Road Accident: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు మళ్లీ జోరందు కుంటున్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం వేకువజామున రెండు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఘటన సమయంలో రెండు బస్సుల్లో దాదాపు 47 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నంద్యాల జిల్లాలో జరిగింది.
ప్రయాణికులు చెబుతున్న సమాచారం మేరకు.. ఆదివారం తెల్లవారుజామున నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమల-మహేశ్వరి ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అమల ట్రావెల్స్కి చెందిన బస్సు 20 మంది ప్రయాణికులతో పొద్దుటూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. అదే సమయంలో బద్వేల్ నుంచి హైదరాబాద్ వైపు మహేశ్వరి ట్రావెల్స్ కు చెందిన బస్సు వస్తోంది.
సరిగ్గా నంద్యాల జిల్లాలోని జాతీయ రహదారిలో మహేశ్వరి ట్రావెల్స్ బస్సును అమలా ట్రావెల్స్ బస్సు ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించింది. వేగంగా వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి అమల ట్రావెల్స్ బస్సు.. వెనుక నుంచి మహేశ్వరి ట్రావెల్స్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సుకు ముందు భాగం, మరొక బస్సుకు వెనుక భాగం కాస్త డ్యామేజ్ అయ్యింది. ప్రమాదం సమయంలో రెండు బస్సుల్లో 40 నుంచి 50 మంది వరకు ప్రయాణికులు ఉణ్నారు. బస్సు ముందు భాగంలో కూర్చున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ALSO READ: విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు
ఘటన సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఏ ఒక్కరికీ తీవ్రగాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం గురించి తెలియగానే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలను తొలగించారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. డ్రైవర్ అతివేగం ప్రమాదానికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.