Indian Constitution: భారత దేశం అంటేనే లౌకిక దేశంగా పేరు. ఇపుడా లౌకిక అనే పదాన్నే తీసెయ్యాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయ్. అలాగని ఇది అందరి నుంచీ కాదు.. ఒక సెక్షన్ నుంచి మాత్రమే ఈ తరహా డిమాండ్ వినవస్తోంది. మొదట ఈ డిమాండ్ ఎవరు లేవనెత్తారు? తర్వాత దీనికి కొనసాగింపు ఎలా జరుగుతోంది? దీనిపై కాంగ్రెస్ కామెంట్ ఏంటి?
రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగించాలి దత్తాత్రేయ హొసబెలే
రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని RSS నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఎమర్జెన్సీ సమయంలో ఈ పదాలను కాంగ్రెస్ బలవంతంగా చేర్చిందని, దీనిపై చర్చ జరగాలని దత్తాత్రేయ హొసబెలే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ మాస్క్ తొలిగిపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆరెస్సెస్.. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని చూస్తున్నాయని.. రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇందుకు కొనసాగింపుగా ఉపరాష్ట్రపతి ధన్కర్ సైతం ఇదే వాయిస్ వినిపించారు. రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, లౌకిక అనే పదాలను జోడించడం సనాతన స్ఫూర్తికి విరుద్దమని అన్నారాయన.
నాటి ఎమర్జెన్సీ దేశానికి చీకటి కాలం-ధన్కర్
1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి దేశ రాజ్యాంగానికే చీకటి కాలమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. సోషలిస్ట్, సెక్యులరిస్ట్ పదాలు ప్రవేశికలో ఉండాలా వద్దా? అనే దానిపై చర్చ జరగాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబెలే చెప్పిన రెండు రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇదో చర్చనీయాంశమైంది. దిగారు. అంతే కాకుండా సనాతన ధర్మానికి విరుద్ధం అన్న కామెంట్లు సైతం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఇదే అంశంపై కామెంట్ చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి అయిన శివరాజ్ సింగ్.. భారతదేశంలో సోషలిజం అవసరం లేదని అన్నారు. లౌకిక వాదం మన సంప్రదాయం కాదని అన్నారు. ఎమర్జెన్సీలో వీటిని చేర్చారనీ.. ఇది అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో భాగం కానే కాదని అన్నారాయన. ఎమర్జెన్సీ @ 50 అనే కార్యక్రమం న్యూ ఢిల్లీలో జరిగింది. ఈ సంర్భంగా మాట్లాడిన హొసబెలే.. ఈ దిశగా పిలుపునివ్వడంతో మొదలైందీ చర్చ. అత్యవసర పరిస్థితిలో ప్రాధమిక హక్కులు నిలిచిపోయాయనీ, పార్లమెంటు పని చేయలేదనీ, న్యాయవ్యవస్థ కుంటుబడిందనీ.. ఆ తర్వాతే ఇవి జోడించబడ్డాయని ఆయన అన్నారు.
వారణాసి ఎమర్జెన్సీ @50 ప్రోగ్రాంలో శివరాజ్ వ్యాఖ్య
50 ఏళ్ల ఎమర్జెన్సీ పురస్కరించుకుని వారణాశిలో జరిగిన కార్యక్రమంలో.. చౌహాన్ మాట్లాడుతూ. భారత్ మే సమాజ్ వాద్ కీ జరూరత్ నహీ హై, ధర్మ నిరపేక్ష్ హమార సంస్కృతి కా మూల్ నహి హై.. ఔర్ ఇస్లీయే పర్ జరూర్ విచార్ హోనా చాహియే.. అన్నారు. దీనర్ధమేంటంటే.. భారతదేశంలో ఈ రకమైన పదాలు మనకు అవసరం లేదని అన్నారు చౌహాన్. కాబట్టి, దీనిపై చర్చించాలి అన్నది ఈ వ్యాఖ్యల సారాంశం. ఒకరకంగా చెబితే.. ఇది ఆర్‌ఎస్‌ఎస్ పిలుపునకు పరోక్ష మద్దతుగా భావిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన అసలు రాజ్యాంగంలో ఈ పదాలు భాగం కాదని అందరికీ తెలుసు. కాబట్టి ఆలోచనాపరుడైన ఏ పౌరుడైనా దీన్ని ఆమోదిస్తారని అన్నారు. అత్యవసర పరిస్థితి రోజులను గుర్తుచేసుకుంటూ, చౌహాన్ మాట్లాడుతూ, తన అధికారాన్ని కాపాడుకోవడానికి నాటి ప్రధాని ఇందిర దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారని అన్నారు. బయటి భద్రతకు ఎలాంటి ముప్పు లేదు, అంతర్గత భద్రతకు కూడా ముప్పు లేదు. ప్రధానమంత్రి కుర్చీకి మాత్రమే ముప్పు, అందుకే, జూన్ 25, 1975 రాత్రి, కేబినెట్ సమావేశం నిర్వహించకుండానే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారని అన్నారు కేంద్ర మంత్రి.
