Weather Alert: వర్షాలు లేక అల్లాడి పోతున్నారు దక్షిణ ప్రాంతాల ప్రజలు. ఎల్ నినో కారణంగా తుఫాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలు ముఖం చాటేస్తున్నాయి. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ ఏడాది వాయుగుండం, తొలి తుఫానుగా మారింది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తూర్పు-మధ్య ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది.శనివారం రాత్రి నాటికి వాయుగుండంగా మారింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీనివల్ల సోమవారం పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ-ఐఎండీ తెలిపింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 28 రోజు ఆంధ్రప్రదేశ్ విశాఖ వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాన్‌కు అర్నబ్ గా నామకరణం చేసింది బంగ్లాదేశ్.
ప్రస్తుతం వాయుగుండం విశాఖకు 820, కాకినాడకు 910 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. బందరుకు 1020, బాపట్ల1100, కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఏపీ విపక్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. సోమవారం ఉదయానికి అర్నబ్ తుపాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య దిశగా పయనించి అర్నబ్ బలపడే అవకాశం ఉంది.
బుధవారం ఉదయానికి అర్నబ్ బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశముందని భావిస్తోంది. తీరం దాటేటప్పుడు గంటలకు 115 నుంచి 125 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగాఉండాలని విపక్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అర్నబ్ తీవ్ర తుపాను ప్రభావం కారణంగా 12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముంది.
అక్టోబర్ 26 రాత్రి నుంచి తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది . అక్టోబర్ 29 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారిని వెంటనే తిరిగి రావాలని కోరారు. తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాను నేపథ్యంలో ఉత్తరాంధ్రలో అతిపెద్ద ఉత్సవం పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి అంతరాయం కలిగించవచ్చని భావిస్తున్నారు. ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. మూడు జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెబుతూనే, ఆరెంజ్ హెచ్చరిక ఇచ్చింది. తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఈనెల 27 నుంచి 29 వరకు చాలా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.