Vizianagaram District: ఏపీలోని స్థానిక ఎన్నికలు.. అక్కడి కూటమి నేతల మధ్య చిచ్చుపెట్టాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇదే ఒరవడి కొనసాగింది. కూటమి పార్టీల మధ్య సీట్లు కొలిక్కి రాకపోవడంతో మూడు పార్టీల నేతలు భారీగా నామినేషన్లు వేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం అభ్యర్థులతో ఆయా పార్టీలు మంతనాలు జరుపుతున్నాయి.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రచ్చగా మారాయి. ఇప్పుడూ లేని విధంగా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి రాకపోవడంతో విజయనగరం మేయర్, సాలూరు, బొబ్బిలి, పార్వతిపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో మూడు పార్టీల నుంచి ఎక్కువగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. సీట్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాత నామినేషన్లు విత్ డ్రా చేసే అవకాశముంది.
ఆదివారంతో నామినేషన్ల ఘట్టం పూర్తి అయ్యింది. అయినా కూటమిలో సీట్ల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. విజయనగరం సిటీలోని 62 వార్డుల్లో సీట్లు పంపకంపై ఇంకా స్పష్టత రాలేదు. మూడు పార్టీల నేతలు వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు, చిన్న శ్రీనులు.. మిగతా పార్టీల నేతలతో చర్చలు చేస్తున్నారు. తాము అడిగిన సీట్లు ఇవ్వడం లేదని జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివిధ పార్టీల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. టీడీపీ 48 చోట్ల, జనసేన 10 చోట్లు, బీజేపీ నాలుగు డివిజన్లు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఎవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నెల్లిమర్ల నగర పంచాయితీలో 23 వార్డులు ఉన్నాయి. అక్కడ చైర్మన్ సీటు బీజేపీకి కేటాయించింది. ఆ పార్టీ తరపున మైపాడ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. సీటు మార్చాలని ఎదురుచూసిన నాయకులు రెబల్స్‌గా బరిలోకి దిగి నామినేషన్లు వేశారు.
టీడీపీ నుంచి ఛైర్మన్ అభ్యర్థిగా అప్పలనాయుడు, ఆయన సతీమణి హైమావతి నామినేషన్ వేశారు. జనసేన నుంచి రవ్వా నాని, జానా ప్రసాద్ నామినేషన్ వేశారు. అన్ని సీట్లలో టీడీపీ-జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, పార్లమెంటరీ అధ్యక్షుడు నాగార్జున విజయనగరంలో సమావేశమై, సీట్ల అంశంపై చర్చిస్తున్నారు.
ALSO READ: బస్సు సీటు కోసం కుమ్మేసుకున్నారు.. ఆసుపత్రిలో ఓ కుటుంబం, ఏపీలో షాకింగ్ ఘటన
బొబ్బిలి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. వైసీపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో సీట్ల పంపకం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. టీడీపీ-31, జనసేన-4, బీజేపీకి ఒక్కస్థానం కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జనసేన 11 సీట్లు కావాలని పట్టుబడడంతో ఎమ్మెల్యే బేబినాయన సుముఖంగా లేనట్లు సమాచారం. దీంతో 11 వార్డుల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నాలుగు వార్డులు మినహా టీడీపీ అభ్యర్థులు మిగిలిన అన్నిచోట్లా బరిలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని చైర్మన్ సీటు జనసేనకు కేటాయించారు. జనసేన అభ్యర్థిగా గొర్లె విజయ్ కుమారి నామినేషన్లు దాఖలు చేశారు. రెబల్స్ గా టీడీపీ నుంచి మంజీరా, మరో సీనియర్ నేత కూతురు సీటు కోసం నామినేషన్లు వేశారు. పార్వతీపురం మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా అక్కడ కూటమి పార్టీల్లో సీట్ల పంపకాల విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి.