Iran Israel War: ఇరాన్ ఇజ్రాయెల్ వార్. బేసిగ్గా రైమింగ్ కంటే టైమింగ్ ముఖ్యమని అంటారు. సరిగ్గా అలాగే.. యుద్ధమనగానే ఆయుధాలు పుష్కలంగా ఉండగానే సరిపోదు. ఎన్నెన్నో వ్యూహ ప్రతివ్యూహాలు అవసరం. రకరకాల ఎత్తుగడలు అత్యావసరం. అలాంటి వ్యూహరచనల్లో భాగంగా ఇరు దేశాలు.. ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాయి? వీటి ద్వారా వార్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది. మధ్య అమెరికా ఆతృత ఎలాంటిది? ఇప్పుడు చూద్దాం.
సైనిక వ్యవస్థ కన్నా- బలమైన వ్యూహమే ఎత్తుకు పై ఎత్తు సాధిస్తుంది
యుద్ధంలో బలమైన సైనిక వ్యవస్థ కన్నా- బలమైన వ్యూహమే ఎత్తుకు పై ఎత్తు సాధిస్తుంది. భారత్- పాక్ విషయంలో ఇదే జరిగింది. నేడు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కూడా సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీస్ కే ప్రయారిటీ లభిస్తోంది.
రాత్రి పూట దాడులు ప్లాన్ చేసిన ఇరాన్
ఇదిగో ఇరాన్ రాత్రి పూట ఎంతో రహస్యంగా ప్రయోగిస్తూన్న ఈ ఆయుధాలను చూశారా. ఇలా ఎందుకు చేస్తున్నట్టు? అని చూస్తే.. టెహ్రాన్ వర్సెస్ టెల్ అవీవ్ మధ్య సాగుతున్న ఈ వార్‌లో.. ప్రత్యర్థి దిమ్మ తిరిగేలా కొట్టే దెబ్బలకు పగటికన్నా రాత్రినే ఎక్కువగా ఎంపిక చేసుకుంటోంది ఇరాన్.
ఇజ్రాయెల్ కంటి మీద కునుకు లేకుండా చేసే ప్లాన్
ఊహకు అందని విధంగా శతృవును దెబ్బ తీయాలంటే ఇదే వ్యూహం కరెక్టుగా భావిస్తోంది ఇరాన్. సర్ ప్రైజ్ అటాక్స్ చేస్తేనే బ్యాటల్ గ్రౌండ్‌లో అప్పర్ హ్యాండ్ లభిస్తుందన్న ఆలోచన చేస్తోంది. అంతే కాదు ఇజ్రాయెల్ కంటి మీద కునుకులేకుండా చేస్తే వారికి వారే.. యుద్ధంలోంచి తప్పుకుంటారు. ఒక దారికి వస్తారన్న యోచనలో ఉంది ఇరాన్. అందులో భాగంగా ఇరాన్.. రాత్రిపూట దాడులకు అధిక ప్రాధాన్యతనిస్తోంది.
ఇరాన్ దగ్గర ఇంకా 1960ల కాలం నాటి యుద్ధ విమానాలున్నాయి
ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలేమీ లేవు. ఇజ్రాయెల్ లేటెస్ట్ అల్ట్రా మోడ్రన్ లేజర్ వెపన్స్ వాడుతుంటే.. ఇరాన్ దగ్గర ఇంకా 1960ల కాలం నాటి యుద్ధ విమానాలున్నాయి. దీంతో తెలివిగా ప్రత్యర్థిని రాత్రి వేళ దెబ్బ తీసే యత్నంచేస్తోంది.
ఇరాక్, సిరియా, సౌదీ, జోర్డాన్, లెబనాన్ మీదుగా వెళ్లాలి
దానికి తోడు ఇరాన్ దగ్గరున్న ఈ పాత ఆయుధాలు ఇజ్రాయెల్ వరకూ వెళ్లాలంటే.. ఇరాక్, సిరియా, సౌదీ, జోర్డాన్, లెబనాన్ తదితర దేశాల గగన తలాల మీద నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ఆయా దేశాలు అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్‌పై దాడికి ఇందుకు ఒప్పుకోవు. దీంతో ఇరాన్ తన రూటు మార్చినట్టు తెలుస్తోంది.
