Important Summer Car Maintenance Tips: చాలా మంది సమ్మర్ వచ్చిందంటే.. ఫ్రెండ్స్ తో లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తో లాంగ్ డ్రైవ్, రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారు ముందుగా కారును ఒకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో చిన్న సమస్య కూడా పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ప్రయాణానికి బయలుదేరే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలిస్తే, సేఫ్‌గా, సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ఇంతకీ చెక్ చేయాల్సిన ఆ అంశాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటగా కూలెంట్ లెవెల్ ను చెక్ చేయాలి. వేసవిలో ఇంజిన్ ఎక్కువ వేడెక్కే అవకాశముంది. కూలెంట్ సరిపడా లేకపోతే ఇంజిన్ త్వరగా ఓవర్ హీట్ అవుతుంది. అందుకే, కూలెంట్ సరిపడ లెవెల్ లో ఉందో? లేదో? తెలుసుకోవాలి. అవసరమైతే నింపాలి.
ఆ తర్వాత ఇంజిన్ ఆయిల్ ని చెక్ చేయాలి. ఆయిల్ తక్కువగా ఉన్నా? పాతదైనా? ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుంది. వేడిని పెంచుతుంది. సర్వీస్ టైమ్ దగ్గర్లో ఉంటే ఆలస్యం చేయకుండా చేయించుకోవడం మంచిది.
ప్రయాణంలో టైర్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఎక్కువగా వీటిని నిర్లక్ష్యం చేస్తారు. వేసవిలో గాలి వేడి వల్ల విస్తరిస్తుంది. కాబట్టి, టైర్ ప్రెషర్ సరిగ్గా ఉండాలి. ఎక్కువ గాలి, తక్కువ గాలి రెండూ ప్రమాదకరం. అలాగే టైర్లపై కోతలు, ఎక్కువగా అరిగిన గుర్తులు ఉన్నాయేమో చూడాలి.
బ్యాటరీ పరిస్థితిని కూడా ఒకసారి చూసుకోవాలి. వేడి కారణంగా బ్యాటరీ త్వరగా వీక్ అవుతుంది. కారు స్టార్ట్ అవ్వడంలో ఆలస్యం అవుతుంటే, బ్యాటరీ పాతదైతే ముందే చెక్ చేయించుకోవడం మంచిది. మధ్యలో ఇబ్బంది పడకుండా ఉండటానికి సాయపడుతుంది.
ఏసీ సరిగ్గా పనిచేస్తుందో లేదో కూడా చూసుకోవాలి. వేసవిలో కేవలం సౌకర్యం కోసం కాదు, అవసరం కూడా. క్యాబిన్ లో చల్లదనం లేకపోతే డ్రైవింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ముందే సర్వీస్ చేయించుకోవడం మంచిది.
బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయో? లేదో? పరీక్షించాలి. ఏవైనా వింత శబ్దాలు వస్తే, పెడల్ ఫీల్ లో మార్పు ఉంటే వెంటనే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాలి. బ్రేకుల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
కారులో కొన్ని అవసరమైన వస్తువులు పెట్టుకోవాలి. వాటర్ బాటిల్, ఫోన్ ఛార్జర్, అవసరమైన స్నాక్స్, ఒక చిన్న టూల్ కిట్ లాంటి ఉండాలి. అలాగే, వెహికల్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలి.
ఈ మొత్తం చెక్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం 10-15 నిమిషాలు సరిపోతాయి. ఈ చిన్న జాగ్రత్తలు మీ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యంగా మార్చుతాయి. ముందస్తు చెకింగ్ తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రిప్‌ను ఎంజాయ్ చెయ్యొచ్చు.
Read Also: ఫీచర్లలో విన్‌ఫాస్ట్ VF3 సూపర్.. కానీ, ఇండియాలో హిట్ కొట్టేనా?