Mydukur Municipality: ఏపీలోని ఓ మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది. మైదుకూరు నామినేషన్ ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు 8 మంది అభ్యర్థులకు సంబంధించిన 19 నామినేషన్ పత్రాలను చించి వేశారు. దీంతో అక్కడ మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పూనేఠ వెల్లడించారు. అసలు ఏం జరిగింది?
కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల అధికారి అనిల్‌చంద్ర పునేఠా ప్రకటన చేశారు. సోమవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆయన, అక్కడ నామినేషన్ పత్రాలను చించివేశారని చెప్పారు. పరిశీలన చేయడం కష్టమని, అందుకే మళ్లీ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికను మళ్లీ నిర్వహిస్తామన్నారు. ఎన్నికల ప్రకియకు అక్కడ మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఆదివారం రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు స్వీకరించారు అధికారులు. ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో భద్రతా వైఫల్యం బయట పడింది. గుర్తు తెలియని వ్యక్తులు.. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని మాయ చేసి 18 మంది అభ్యర్థులకు సంబంధించిన 19 నామినేషన్ పత్రాలను చించి వేశారు. నామినేషన్ పత్రాలను చింపివేయడం స్థానిక రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలియగానే జిల్లా అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తక్షణం నిలిపి వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి.
ALSO READ: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ‘స్థానిక’ రచ్చ.. మేయర్-మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు
ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ నివేదిక పంపారు. ఫలితంగా అక్కడ ఎన్నిక నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఎస్ఈసీ అనిల్ స్వయంగా వెల్లడించారు. నామినేషన్ పత్రాలను ధ్వంసం చేసిన నిందితులను గుర్తించేందుకు మున్సిపల్ ఆఫీసులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఫుటేజ్‌లో ఉన్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీనిపై ఎస్ఈసీ కొత్త నోటఫికేషన్ ఇవ్వనున్నారు.