2 వేల కి. మీ రేంజ్‌లో ఉన్నవి మాత్రమే వెళ్లగలవు
ఇరాన్ దగ్గరున్న క్షిపణుల్లో 2 వేల కిలోమీటర్ల పైబడి రేంజ్‌లో ఉన్నవి మాత్రమే ఇజ్రాయెల్ వరకూ వెళ్లగలవు. ఇవి యుద్ధ విమానాల్లా వాతావరణం నుంచి ఆక్సిజన్ని తీసుకోలేవు. వీటికి ఇంధనంతో పాటు ఆక్సిడైజర్ తప్పనిసరి. దీంతో తమ దగ్గరున్న బాలిస్టిక్ క్షిపణులను రెండు రకాలుగా విభజించారు. ఒకటి ద్రవ ఇంధనంతో పని చేస్తే, మరొకటి ఘన ఇంధనంతో పని చేస్తుంది. ఇరాన్ దగ్గర 2 వేల పై చిలుకు బాలిస్టిక్ క్షిపణులున్నట్టు అంచనా వేసింది ఇజ్రాయెల్. వీటిలో షహబ్ క్షిపణుల్లో ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. ఈ ఇంధనం నింపడం కూడా అతి పెద్ద టాస్క్. ఒకే చోట ఉండే లంచ్ ప్యాడ్స్ తో పాటు అదనపు సిబ్బంది సైతం అవసరమే. పగటి పూట ప్రయోగిస్తే.. అవి శతృ ఉపగ్రహాలు, నిఘా వ్యవస్థల కంటబడే అవకాశముంది. దీంతో రాత్రిపూటే ఈ క్షిపణి ప్రయోగాలను చేయాల్సి వస్తోంది.
ఫతేహ్, జొల్ఫగర్ క్షిపణుల్లో ఘన ఇంధనం
ఇక ఇరాన్ దగ్గరున్న ఫతేహ్, జొల్ఫగర్ క్షిపణుల్లో ఘన ఇంధనం వాడుతారు. ఇందులో కూడా ఆక్సిడైజర్ వాడుతారు. దీన్ని ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించవచ్చు. మెరుపు దాడుల కోసమే వీటిని ఎక్కువగా వాడుతుంటారు. వీటిని ఒక్కసారి ఇగ్నైట్ చేస్తే ఇక ఆపడం ఎవరి వల్లా కాదు. ఇలాంటి రెండు రకాల క్షిపణులను ఇరాన్ ఎంతో తెలివిగా ప్రత్యర్థిపై వాడుతోంది. ఇటు దెబ్బ తీయడానికి ఒక ఆయుధం, అటు భయ పెట్టడానికి మరో రకం.. అది కూడా రాత్రి పూట సర్ ప్రైజ్ అటాక్స్ చేస్తూ.. ఇజ్రాయెల్ ని ఇరుకున పెట్టే యత్నం చేస్తోంది.
120 ఇరానియన్ లాంచర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
అయితే ఇంతకన్నా మించిన తెలివైనది ఇజ్రాయెల్. ఇరాన్ కెపాసిటీ ఒక అంచనా వేసి.. లాంచర్లపైనే ఎక్కువ గురి పెడుతున్నాయి ఇజ్రాయెల్ విమానాలు, డ్రోన్లు. ఇప్పటి వరకూ 120 ఇరానియన్ లాంచర్లను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఇది ఆ దేశంలోని మూడింటి రెండో వంతు లాంచర్లతో సమానం. దీంతో ఇరాన్ తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇంకా ఇరాన్ దగ్గర పెద్ద ఎత్తున క్షిపణులు, లాంచర్లున్నట్టు నమ్ముతోంది ఇజ్రాయెల్. పర్వతాలను తొలిచి.. నిర్మించిన సొరంగాల్లో వీటిని భద్రపరిచినట్టు భావిస్తున్నారు.
ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉంటే ఏంటి?
ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉంటే ఏంటి? అమెరికా ఎందుకంత తోట్రుబాటుకు గురవుతోంది? పాకిస్థాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలే అతి పెద్ద సమస్యాత్మకంగా భావిస్తోన్న యూఎస్.. ఇరాన్ సైతం మరో ఇస్లామిక్ అణ్వాయుధ దేశంగా ఎదుగుతుందన్న భయమా? లేక మరేదైనా కారణం ఉందా? ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడితో అన్న మాటలకు అర్ధమేంటి? హ్యావే లుక్..
టెహ్రాన్లోని ఇజ్రాయెలీ డ్రోన్ ఫ్యాక్టరీ ధ్వంసం
కాల్పుల విరమణకన్నా మించి జరగబోతోంది- ట్రంప్ఇదిలా ఉంటే.. ఒక్కోసారి శతృవు తమ నట్టింట కూడా ఉంటాడన్న కోణంలో ముమ్మర సెర్చింగ్ సాగిస్తోంది ఇరాన్. టెహ్రాన్లో గల ఇజ్రాయెల్ కి చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. పేలుడు పదార్ధాలతో నిండిన చిన్న చిన్న డ్రోన్లను మొహరించాలని.. మొస్సాద్ ఏజెంట్స్ ప్రయత్నిస్తున్నట్టుగా.. ఆరోపిస్తోంది. ఈ సంస్థ కోసం పని చేస్తున్న ఇద్దర్ని ఇది వరకే అరెస్టు చేసింది ఇరాన్. ఈ డ్రోన్ ఫ్యాక్టరీలో 200 కిలోలకు పైగా పేలుడు పదార్ధాలు, 23 డ్రోన్లకు సంబంధించిన విడి భాగాలు, లాంచర్లు ఇతర సాంకేతిక పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు మొస్సాద్ కి ఏజెంట్ గా పని చేస్తోన్న ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం ఉరి తీసింది.
ఇరానీ సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, నేతలు మృతి
ఇటు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లోనూ కొందరు ఇరానియన్ సైనికాధికారులు మరణించారు. ఇక అణు శాస్త్రవేత్తలు, ఇరానీ నేతలు సైతం చనిపోయారు. ఇందుకు ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ పౌర నివాసాలపై దాడులు చేసింది. ఇందుకు రివేంజ్ తీర్చుకోవడంలో భాగంగా.. ఇజ్రాయెల్ సైతం ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణి ప్రయోగం చేసింది. టీవీ స్టూడియోలో ఒక మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతుండగానే.. ఈ దాడి జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్ లోని అమెరికా దౌత్య భవనం దెబ్బ తినింది.
G7 నుంచి హడావిడిగా ట్రంప్ అమెరికాకు
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జీ 7 వేదికను హడావిడిగా వీడి.. అమెరికాకు వచ్చారు. టెహ్రాన్ గగన తలాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉందని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ.. ఈ పరిణామ క్రమాలు చోటు చేసుకున్నాయి. టెహ్రాన్ నగరాన్ని ఈ ప్రాంత ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడాన్ని బట్టీ చూస్తుంటే.. ఇరాన్ లో మరేదో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
15 వేల సెంట్రీఫ్యూజులు దెబ్బ తినడంతో కరెంట్ కట్
ఇరాన్ లో అణు కేంద్రాలు పెద్దగా దెబ్బ తినలేదని అంటోంది అంతర్జాతీయ అణు శక్తి సంస్థ. తొలిరోజు చేసిన దాడులు తప్ప.. పెద్దగా వీటిపై ప్రభావం చూపలేదని అంటోంది IAEA. మొత్తం 15వేల సెంట్రీ ఫ్యూజ్ లు దెబ్బ తినడంతో.. అక్కడక్కడా విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని అంటున్నారు. అంతే కానీ నటాంజ్,ఫోర్దో లోని అణు కేంద్రాలపై ఎలాంటి దాడి జరగలేదని చెప్పుకొచ్చింది అణు శక్తి సంస్థ. దానికి తోడు ఈ కేంద్రాలు.. భారీ ఎత్తున లోతుగా నిర్మించారు కాబట్టి.. ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని చెబుతున్నారు. వీటిని పేల్చాలంటే అతి పెద్ద బంకర్ బస్టర్ బాంబులు అవసరం. ఇవి కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయన్నది అంతర్జాతీయ అణు శక్తి సంస్థ కామెంట్.
