Bajaj Avenger 220 Street vs Cruise: క్రూయిజర్ బైక్ లను ఇష్టపడే రైడర్లలో బజాజ్ అవెంజర్ సిరీస్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం అవెంజర్ 220 లైనప్ లో అవెంజర్ 220 స్ట్రీట్, అవెంజర్ 220 క్రూజ్ అనే రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు బైక్ లు ఒకే ప్లాట్ ఫారమ్ పై తయారైనప్పటికీ, స్టైలింగ్, వీల్స్, రైడింగ్ ఫీల్ లాంటి అంశాల్లో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ధర మాత్రం రెండింటికీ ఒకటే కావడం విశేషం.
అవెంజర్ 220 స్ట్రీట్, 220 క్రూజ్ రెండింటిలోనూ 220 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 19 హెచ్‌పీ పవర్, 17.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. రెండు బైక్ లలో ఫ్రేమ్, ఛాసిస్, సస్పెన్షన్ సెటప్ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. 737 మిల్లీ మీటర్ల తక్కువ సీట్ హైట్ ఉండటం వల్ల తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కూడా సులభంగా నడిపే అవకాశం ఉంటుంది. ఫుట్ పెగ్ పొజిషన్ కూడా రెండింటిలో ఒకేలా ఉండటంతో రిలాక్స్ డ్ క్రూయిజింగ్ ఎక్స్ పీరియెన్స్ లభిస్తుంది.
ఈ రెండు మోడళ్ల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి లుక్‌లో కనిపిస్తుంది. అవెంజర్ 220 స్ట్రీట్ బ్లాక్ అవుట్ థీమ్ తో వస్తుంది. ఇంజిన్, ఎగ్జాస్ట్, ఇతర భాగాలకు నలుపు రంగు ఫినిష్ ఇచ్చారు. దీంతో బైక్‌కు స్పోర్టీ, అర్బన్ లుక్ వస్తుంది. హెడ్ లైట్ కూడా ఓవల్ ఆకారంలో ఉంటుంది. అవెంజర్ 220 క్రూజ్ సాంప్రదాయ క్రూయిజర్ స్టైల్ ను కొనసాగిస్తుంది. బైక్ పై ఎక్కువగా క్రోమ్ ఫినిష్ కనిపిస్తుంది. ముందు భాగంలో పెద్ద విండ్ స్క్రీన్ ఉండటం వల్ల హైవే ప్రయాణాల్లో గాలి ప్రభావం కొంత వరకు తగ్గుతుంది. క్లాసిక్ క్రూయిజర్ లుక్ కోరుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది.
ప్రాక్టికల్ గా చూస్తే రెండు బైక్ ల మధ్య అత్యంత ముఖ్యమైన తేడా వీల్స్, టైర్లలోనే ఉంటుంది. అవెంజర్ 220 స్ట్రీట్‌లో అల్లాయ్ వీల్స్‌తో పాటు ట్యూబ్‌లెస్ టైర్లు అందిస్తారు. పంక్చర్ వచ్చినా టైర్ ను త్వరగా రిపేర్ చేయడం సులభం. అవెంజర్ 220 క్రూజ్ లో మాత్రం స్పోక్ వీల్స్ మరియు ట్యూబ్ టైప్ టైర్లు ఉంటాయి. ఇవి క్లాసిక్ క్రూయిజర్ లుక్ ను ఇస్తాయి కానీ, పంక్చర్ అయితే బాగు చేసేందుకు కొంత సమయం పడుతుంది. రెండు బైక్‌లలోనూ ముందు 17 అంగుళాల, వెనుక 15 అంగుళాల వీల్స్ ఉంటాయి. టైర్ సైజులు కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే, క్రూజ్ బరువు 163 కేజీలు కాగా, స్ట్రీట్ 160 కేజీల బరువుతో కొద్దిగా తేలికగా ఉంటుంది. స్ట్రీట్ వెర్షన్ లో ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఉండటంతో రైడర్ కొద్దిగా ముందుకు వంగి కూర్చునే అవకాశం ఉంటుంది. సిటీ ప్రయాణాల్లో ఇది బాగుంటుంది. క్రూజ్ వెర్ష న్‌లో హ్యాండిల్ బార్ కొంచెం ఎత్తుగా, వెనక్కి వంగి ఉంటుంది. మరింత రిలాక్స్ డ్ రైడింగ్ పొజిషన్ లభిస్తుంది.
అవెంజర్ 220 స్ట్రీట్, అవెంజర్ 220 క్రూజ్ రెండింటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షలు. అంటే ధర పరంగా ఎలాంటి తేడా లేదు. ట్యూబ్‌లెస్ టైర్లు, బ్లాక్ అవుట్ స్పోర్టీ లుక్, రోజువారీ వినియోగంలో ఎక్కువ సౌలభ్యం కావాలంటే అవెంజర్ 220 స్ట్రీట్ తీసుకోవాలి. క్లాసిక్ క్రూయిజర్ స్టైల్, క్రోమ్ ఫినిష్, పెద్ద విండ్ స్క్రీన్‌తో హైవే టూరింగ్ అనుభవం కోరుకుంటే అవెంజర్ 220 క్రూజ్ సరిపోతుంది.
Read Also: హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?