భారత్, రష్యా.. తమ డెడ్ ఎకానమీని మరింత దిగజార్చుకుంటున్నాయంటూ ఆమధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్ ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. అసలు భారత్ ఎకానమీపై కామెంట్ చేయాల్సిన అవసరం అమెరికాకు ఏమొచ్చిందని నిలదీశారు నేతలు. అదే సమయంలో ప్రపంచ దేశాలనుంచి కూడా భారత్ కు మద్దతు పెరుగుతోంది. ఇదే విషయంపై చైనా, భారత్ కు సపోర్ట్ గా నిలిచింది. కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా కూడా భారత్ తో కలసి పనిచేసేందుకు, అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత పెంచుకోడానికి సై అంది. భారత్ ని అద్భుత అవకాశాల గనిగా పేర్కొన్నారు ఆ దేశ వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్. డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. భారత్ పై అమెరికా విధించిన సుంకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
పెట్టుబడులకు ఓకే..
భారత్ పై అమెరికా విధించిన 50శాతం సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ డొనాల్డ్ కూడా తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చర్యల్ని ఆయన విమర్శించారు. తాజాగా ఆ దేశ వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ స్పందించడం దీనికి కొనసాగింపుగా చూడాలి. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో ఒడిదొడుకుల నేపథ్యంలో మన దేశంతో ఆస్ట్రేలియా లోతైన ఆర్థిక సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా మంత్రి డాన్ ఫారెల్ క్వీన్స్‌ల్యాండ్‌లో అదానీ మైనింగ్ ప్రాజెక్టులకు మద్దతుగా మాట్లాడారు. భారత్ కు యురేనియం ఎగుమతులపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. భారతదేశంలో పెట్టుబడులను పెంచేందుకు ఆస్ట్రేలియా ఆసక్తిగా ఉందని చెప్పారాయన. ఆస్ట్రేలియా లాగే భారత్ కూడా అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశం అని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి, భారత్ లో ఆస్ట్రేలియా పెట్టుబడులను పెంచడానికి తాము సుముఖంగా ఉన్నామని చెప్పారు. భారత్ లో వారికి గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారాయన.
అదృష్టాన్ని ఇచ్చిపుచ్చుకుందాం..
ఆస్ట్రేలియాను అందరూ అదృష్ట దేశంగా అభివర్ణిస్తారని, తాము ఆ అదృష్టాన్ని భారత్ తో పంచుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఖనిజాల సరఫరాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య గొప్ప సరఫరా గొలుసు ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో తాను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రెండుసార్లు మాట్లాడానని, ఈ వారం మరో సారి చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.
సుంకాలకు వ్యతిరేకం..
భారత్ పై అమెరికా విధించిన 50శాతం సుంకాలను ఆస్ట్రేలియా మంత్రి తప్పుబట్టారు. స్వేచ్ఛా వాణిజ్యం, న్యాయమైన వాణిజ్యాన్ని ఆస్ట్రేలియా విశ్వసిస్తుందని, అందువల్ల తాము సుంకాల విధింపుని సమర్థించబోమని చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియాపై 10శాతం సుంకాలు విధించింది. ఆ సుంకాలు కూడా తప్పు అని ఆయన అన్నారు. అదే విషయంపై అమెరికాతో చర్చించామని కూడా తెలిపారు. ఇక భారత్ పై విధించిన 50శాతం సుంకాలను ఆయన మరింత ఘాటుగా విమర్శించారు. మొత్తానికి సుంకాల ఆటలో భారత్ కి గొప్ప ఊరట లభించినట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ కి బాసటగా నిలుస్తున్నాయి. అమెరికాకి ప్రత్యామ్నాయంగా తమతో వ్యాపార సంబంధాలు బలపరచుకోవాలని కోరుతున్నాయి.