ఫోర్దో 60శాతంపైగా యురేనియం శుద్ధి చేయగలదు
అయితే ఇరాన్ లోని పోర్దో అణు కేంద్రం యురేనియంను అరవై శాతం పైగా శుద్ధి చేయగలదు. ఇది అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైనంత సరిపోతుంది. 2023లోనే ఇక్కడ 83 శాతం శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టు గుర్తించింది అణుశక్తి సంస్థ. అణుబాంబులకు అవసరమైన 90 శాతానికి ఇది చాలా దగ్గర. ఫోర్దో కేంద్రాన్ని ఒక పర్వతం లోపలి సొరంగంలో నిర్మించారు. ఇక్కడ 3 వేల సెంట్రీ ఫ్యూజులున్నట్టు అంచనా. దీన్ని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. ఇరాన్ నుంచి అణుబాంబు తయారీని దూరం చేయాలంటే.. దీన్ని ధ్వంసం చేయడం అమెరికా, ఇజ్రాయెల్ కి చాలా చాలా ముఖ్యంగా భావిస్తున్నారు.
ట్రంప్ హడావిడిగా సిట్యువేషన్ రూమ్ సిద్ధం
ట్రంప్ హడావిడిగా సిట్యువేషన్ రూమ్ సిద్ధం చేయించడం వెనక.. కొన్ని రకాల ఊహాగానాలు వెలుగు చూస్తున్నాయి. ఇరానియన్ అణు కేంద్రాల ధ్వంసంలో ఇజ్రాయెల్ తో అమెరికా చేతులు కలిపేలా తెలుస్తోంది. ఇందుకోసం 20 అడుగుల పొడవుండే జీబీయూ57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సి ఉంది. ఇది 13 వేల 600 కిలోల బరువుంటుంది. దీన్ని అమెరికన్ బీ2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే.. ఈ రకం విమానాలను పశ్చిమాసియాకి దగ్గర్లోని డియాగో గార్సియా బేస్ కి చేర్చింది అమెరికా. దీనికి తోడు రిఫ్యూయలింగ్ ట్యాంకర్లు ఇతరయుద్ధ విమానాలు, ఆయుధాలు ఈ ప్రాంతాలకు తరలిస్తోంది అమెరికా. యూఎస్ విమాన వాహక నౌక యూఎస్ఎస్ నిమిట్జ్ కూడా ఈ దిశగానే వెళ్తోంది. దీంతో పాటు డెస్ట్రాయర్లు.. ఇతర సహాయక నౌకలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మొహరిస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.
ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండరాదు- ట్రంప్
ఇజ్రాయెల్ తో కలసి అమెరికా యుద్ధం చేస్తుందన్న ప్రచారంపై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని ఖరాకండిగి చెబుతోంది యూఎస్. దీంతో పాటు తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్ చేతికి అణ్వాయుధం ఎట్టి పరిస్థితుల్లోనూ అందదంటూ ట్రంప్ కామెంట్ చేయడం చూస్తుంటే.. అమెరికా కూడా ఈ యుద్ధంలో చేతులు కలపొచ్చన్న మాట వినిపిస్తోంది.
కాల్పుల విరమణకన్నా మించి జరగబోతోంది- ట్రంప్
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చేసిన కామెంట్లు ట్రంప్ ఖండించారు. ఇక్కడ కాల్పుల విరమణకన్నా అతి పెద్ద వ్యవహారమే జరగనున్నట్టు ట్రంప్ చెబుతుండటంతో అందరిలోనూ అతి పెద్ద అనుమానం నెలకొంటోంది.
-Story By Adinarayana, Bigtv Live