
YouTube: యూట్యూబ్ వ్యూస్ కోసం చేసిన వీడియో వారిని కటకటపాలు చేసింది. కొత్తగా ట్రై చేద్దామని చేసి చివరికి జైళ్లో ఊసలు లెక్కపెడుతున్నారు. ములుగు జిల్లాలోని కొందరు యువకులు యూట్యూబ్ లో తమ చానల్ లో వ్యూస్ పెంచుకోవడం కోసం కొత్త రకం ఆలోచన చేశారు. అది కాస్త బెడిసి కొట్టడంతో వైల్డ్ లైఫ్ కేసులో బుక్ అయ్యి జైలు పాలైన ఘటన హాట్ టాపిక్ గా మారింది.
ములుగు జిల్లా నాయినిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు యూట్యూబ్ లో విలేజ్ థింగ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎన్ని వీడియోలు అప్ లోడ్ చేసినా సరైన వ్యూస్ రాకపోవడంతో ఏదైనా ఢిఫరెంట్ గా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా అయితేనే యూట్యూబ్ లో వ్యూస్ వస్తాయని అనుకున్నారు. అందులోభాగంగా నే అడవిలో వేటకు సంబంధించిన వీడియోలు చేయడం ద్వారా ఎక్కువ వ్యూస్ సంపాదించాలని ఆలోచన ఒకటి చేశారు.
అనుకున్నట్టే అడపలతో వేట-ఇది మా ప్రాచీన పద్ధతి అనే టైటిల్ పెట్టి ఓ వీడియో అప్ లోడ్ చేశారు. అడవిలో అడపలతో అడవి కోళ్లను వేటాడామని వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ రాకపోగా అది కాస్త ఫారెస్ట్ ఆఫీసర్ల కంట పడింది. దీంతో ఆ వీడియోలో ఉన్న ముగ్గురు యువకులు శ్రీకాంత్, సురేష్, శ్రీకాంత్ లపై ఫారెస్ట్ పోలీసులు వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
అయితే ఆ వీడియోలలోని యువకులు మాత్రం తాము ఉచ్చును బిగించిన మాట వాస్తవమే కానీ అది అడవి ప్రాంతంలో కాదని చెబుతున్నారు.