లౌకిక వాదం మనది కాదన్న అస్సాం సీఎం హిమంత
ఇక ఇదే అంశంపై మరొక నేత కూడా కామెంట్ చేశారు. ఆయనే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. సోషలిజం, లౌకికవాదం మనవి కావు. పాశ్చాత్య భావనలని, ఈ పదాలకు భారత నాగరికతలో స్థానం లేదని అన్నారు. మీరు కాస్త గట్టిగా ఆలోచిస్తే మన అస్తిత్వ సవాళ్లకే మనం అవకాశమిస్తున్నామని.. ఇదొక చీడ పురుగుగా దేశాన్ని పట్టి పీడిస్తోందని అన్నారు ఉప రాష్ట్రపతి. ఇది వేల సంవత్సరాల నాగరికతను కించ పరుస్తోందని.. ఈ సెక్యులరిజం అన్నది మనదైన సంప్రదాయాన్ని తక్కువ చేసుకోవడం తప్ప మరొకటి కాదని అన్నారు ధన్కర్. ఇది సనాతన ధర్మానికే పూర్తి అవమానకమని కామెంట్ చేశారు ధన్కర్. ఉపరాష్ట్రపతి ధన్కర్ కి రచయిత, మాజీ కర్ణాటక ఎమ్మెల్సీ వీరయ్య రాసిన సంకలనం అంబేద్కర్ సందేశాలు అనే పుస్తకం తొలి కాపీ అందించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఈ కామెంట్లు చేశారు. ఆర్ఎస్ఎస్ అగ్ర నేత నుంచి ఉపరాష్ట్రపతి వరకూ ఈ తరహా కామెంట్లు చేయడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది కాంగ్రెస్.
సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగింపు!
ఇంతకీ ఈ సోషలిస్ట్, సెక్యులర్ పదాలను ఎప్పుడు చేర్చారు? వీటి తాలూకూ ప్రభావం భారత్ పై ఎలా ఉంది? ఇది ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుంది? భారత్ కాషాయీకరణలో ఇదెలా భాగం అవుతుంది? అటు నార్త్ లోనే కాక ఇటు సౌత్ లోనూ పవన్ వంటి వారి రూపంలో సెక్యులరిజంపై జరుగుతున్న చర్చ ఎలాంటిది? దీన్నెలా అర్ధం చేసుకోవాలి?
మురుగన్ మానాడులో పవన్ సెక్యులర్ కామెంట్లు
మొన్న మురుగన్ మానాడు సభలోనూ పవన్ సరిగ్గా ఇలాంటి సెక్యులరిస్టు కామెంట్లు చేశారు. ఇది గత కొంతకాలంగా భారతదేశంలో వినిపిస్తన్న మాట. ఆ మాటకొస్తే మొన్న పూనేకి చెందిన లా స్టూడెంట్ శర్మిష్ట పనోలీ విషయంలోనూ సరిగ్గా ఇలాగే కామెంట్ చేశారు పవన్. దేశంలో సెక్యులరిజం అంటే అది హిందుత్వ వాదులను అనడానికి మాత్రమే పనికొచ్చే ఒకానొక వెసలుబాటు కాదని కామెంట్ చేశారాయన. ఈ ధోరణి వెనక రాజ్యాంగంలోని ఈ సెక్యులరిస్ట్ పదాలే కారణమన్నది వీరందరి వాదనగా తెలుస్తోంది. 1976లో అత్యవసర పరిస్థితి సమయంలో 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా లౌకిక, సోషలిస్ట్ అనే రెండు పదాలను ప్రవేశికలో చేర్చారు. అత్యవసర పరిస్థితి తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేసిన అనేక ఇతర మార్పులను తిప్పికొట్టినప్పటికీ, అది సోషలిస్ట్, సెక్యులరిస్ట్ అనే పదాలను అలాగే ఉంచింది.
