Healthy boiled chana masala: వంటింట్లో నల్ల శనగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిలో విటమిన్లు, మినరల్స్ , ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక గుప్పెడు శనగలు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఉడికించిన శనగలను అలాగే.. తినలేక పిల్లలు మొండికేస్తుంటారు. అలాంటి వారికి నూనెలో చక్కగా తాలింపు పెట్టి ఇస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్విక్ అండ్ టేస్టీ శనగలు తాలింపును ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
నల్ల శనగలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 2 లేదా 3
ఉల్లిపాయ – 1
కరివేపాకు – 2 రెమ్మలు
ఆవాలు, జీలకర్ర – అర టీస్పూన్ చొప్పున
మినపప్పు, శనగపప్పు – 1 టీస్పూన్
ఎండుమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్ (ఆప్షనల్)
కారం మరియు ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – చిటికెడు
నూనె – 2 స్పూన్లు
కొత్తిమీర తరుగు, నిమ్మరసం – కొద్దిగా
1. ముందుగా రాత్రంతా నానబెట్టిన నల్ల శనగలను కుక్కర్లో వేసి, తగినన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. శనగలు మెత్తగా ఉడికిన తర్వాత.. వాటిలోని నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బంగరు రంగు వచ్చే వరకు వేయించాలి. కావాలనుకుంటే .. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. దీని వల్ల తాలింపు రుచి మరింత పెరుగుతుంది.
4. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందుగా.. ఉడికించి పెట్టుకున్న శనగలను పాన్లో వేయాలి. దీనికి చిటి కెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు (ఇప్పటికే.. ఉడికించేటప్పుడు వేసాము కాబట్టి చూసి వేసుకోవాలి), కొద్దిగా కారం లేదా చాట్ మసాలా చల్లుకోవాలి.
5. మంటను మీడియం ఫ్లేమ్లో.. ఉంచి శనగలను 2 నిమిషాల పాటు నూనెలో.. బాగా ఫ్రై చేయాలి. అప్పుడు మసాలాలు శనగలకు బాగా పడతాయి. చివరగా .. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మ రసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే శనగలు తాలింపు సిద్ధం!
తక్కువ ఖర్చుతో.. అత్యధిక పోషకాలు అందించే బెస్ట్ స్నాక్ ‘శనగలు తాలింపు’. పిల్లలు స్కూల్ నుంచి రాగానే.. లేదా సాయంత్రం వేళల్లో జంక్ ఫుడ్కు బదులుగా.. ఇది చేసి పెడితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈరోజే మీ ఇంట్లో ఈ శనగలు తాలింపును ట్రై చేయండి!