Pulsar NS400Z New Engine: త్వరలో మార్కెట్ లోకి రానున్న బజాజ్ పల్సర్ NS400Z, డొమినార్ 400 మోడళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విడుదలకు ముందే ఈ వివరాలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా, ఈ బైక్ లలో ఉపయోగించబోయే కొత్త 350cc ఇంజన్ స్పెసిఫికేషన్లు లీక్ కావడం ఆటోమొబైల్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం భారత్ లో 350cc కంటే ఎక్కువ సామర్థ్యం గల బైక్ లపై ఎక్కువ GST విధిస్తున్నారు. ఈ పన్నును తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అదే దిశలో బజాజ్ కూడా కొత్త ప్లాన్ అమలు చేయబోతోంది. 400cc ఇంజన్ ఉన్న మోడళ్లను కొద్దిగా తగ్గించి, 350cc లోపలే ఉంచడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవాలని చూస్తోంది. అయితే, బైక్ పేర్లు మాత్రం అలాగే కొనసాగించనుంది.
తాజాగా లీకైన వివరాల్లో ఇంజన్ సామర్థ్యం 349.13ccగా ఉండబోతోంది. ఇది పాత 400cc ఇంజన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. బోర్ సైజ్ మాత్రం మారలేదు. 89 mmగానే కంటిన్యూ అవుతోంది. స్ట్రోక్ ను 60 mm నుంచి 56.1 mmకు తగ్గించారు. ఈ మార్పు వల్ల ఇంజన్ సామర్థ్యం తగ్గినా, పనితీరును యథావిధిగా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక పవర్ అవుట్ పుట్ విషయానికి వస్తే, ఈ కొత్త ఇంజన్ 9000 RPM దగ్గర 40.6 PS గరిష్ట శక్తిని ఇస్తుంది. అలాగే 7500 RPM దగ్గర 33.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ తో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువే. ముందు ఉన్న ఇంజన్ 43 PS పవర్, 35 Nm టార్క్ ఇస్తుండగా, ఇప్పుడు పవర్ 2.4 PS, టార్క్ 1.8 Nm తగ్గింది. అంటే, పనితీరులో స్వల్ప తగ్గుదల ఉన్నా, ఇది సాధారణ వినియోగంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని తెలుస్తోంది.
ఇంజన్ టెక్నాలజీ విషయంలో పెద్దగా మార్పులు లేవు. ఇది ఇప్పటికీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ యూనిట్ గానే ఉంటుంది. సింగిల్ స్పార్క్ ప్లగ్, స్లిప్- అసిస్ట్ క్లచ్, వెట్ సంప్ లూబ్రికేషన్ లాంటి ఫీచర్లు అలాగే కొనసాగుతాయి. 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా అలాగే ఉంటుంది. డిజైన్ విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుత మోడళ్ల మాదిరిగానే లుక్, స్టైల్ కొనసాగించే అవకాశం ఉంది. USD ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ ఛానల్ ABS, డిస్క్ బ్రేక్‌లు, రైడింగ్ మోడ్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అలాగే ఉంటాయి. ధర కూడా ఇంచుమించి అంతే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also: హై పెర్ఫార్మెన్స్ బైక్ లకు కొత్త బ్రేక్ టెక్నాలజీ.. పనితీరు చూస్తే మతిపోవాల్సిందే!