2015లో నేటి పీఠిక అలాగే ఉంటుందన్న అమిత్ షా
బిజెపి నేతృత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వంతో సహా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఈ రెండు పదాలను తొలగించే చర్యకు దూరంగానే ఉంటూ వచ్చాయి. వాస్తవానికి, 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, నాటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా 2015లో పార్టీ లైన్‌ను స్పష్టం చేశారు. నేటి పీఠిక అలాగే ఉండాలని బిజెపి విశ్వసిస్తుంది. దానిని మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. బేసిగ్గా చూస్తే ఇప్పటి వరకూ భారత్ కి రక్షణ కవచం ఈ లౌకిక వాదమే. పాకిస్థాన్ లా ఒక మత తత్వ దేశంగా భారత్ మారితే.. దాని విస్తృత రూపం రేపటి రోజున మరొక విధంగా మారే అవకాశం లేక పోలేదు. కానీ బీజేపీ చూస్తుంటే భారత్ ని లౌకిక వాదం నుంచి పక్కకు తప్పించేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నట్టే కనిపిస్తోందని అంటారు రాజ్యాంగ నిపుణులు. ఏం పాకిస్థాన్ మన నుంచి విడిపోయి ఇస్లామిక్ కంట్రీగా మారినపుడు మన దేశం హిందూ దేశం ఎందుకు కాకూడదన్నది రెగ్యులర్ గా సంఘ్ పరివార్ సభ్యులు వేసే ప్రశ్న. వీరి ఆలోచన ప్రకారం భారత దేశం ఇప్పటి వరకూ లౌకిక వాదం, సామ్యవాదం ద్వారా నష్టపోయినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది.
సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగిస్తే ఏం జరుగుతుంది?
ఒక వేళ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు తొలిగిస్తే ఏం జరుగుతుంది? అని చూస్తే అది దేశ స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తోంది. రాజ్యాంగ సూత్రాలు, విలువలు కూడా బొత్తిగా మారిపోయే ఛాన్సుంది. అంతే కాదు సామాజిక, ఆర్ధిక సమానత్వం.. మత స్వేచ్ఛ వంటి అంశాలపై ఇది తన తడాఖా చూపించవచ్చని అంటారు రాజ్యంగ నిపుణులు. ఒక వేళ సోషలిస్ట్ అనే పదం తొలగిస్తే.. దేశ సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం తయారు చేసిన రాజ్యాంగ లక్ష్యాన్నిది బలహీనపరుస్తుంది. సంపద, వనరుల సమాన పంపిణీ, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తారు కొందరు నిపుణులు. సెక్యులర్ అనే పదం తొలగిస్తే, మతపరమైన స్వేచ్ఛ కూడా కోల్పోయే ప్రమాదముంది. మతం ప్రాతిపదికన వివక్షకు వ్యతిరేకంగా ఉన్న రాజ్యాంగ సూత్రం మరింత ఇరుకున పడుతుంది. ప్రభుత్వం కూడా మతం పరంగా పక్షపాత ధోరణిని అవలంబించే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ రెండు పదాల కారణంగా దేశంలో సామాజిక న్యాయం
ఈ రెండు పదాలు రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం ద్వారా, భారత రాజ్యాంగం సమగ్రత, లౌకికవాదం.. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తుంది. వీటిని తొలగిస్తే, రాజ్యాంగ విలువలు మరింత పలుచనయ్యే అవకాశం కనిపిస్తోందని అంటారు రాజ్యాంగనిపుణులు. ఇతర దేశాలు కూడా ఈ మార్పును గమనించి, భారతదేశంతో సంబంధాలు నెరిపే విధానాన్ని మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఇతర దేశాలలో లౌకికవాదం, సామాజిక న్యాయం పట్ల ఆసక్తి ఉన్నవారిలో మన పట్ల ఇప్పటి వరకూ ఉన్న ధోరణి మారవచ్చు. సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగిస్తే, భారత రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలు, విలువలు దెబ్బతినే అవకాశం ఉంది. సామాజిక- ఆర్థిక- సమానత్వం- మతపరమైన స్వేచ్ఛ వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపేలా తెలుస్తోంది. అందుకే రాహుల్, దత్తాత్రేయ అన్న వెంటనే తీవ్రంగారియాక్టయ్యారు. మరి చూడాలి.. ఈ రాజ్యంగ రచ్చ ఏ తీరం చేరనుందో తేలాల్సి ఉంది.
Story By Adhinarayana, Bigtv