Telangana floods: గత 48 గంటలుగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్లా, సిద్దిపేట జిల్లాలు అత్యధిక ప్రభావం ఎదుర్కొన్నాయి. వరుసగా కురిసిన వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లి, తక్కువ ఎత్తులో ఉన్న వసతి కాలనీలు, వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యాయి.
అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన శాఖ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షణ చర్యలు చేపట్టింది.
రక్షణ చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ధైర్యం
వర్షాలు ఆగకపోయినా, రాత్రింబవళ్లు కృషి చేస్తూ ఫైర్ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 31 ప్రధాన రక్షణ చర్యల్లో 1,646 మంది బాధితులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ క్రమంలో రైతులు, గొర్రెల కాపరులు, చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, పశువులు వంటి వారిని రక్షించడం ద్వారా అగ్నిమాపక సిబ్బంది తమ ధైర్యాన్ని చాటారు. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ పరిసరాల్లో బుధవారం అర్ధరాత్రి 11:30 గంటల వరకు సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేశారు.
డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మా సిబ్బంది చేసిన కృషి పట్ల గర్వంగా ఉంది. తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించడంలో మా సిబ్బంది చూపిన ధైర్యం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.
సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గని ధైర్యం
ఈ రక్షణ చర్యల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా సిబ్బంది వెనక్కి తగ్గలేదు. కొన్నిచోట్ల లైట్ రెస్క్యూ వాహనాలు (LRVs), గాలితో నింపే రబ్బరు పడవలు (IRBs) దెబ్బతిన్నాయి. అలాగే లైఫ్ జాకెట్లు, లైఫ్ బ్యూయ్స్ కూడా వినియోగించలేని స్థితికి చేరాయి. కామారెడ్డిలో ఇద్దరు సిబ్బంది వాహనంతో సహా వరద నీటిలో కొట్టుకుపోయినా, తమ శిక్షణ, చాకచక్యంతో సురక్షితంగా బయటపడ్డారు.
నేరుగా పర్యవేక్షించిన DG
డైరెక్టర్ జనరల్ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి చర్యలను పర్యవేక్షించారు. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, సిబ్బందిని ధైర్యం చెప్పారు. గురువారం మధ్యాహ్నానికి అన్ని ప్రధాన రక్షణ చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి. జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం, రెవెన్యూ శాఖతో సమన్వయం చేస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అగ్నిమాపక సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించారు.
తప్పుడు ప్రచారంపై క్లారిటీ
అయితే, కొన్ని సంఘటనల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. కామారెడ్డిలోని ఒక అపార్ట్‌మెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వ్యక్తి రక్షణ చర్యలకు అడ్డంకిగా మారిన ఘటనను వివరించారు. రాత్రి 11:30 నుంచి 11:45 గంటల మధ్య సిబ్బంది రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆ వ్యక్తి అప్పుడు సహకరించలేదని తెలిపారు. అయితే, అదే సమయంలో ఆయన ముగ్గురు పొరుగువారిని మాత్రం సిబ్బంది సురక్షితంగా తరలించారు. అనంతరం ఆ వ్యక్తి నిరంతరం ఉన్నతాధికారులకు కాల్స్ చేసి అత్యవసర ఆపరేషన్లలో అంతరాయం కలిగించాడని, ఈ వివరాలను ఆపరేషన్స్ ఇన్‌చార్జ్ RFO సుధాకర్ నివేదించారని తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి
డైరెక్టర్ జనరల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, విపత్తుల సమయంలో రక్షణ బృందాలకు సహకరించాలి. సిబ్బంది సూచనలను పాటించడం ద్వారా రక్షణ చర్యలు వేగవంతంగా జరుగుతాయి. తప్పుడు సమాచారం లేదా విమర్శలు ఫ్రంట్‌లైన్ సిబ్బంది ధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తాయని హెచ్చరించారు. అగ్నిమాపక విపత్తు స్పందన శాఖ ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే తమ ప్రధాన కర్తవ్యమని, భవిష్యత్తులో కూడా అదే కృషిని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.
ఈ క్లిష్ట సమయంలో అగ్నిమాపక శాఖ చూపిన తక్షణ స్పందన, సమన్వయపూర్వక చర్యలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయి. వరదలతో కుదేలైన జిల్లాల్లో ప్రజలకు ఆశాజ్యోతి లాంటి సేవలను అందించడం ద్వారా, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ మానవత్వాన్ని మరోసారి నిరూపించింది.