Banakacherla Project: ఏపీ తెలంగాణ మధ్య మరో నీటి యుద్ధం మొదలైందా? కాంగ్రెస్- బీఆర్ఎస్- బీజేపీ మధ్య ట్రయాంగిల్ వార్ స్టార్ట్ అయ్యిందా? బనకచర్ల వెనక అసలేం జరుగుతోంది? తెలంగాణకు ఎలా నష్టం చేస్తుంది? ఏపీ దీని ద్వారా ఏం సాధిస్తోంది? టూ స్టేట్స్ వర్సెస్ సెంట్రల్ మధ్య ఈ విషయంలో ఎలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయ్?
ఏపీ నీటి మంత్రి ప్రెజంటేషన్
తెలంగాణ వాటర్ మినిస్టర్ ఇన్విటేషన్
బనకచర్ల విషయంలో ముదురుతున్న వివాదం
రెండు రాష్ట్రాల మధ్య మరో నీటి యుద్ధం?
స్టేట్ టు సెంట్రల్.. పెరుగుతోన్న వాటర్ హీట్!
బనకచర్ల వివాదం ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు ఆహ్వానం.. బనకచర్ల వ్యవహారంలో.. అఖిలపక్ష సమావేశాం నిర్వహిస్తున్నాం. మీరు రావల్సిందిగా కోరుతూ స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లేఖ రాశారు. దీని సారంశమేంటంటే.. ఏపీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు పార్టీలన్నిటినీ తాము ఆహ్వానిస్తున్నామనీ.. జూన్ 18, సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి రావల్సిందిగా కోరుతున్నామనీ ఈ లేఖలో రాసుకొచ్చారు మంత్రి ఉత్తమ్.
సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు సైతం ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు చెప్పారు. జూన్ 3న సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ను స్వయంగా కలసి ఈ ప్రాజెక్టు పట్ల తమకున్న అభ్యంతరాలను తెలియ చేశారు. ఈ విషయం కూడా తన లేఖలో ప్రస్తావించారు మంత్రి ఉత్తమ్. ఏపీ గవర్నమెంట్ కేంద్రానికి ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు- 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014ని సైతం ఉల్లంఘించినట్టు కనిపిస్తోందని తన లేఖ ద్వారా చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్.
కేంద్ర మంత్రులు.. కిషన్, సంజయ్ కి ప్రత్యేక ఆహ్వానం
ఊహించిన విధంగా ఈ ప్రాజెక్టుగానీ నిర్మిస్తే.. తెలంగాణ నీటి హక్కులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తన లేఖ ద్వారా తెలియ చేశారు మంత్రి ఉత్తమ్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని ప్రత్యేకంగా ఈ సమావేశానికి.. ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు మంత్రి ఉత్తమ్. వారి విలువైన సలహా- సూచనలు తెలియ చేయాల్సిందిగా తన లేఖ ద్వారా కోరారు మంత్రి. అంతే కాదు ఆయా ఎంపీలకు, మంత్రులకు స్వయంగా ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు.
ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి- కిషన్ రెడ్డి
ఈ సరికే కేంద్ర మంత్రి కిషన్ ఈ విషయంపై స్పందించారు. సమస్య రెండు రాష్ట్రాలకి సంబంధించినది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి. సరిగ్గా అదే సమయంలో.. కేంద్రానికి తమకెదురయ్యే నష్టం గురించి తెలియ చేయాలి. అంతే కానీ, కేంద్ర మంత్రులను ఆడిపోసుకోవడంలో అర్ధం లేదన్నది కేంద్రమంత్రి సూటిగా చెప్పిన మాట.
గతంలో కేసీఆర్ అనుమతుల్లేకుండా ఎన్నో ప్రాజెక్టులు- ఏపీ
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల ద్వారా సమస్య సానుకూల పరుచుకోవాలని చూస్తోంది. ఇక ఏపీ వాదన ఎలా ఉందో చూస్తే.. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మించారని అంటారు ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు. బనకచర్ల ప్రాజెక్టు, వాస్తవాల పేరిట మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో.. సాంకేతిక అంశాలకంటే రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల.
1986లో 36 లక్షల క్యూసెక్కులతో ముంపునకు గురైన కోటి మంది
మీ అంతర్గత రాజకీయాలకు ఈ ప్రాజెక్టును బలి పెట్టడం సరికాదని సూచించారాయన. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎగువ రాష్ట్రాలకేం నష్టం లేదు. ఏపీ దిగువన ఉన్న రాష్ట్రం. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటినే వాడుతున్నాం. దీని వల్ల ఎవరికి నష్టం? గత యాభై ఏళ్లుగా ప్రతి ఏటా గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు దాటితే.. ఈ నీరు వెళ్లి కలిసేదీ సముద్రంలోనే. 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికి ఉభయ గోదావరి జిల్లాల్లో కోటి మందికిపైగా.. ముంపు బారీన పడ్డారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేవలం వరద నీటిని మాత్రమే వాడుకోదలిచాం.. దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం గల అనంతపురానికి ఈ నీరు తరలిస్తామని అన్నారు మంత్రి నిమ్మల రామానాయడు.
తెలంగాణ ఏ ప్రాజెక్టూ చంద్రబాబు ఆపలేదు- మంత్రి
తెలుగు ప్రజలందరూ ఒక సారి ఆలోచించాలని అంటారు మంత్రి నిమ్మల. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ అనలేదు. GWTD క్లాజ్- 4 ప్రకారమేఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇచ్చిపుచ్చుకునే ధోరణలో దీన్ని అంగీకరించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉంటానని ఆనాడు కేసీఆర్ అన్న మాటలను సైతం తన ప్రజెంటేషన్లో చూపించారు మంత్రి రామానాయడు. గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ కి తరలించేందుకు కేసీఆర్ సహకరిస్తున్నారు. ఇది కేసీఆర్ ఔదార్యం అంటూ ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ వీడియో కూడా ప్రదర్శించారు మంత్రి నిమ్మల.
నాడు ఒప్పుకుని నేడు వ్యతిరేకించడం దారుణం- మంత్రి నిమ్మల
నాడు ఒప్పుకున్న కేసీఆర్ నేడు వ్యతిరేకించడం దారుణమని అన్నారు మంత్రి నిమ్మల. కేఎల్ రావు ఆనాడే నదుల అనుసంధానం గురించి చెప్పారనీ.. నేడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా నదుల అనుసంధానం ద్వారా దేశంలోని కరవు నివారించవచ్చని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు మంత్రి. అందుకే తాము ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారాయన. వరద జలాలను వదులుకునే పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకి ఉంది. రాయలసీమకు గోదావరి జలాలను తరలిస్తామని CWCకి కూడా చెప్పాం.
జగన్ ఎందుకు నోరు విప్పరు? మంత్రి ప్రశ్న
రాయలసీమ బిడ్డ గా చెప్పుకు తిరిగే జగన్ ఎందుకు నోరు విప్పరు? గతంలో జగన్, కేసీఆర్ కలసి చేసుకున్న ఈ ఒప్పందాన్ని ఇవాళ బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అధికారంలో ఉండగా ఒకలా.. ప్రతిపక్షంలో ఉండగా మరొకలా జగన్, కేసీఆర్ మాట్లాడ్డం అన్యాయమని వాపోయారు మంత్రి నిమ్మల. అన్ని అనుమతులు తీసుకునే ఈ ప్రాజెక్టు చేపడతామని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అయితే ఇందుకు బీఆర్ఎస్ వాదన భిన్నంగా ఉంది. నాడు కృష్ణా జలాల విషయంలో పోతిరెడ్డిపాడు ఎలాగో- నేడు గోదావరి విషయంలో బనకచర్ల అలాగంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది గులాబీ పార్టీ.
