాటు మరో 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గతంలో ప్రచారం జరిగింది. వారంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు పెద్దఎత్తున ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారం చేసింది.దీంతో పాటు వారిపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అఫిడవిట్ ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కోర్టు ఆ నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేసింది.ఈ క్రమంలోనే విచారించిన స్పీకర్ సుమారు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని.. వారంతా కారు పార్టీలోనే ఉన్నారని వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
అయితే, మొన్నటివరకు దానం నాగేందర్ కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి మరల సికింద్రాబాద్ ఎంపీగా ఆ పార్టీ బీఫాంతో పోటీ చేసి ఓడిపోయారని ప్రచారం చేశారు గులాబీ నేతలు.. అంతకుముందు దానం నాగేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఎక్కడా ప్రకటించలేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్‌లో బీఆర్ఎస్ పేర్కొన్నట్టు బుధవారం స్పీకర్ ఎదుట విచారణకు హాజరైన బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రివీల్ చేశారు. ఆయన సైతం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం మీద అనర్హత వేటు వేయాలని, అందుకు తగిన సాక్ష్యాధారాలను స్పీకర్‌కు అందజేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దానం తరఫు లాయర్లు బీఆర్ఎస్ ఆయన్ను సస్పెండ్ చేసిన విషయాన్ని ఏలేటికి వివరించినట్టు విచారణ అనంతరం బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు.
BRS Party: తెలంగాణలో గులాబీకి గడ్డుకాలం.. ఇకనైనా కేసీఆర్ బయటకొస్తారా?
దానంను బీఆర్ఎస్ నిజంగా సస్పెండ్ చేస్తే ఆయన ఏ పార్టీలోనైనా చేరొచ్చు. ఆ పార్టీ గుర్తుపైనా పోటీ చేయొచ్చు. ఈ విషయం మరిచిన బీఆర్ఎస్ నేతలు ఆయనపై అనర్హత వేయాలని ఎలా డిమాండ్ చేస్తున్నారని.. అసలు ఈ కేసు నిలబడదని.. బీఆర్ఎస్ ఇంత పెద్ద తప్పు చేసి ఎందుకు ఈ విషయాన్ని దాచి రాజకీయాలు చేస్తుందని ఏలేటి ప్రశ్నించారు. దానం నాగేందర్‌ను సస్పెండ్ చేయకముందు అనర్హతపై మాట్లాడితే బాగుండేదని.. ఇప్పుడు ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఎలా చెబుతారని అడిగారు.ఇదిలాఉండగా..స్పీకర్ నోటీసులపై దానం ఏవిధంగా స్పందించారు. ఆయన బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పారా? అనేది తెలియరాలేదు. స్పీకర్ నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.