2026 Maruti Brezza Safety Rating: కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా తాజాగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. అదే సమయంలో భద్రత పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ కాంపాక్ట్ SUV తాజాగా నిర్వహించిన భారత్ NCAP క్రాష్ టెస్ట్ లో ఏకంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీంతో మారుతి సుజుకి నుంచి అత్యధిక భద్రతా రేటింగ్ పొందిన తాజా మోడల్ గా బ్రెజ్జా నిలిచింది. ఈ రిజల్ట్ బ్రెజ్జాను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మరింత నమ్మకాన్ని కలిగించే అంశంగా మారింది.
భారత్ NCAP పరీక్షల్లో 2026 బ్రెజ్జా అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతలో 32 పాయింట్లకు గాను 30.41 పాయింట్లు సాధించింది. అలాగే పిల్లల భద్రత విభాగంలో 49 పాయింట్లకు గాను 43 పాయింట్లు దక్కించుకుంది. ఈ స్కోర్లతో బ్రెజ్జా తన సెగ్మెంట్ లో అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలిచింది. క్రాష్ టెస్ట్ కోసం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వచ్చిన టాప్ వేరియంట్ ZXI+ను ఉపయోగించారు. అయితే, ఈ రేటింగ్ ఒక్క వేరియంట్ కే కాకుండా, 2026 బ్రెజ్జా మొత్తం శ్రేణికి వర్తిస్తుందని భారత్ NCAP వెల్లడించింది.
ఫ్రంటల్ ఆఫ్ సెట్ డిఫార్మబుల్ బారియర్ పరీక్షలో బ్రెజ్జా 16 మార్కులకు గాను 14.41 మార్కులు సాధించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ లో మాత్రం పూర్తి స్థాయిలో రాణించి 16కు 16 మార్కులు దక్కించుకుంది. ఫ్రంట్ క్రాష్ టెస్ట్ లో ఛాతీ, కాలి భాగాలకు తగిన స్థాయిలో రక్షణ లభించినప్పటికీ, తల, మెడ లాంటి కీలక శరీర భాగాలకు మంచి భద్రతను అందించినట్లు పరీక్షల్లో వెల్లడైంది. పిల్లల భద్రత విషయంలో కూడా కొత్త బ్రెజ్జా అద్భుతమైన ఫలితాలు నమోదు చేసింది. డైనమిక్ అసెస్ మెంట్ లో 24కు 24 మార్కులు సాధించి పూర్తి స్కోర్ అందుకుంది. అలాగే చైల్డ్ రెస్ట్రైంట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ లో కూడా 12కు 12 మార్కులు సాధించింది. మొత్తం పిల్లల భద్రత స్కోరు 49లో 43గా నమోదైంది.
ఈ ఫలితం పాత తరం బ్రెజ్జాతో పోలిస్తే భద్రత భారీగా పెరిగింది. 2018లో గ్లోబల్ NCAP పరీక్షల్లో బ్రెజ్జా పెద్దల భద్రతకు 4 స్టార్స్, పిల్లల భద్రతకు 2 స్టార్స్ మాత్రమే పొందింది. ఇప్పుడు కొత్త బ్రెజ్జా నేరుగా 5-స్టార్ భారత్ NCAP రేటింగ్ సాధించడం మారుతి సుజుకి భద్రతపై మరింత దృష్టి పెట్టిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
కొత్త బ్రెజ్జాలో భద్రతకు సంబంధించిన పలు అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి ఫీచర్లు ప్రయాణికుల రక్షణ అందించనున్నాయి.
భద్రతతో పాటు ఇంజిన్ ఆప్షన్స్ లోనూ కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ఇంజిన్ ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది. 2026 మారుతి సుజుకి బ్రెజ్జా 5-స్టార్ భారత్ NCAP రేటింగ్ తో కాంపాక్ట్ సెగ్మెంట్ లో బలమైన పోటీదారుగా నిలవనుంది.
Read Also: పవర్ ఫుల్ ఇంజిన్.. అదిరిపోయే ఫీచర్లు.. కొత్త బ్రెజ్జా వచ్చేసింది!