వేలంలో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనడం అలవాటు ఉన్న ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. అలాంటిలాంటి జాక్ పాట్ కాదు, తన జీవితం మారిపోయే అదృష్టం అది. అయితే అక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అతను అత్యాశకు పోయి ఉంటే మొదటికే మోసం వచ్చేది. కానీ తనకు ఏం కావాలో అది తీసుకున్నాడు. ఎవర్నీ మోసం చేయలేదు, తాను కూడా మోసపోలేదు. అందుకే అతడికి రూ.9.96 కోట్లు దక్కాయి. జీవితం మలుపు తిరిగింది.
వేలంలో స్టోరేజ్ యూనిట్..
ఆ అదృష్టవంతుడు కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి. స్టోరేజ్ వార్స్ అనే టీవీ షో లో నిత్యం ఏదో ఒక వస్తువు వేలం వేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు ఒక స్టోరేజ్ యూనిట్ ని వేలం వేశారు. ఆ వేలంలో మన లక్కీ మ్యాన్ పాల్గొన్నాడు. ఒక స్టోరేజ్ యూనిట్(లాకర్)ని 41వేల 500 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆ స్టోరేజ్ యూనిట్ కి అంత డబ్బు తగలేయడం ఎందుకంటూ కుటుంబ సభ్యులు అతడిని తిట్టిపోశారు కూడా. కానీ ఆ తర్వాతే అతడి కథ మారింది. ఎవరైతే అతడిని తిట్టారో, వారే మెచ్చుకున్నారు. అతని అదృష్టానికి కుళ్లుకున్నారు కూడా.
లాకర్ లో ఏముంది..?
లాకర్ ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని తీసి చూశారు కుటుంబ సభ్యులు. అందులో తాళం వేసిన ఒక అర ఉంది. దాన్ని తీసి చూస్తే కట్టలు కట్టలుగా డబ్బులు కనిపించాయి. వందలు, వేలు, లక్షలు కాదు, ఆ సొమ్ము కోట్లలో ఉంటుందని వారికి తెలిసింది. వెంటనే లెక్కపెట్టారు. రూ.622కోట్లుగా తేలింది. ఇందలోనే వేలంపాట నిర్వహించిన టీవీ ఛానెల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ స్టోరేజ్ యూనిట్ యజమాని కూడా లైన్లోకి వచ్చాడు. పొరపాటున దాన్ని అమ్మేశామని అతి తమకు తిరిగి కావాలని కోరారు. కొన్న తర్వాత దాన్ని ఇచ్చేందుకు ఒప్పుకునేది లేదని అతను ఖరాఖండిగా చెప్పాడు. దీంతో అమ్మినవారు అసలు విషయం ఒప్పుకున్నారు. ఆ లాకర్ లో రూ.622కోట్లు ఉన్నాయని, అందుకే తిరిగివ్వాలని అడుగుతున్నామని చెప్పారు. అంతే కాదు, ఆ డబ్బంతా తిరిగిస్తే కొంత పారితోషికం ఇస్తామన్నారు. రూ.4.98 కోట్లకు బేరం కుదిరింది. అయితే ఆ తర్వాత మళ్లీ చర్చలు జరిగాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బు తిరిగిస్తే బహుమానం మరీ ఇంత తక్కువా అనే ప్రశ్న వచ్చింది. ఆ డబ్బు పోగొట్టుకోవడం ఇష్టం లేక ప్రైజ్ మనీని రెట్టింపు చేశారు. రూ.9.96 కోట్లు అంటే 1.2 మిలియన్ డాలర్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో వేలంలో ఆ బీరువా కొన్న వ్యక్తి ఎగిరి గంతేశాడు. వెంటనే డీల్ కి ఒప్పుకున్నాడు. లాకర్ లో ఉన్న డబ్బులో రూ.9.96 కోట్లు మినహాయించుకుని మిగతాది తిరిగి ఇచ్చేశాడు. ఆ లక్కీ లాకర్ ని మాత్రం తనతోనే ఉంచుకున్నాడు.
కళ్లముందు రూ.622 కోట్లు ఉన్నాయి. కానీ అందులో కేవలం రూ.9.96 కోట్లు మాత్రమే తీసుకుని, మిగతాది తిరిగి ఇచ్చేయడమంటే మాటలా..? మొత్తం ఉంచుకోవచ్చు కదా అని అతడిని చాలామంది అడిగారు. కానీ అతడు చెప్పిన సమాధానం ఒక్కటే. అంత డబ్బు మన వద్ద ఉండటం మంచిది కాదని, సవాలక్ష లెక్కలు చెప్పాల్సి వస్తుందని, పోలీసులు, కేసులు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నాడు. అలాంటి ఇబ్బందులేవీ లేకుండా రూ.9.96 కోట్లతో ఒడ్డున పడ్డామని అన్నాడు. ఇది తనకు వచ్చిన బహుమతి కాబట్టి, దీనికి లెక్కలు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎవర్నీ మోసం చేశామన్న పశ్చాత్తాపం కూడా లేదు అని చెప్పాడు.