భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.19.72 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. కొత్త మోడల్ లో కొన్ని డిజైన్ మార్పులతో పాటు అదనపు ఫీచర్లు, కొత్త ఇంటీరియర్ థీమ్ ను అందించారు. అయితే, ఇంజిన్, పనితీరులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
కొత్త ఇన్నోవా క్రిస్టా బయట నుంచి చూస్తే మరింత ప్రీమియంగా కనిపించేలా టయోటా కొన్ని చిన్న మార్పులు చేసింది. ముందు భాగంలో కొత్త డిజైన్ రేడియేటర్ గ్రిల్, అప్ డేట్ చేసిన బంపర్ గార్నిష్ ను అమర్చారు. వెనుక భాగంలో కూడా బంపర్ డిజైన్ లో చిన్న మార్పులు చేశారు. ఇవి పెద్దగా కనిపించకపోయినా, వెహికల్ కు కొత్త లుక్ ను తీసుకొచ్చాయి.
క్యాబిన్ లో మరిన్ని అప్ డేట్స్ చేసింది. కొత్త డ్యూయల్ టోన్ లెదర్ సీట్లు, గ్రేస్ కాపర్ కలర్ ట్రిమ్స్ తో ఇంటీరియర్ ను మరింత అంతంగా తీర్చిదిద్దారు. డ్యాష్ బోర్డ్, డోర్ ప్యానెల్స్, ఇతర భాగాల్లో కాపర్ ఫినిష్ తో పాటు వుడ్ ప్యాటర్న్ డిజైన్ ను ఉపయోగించారు. దీంతో క్యాబిన్ మరింత ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది.
ఫీచర్ల పరంగా కూడా కొత్త ఇన్నోవా క్రిస్టా అప్ డేట్ అయ్యింది. పలు ఉపయోగకరమైన ఫీచర్లను యాడ్ చేసింది. వైర్ లెస్ మొబైల్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వెనుక ఏసీ వెంట్స్ లాంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, టయోటా అదే 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించింది. ఈ ఇంజిన్ కు ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను జత చేశారు. సుదూర ప్రయాణాల్లో సౌకర్యం, మంచి పనితీరు, బలమైన డీజిల్ ఇంజిన్ కారణంగా ఇన్నోవా క్రిస్టాకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ప్రకారం ఈ ఎంపీవీ లీటరుకు 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
భద్రత పరంగా కూడా టయోటా ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో ఏడు ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ ప్రయాణాలు, కమర్షియల్ అవసరాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది.
ఇక కొత్త ఇన్నోవా క్రిస్టా ప్లాటినం వైట్ పెర్ల్, సూపర్ వైట్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, అవంత్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్ లాంటి ఐదు రంగుల్లో లభిస్తుంది. అటు ఇన్నోవా హైక్రాస్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ, డీజిల్ ఇంజిన్, విశ్వసనీయత, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కారణంగా ఇన్నోవా క్రిస్టాకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. అయితే,తాజా సమాచారం ప్రకారం 2027 నాటికి ఈ మోడల్‌ను నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: భారత్ లో గ్రీన్ SM ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసులు షురూ.. ఓలా, ఉబర్ కు ఇక చుక్కలే!