కేంద్ర మంత్రి కిషన్ అఖిలపక్షానికి హాజరయ్యేనా?
మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ అఖిలపక్షానికి బీజేపీ, బీఆర్ఎస్ MPలు హాజరవుతారా? ఒక వేళ హాజరైతే ఎలాంటి తీర్మానం చేయనున్నారు? ఈ వివాదం ఏ మలుపు తీసుకోనుంది? అన్నదిపుడు సస్పెన్స్ గా మారింది. గతంలో ఇలాగే కాగ్రెస్ అఖిల పక్షం నిర్వహించినపుడు తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు కాబట్టి హాజరు కాలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షనేంటి? ఆల్రెడీ ఈ విషయంలో ఏం చేయాలో చెప్పేశాం కాబట్టి లైట్ తీస్కుంటారా? తేలాల్సి ఉంది.
సుమారు రూ. 80 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్ట్
ఏమిటీ బనకచర్ల ప్రాజెక్ట్? దీని విషయమే ఏపీ తెలంగాణతో పాటు కేంద్రం కూడా తలపట్టుకుంటోంది కారణమేంటి? దిగువన ఉన్న రాష్ట్రం కట్టుకునే ప్రాజెక్టుల విషయంలో పైనున్న రాష్ట్రాల అభ్యంతరమేంటి? ఈ ప్రాజెక్టు వల్ల ఇరు రాష్ట్రాలు రాజకీయాలు చేసుకుంటున్నాయా? లేక నిజంగానే ఈ ప్రాజెక్టు నిర్మాణం సమస్యాత్మకమా? అన్నదిపుడు చర్చగా మారింది.
150 టీఎంసీల నీటి నిల్వతో బొల్లాపల్లి దగ్గర జలాశయం
వరద నీటిపై నిర్మిస్తే తప్పేమీ లేదు- ఏపీ ఇరిగేషన్గోదావరి జలాలతో సీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోంది. సుమారు 80 వేల కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు 2 టీఎంసీల సామర్ధ్యంతో మొత్తం 200 టీఎంసీలు తరలించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. 150 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో బొల్లాపల్లి దగ్గర కృత్రిమ జలాశయ ఏర్పాటును ప్రతిపాదించింది ఏపీ. ఈప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని అంటారు మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ రావు.
ఢిల్లీ కేంద్ర పర్యావరణ శాఖ EAC సమావేశం
అయితే ఇదే విషంపై ఢిల్లీ కేంద్రపర్యావరణ మంత్రిత్వ శాఖ ఈఏసీ.. సమావేశమైంది. సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు అత్యంత ప్రధానమైన ఎజెండగా తెలుస్తోంది. ఇప్పటికే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది ఏపీ. అనుమతులివ్వొద్దంటూ.. తెలంగాణ నీటి పారుదల శాఖా మంత్రి సైతం లేఖ రాశారు.
గోదావరి వరద నీటిని రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశంకి తరలించే యోచన
ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న.. గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలకు తరలించాలన్నది బనకచర్ల ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీరు సరిగా రావడం లేదు. మరోవైపు గోదావరి నుంచి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. వీటిని వరద సమయంలో మళ్లించాలన్నదే తమ ఉద్దేశంగా చెబుతోంది ఏపీ. కేవలం వరద నీరు తరలించడంతో డెల్టాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తోంది ఏపీ.
3 లక్షల హెక్టార్లకు సాగునీరు
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం.. నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు-నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయుకట్ట స్థిరీకరణ లక్ష్యంతో ఈ ప్రాజెక్టును భారీ ఎత్తున నిర్మించాలనుకోంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద నిధులు
బనకచర్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన- ఆక్సిలిరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం కింద సహాయం అందించాలని కోరుతూ.. సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ తోనూ చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు.
ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టు కింద ఫండ్స్ కావాలన్న ఏపీ
గోదావరిలో వరద వచ్చినపుడు 2 టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదిలోకి పంపడం. అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా.. కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ లోకి తరలింపు.. అటు నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులరేటర్ కి నీరు తరలిస్తామని తన ప్రాజెక్ట్ డీటైల్స్ లో తెలియబరిచింది ఏపీ.
3 దశల్లో గోదావరి-బనకచర్ల అనుసంధానం
మొత్తం మూడు దశల్లో గోదావరి-బనకచర్ల అనుసంధానం చేపట్టనున్నట్టు తనప్రతిపాదనల ద్వారా తెలియ చేసింది ఏపీ. తొలి దశలో పోలవరం నుంచి కృష్ణానదికి జలాల మళ్లింపు. రెండో దశలో బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మించి అక్కడికి నీరు తరలించి అందులో నింపడం. ఇక మూడో దశగా బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్ కి నీరు మళ్లించడం.
48 ఎకరాల భూసేకరణ, ఇందులో 17 వేల ఎకరాల అటవీ భూములు
ఈ ప్రాజెక్టు కోసం 48 వేల ఎకరాల భూమిసేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తి పోసేందుకు 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని కూడా తన ప్రాజెక్ట్ రిపోర్టులో తెలియచేసింది ఏపీ. రెండు చోట్ల టన్నెళ్లు, 9 చోట్ల పంపు హౌసుల నిర్మాణం అవసరమని.. అలాగే గ్రావిటీకాలువ.. అవసరమైన చోట తవ్వాలని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ వివరాలను ఇవ్వాలని ఇది వరకే కేంద్ర జలశక్తి శాఖ గోదావరి, కృష్ణానదీ యాజమాన్య బోర్డులను కోరింది. అయితే తెలంగాణ అభిప్రాయం తీసుకున్నాకే ఈ ప్రాజెక్టుపై ఒక నిర్ణయం తీసుకోనుంది కేంద్ర జల వనరుల సంఘం.
నాగార్జున సాగర్ వినియోగం ఆక్షేపణీయమంటోన్న తెలంగాణ
ఇంతకీ తెలంగాణ వ్యతిరేఖత ఏంటంటే.. ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమంటూ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ వినియోగాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది. ప్రాజెక్టు ముందుకు సాగకుండా టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని ఇది వరకే కేంద్ర ఆర్ధిక శాఖ, జలశక్తి శాఖలకు మంత్రి ఉత్తమ్ లేఖలు రాశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నదీయాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని కోరారు.
కాళేశ్వరం నిర్మించినపుడు మేమేం అడ్డు చెప్పలేదే- ఏపీ సీఎం
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదంటారు ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరిపై తెలంగాణ కాళేశ్వరం నిర్మించినపుడు తామేమీ అభ్యంతరం చెప్పలేదని అన్నారాయన. గోదావరి- బనకచర్ల రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటిదని అభివర్ణించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టు కోసం హైబ్రిడ్ మోడల్లో నిధులు సమకూర్చుతున్నట్టు కూడా చెప్పారాయన. ఒక వేళ బనకచర్ల సాకారమైతే.. దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని అన్నారు.
వరద నీటిపై నిర్మిస్తే తప్పేమీ లేదు- ఏపీ ఇరిగేషన్
నీటిపారుదల నిపుణుల మాటేంటని చూస్తే.. తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించ తలబెట్టిన నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్ లు పెండింగ్ లో ఉన్నాయి. పూర్తి స్థాయి అనుమతులు ఇంకా రాలేదు. ఈలోగా గోదావరి నీళ్లను ఏపీ ఎలా తరలిస్తుంది? అన్నది తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మాట. ఏపీ ఏమంటుందంటే.. 1980లో ట్రిబ్యూనల్ తీర్పులన్నీ నికర జలాలపైనే. అందులో భాగంగా చూస్తే తమ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు లేదని.. తాము కేవలం వరద నీటిని మాత్రమే వాడుకోదలిచాము కాబట్టి ఇది సరైనదేనంటారు ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు.
Story By Adinarayana, Bigtv Live