Earn Money from Car: మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చే వేతనం సరిపోవడం లేదా? ప్రతి నెలా ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం మాత్రం పెరగడం లేదని బాధపడుతున్నారా? ఈ క్రమంలో ఫుల్‌టైమ్ ఉద్యోగం చేస్తూ కూడా మరో జాబ్ వెతకడం కష్టమే అనిపిస్తుంది. కానీ మీ దగ్గర సొంత కారు ఉంటే.. అదనంగా డబ్బు సంపాదించడం అంత కష్టమేమీ కాదు. ఫుల్‌టైమ్ ఉద్యోగం చేస్తూనే.. ఈవెనింగ్స్, వీకెండ్స్, హాలిడేస్, మీ ఫ్రీ టైమ్‌లో కారుతో అదనంగా డబ్బులు సంపాదించుకునే కొన్ని స్మార్ట్, ప్రాక్టికల్ మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
వీకెండ్ డేస్‌లో లేదా డ్యూటీ అయిపోగానే సాయంత్రం వేళల్లో 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య లేదా శని, ఆదివారాలు పూర్తిగా ర్యాపిడో, ఉబర్ వంటి వాటిల్లో రైడ్ షేరింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం ఆఫీసు అయిపోయే టైంకి, వీకెండ్స్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గంటకు రూ.300 నుంచి 600 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇలా నెలకు 10 నుంచి 15 రోజులు 4 నుంచి 5 గంటలు రైడ్ షేరింగ్ చేసుకుంటే.. సుమారు రూ.8వేల నుంచి రూ.20వేల వరకు సైడ్ ఇన్‌కం వచ్చే అవకాశం ఉంటుంది.
సాధారణంగా చాలామంది ఈవెనింగ్ టైంలో ఎక్కువగా ఫుడ్ ఆర్డర్స్ ఇస్తుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఎక్కువ ఆర్డర్లు ఉంటాయి. ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే గనుక.. మంచి సైడ్ ఇన్‌కం పొందవచ్చు. మీ వద్ద ఉన్న కారుతో ఒకేసారి భారీ ఆర్డర్స్ లేదా మల్టిపుల్ ఆర్డర్లను తీసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఎక్కువ పేమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. పేమెంట్స్‌తో పాటు చాలావరకు టిప్స్ కూడా అందుతుంది. అలాగే వీకెండ్స్‌లో సిటీల్లో ఉన్నవాళ్లు లంచ్ లేదా డిన్నర్ ప్లాన్ చేస్తుంటారు. ఈ టైమ్‌ను సరిగ్గా వినియోగించుకుంటే.. నెలకు రూ.6వేల నుంచి రూ.15వేల వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు.
మీ వద్ద ఖాళీగా ఉన్న కారును సెల్ఫ్ డ్రైవ్ రెంటల్‌గా ఇవ్వడం మంచి ఇన్‌కమ్ ఆప్షన్. Oomcar, Spinny Drive లాంటి ప్లాట్‌ఫామ్‌లలో మీ కారును లిస్ట్ చేయవచ్చు. మీరు ఆఫీస్‌కు వెళ్లే టైమ్‌లో, వీకెండ్స్‌లో ఎవరో ఒకరు కారును రెంట్ తీసుకుంటే, మీకు అదనపు ఆదాయం వస్తుంది. ముఖ్యంగా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. దీంతో మీ జాబ్‌ను కూడా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కారు మోడల్, సిటీ మీద ఆధారపడి నెలకు రూ.10వేల నుంచి రూ.30వేల వరకు ఆధాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్లాట్‌ఫామ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో ముందే చెక్ చేసుకోవాలి.
మీకు డ్రైవింగ్ ఇష్టమైతే.. వీకెండ్స్‌లో టూరిస్టులు లేదా ఫ్యామిలీల కోసం సిటీ టూర్స్, దగ్గర్లోని టెంపుల్స్ లేదా రిసార్ట్స్‌కు ట్రిప్స్ ఆఫర్ చేయవచ్చు. దీనికోసం MakeMyTrip లాంటి ప్లాట్‌ఫామ్‌లలో లిస్ట్ చేసుకోవచ్చు. లేదా సొంతంగా వాట్సప్ గ్రూప్స్, ఫేస్‌బుక్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఒక్కో ట్రిప్‌కు రూ.3వేల నుంచి రూ.8వేల వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇలా నెలకు 4 నుంచి 6 ట్రిప్స్ ప్లాన్ చేస్తే మంచి సైడ్ ఇన్‌కమ్ వస్తుంది. ఇలా చేయడం వల్ల మీ జాబ్‌పైన పెద్దగా ప్రభావం ఏం ఉండదు.
ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య స్కూల్ పిల్లల పికప్-డ్రాప్ సర్వీస్ తీసుకుంటే.. ఎక్స్‌ట్రా ఇన్‌కం బాగానే వస్తుంది. ఒకే రూట్‌లో 4 నుంచి 5 మంది పిల్లలను తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటే.. నెలకు సుమారు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు రెగ్యులర్ ఆదాయం పొందొచ్చు. మీ జాబ్ టైమింగ్స్‌కు ఇబ్బంది కాకుండా ప్లాన్ చేసుకుంటే ఇది చాలా ప్రాక్టికల్ సైడ్ వర్క్ అవుతుంది.
మొదట్లో పూర్తిగా కాకుండా పార్ట్ టైమ్‌గా మొదలుపెట్టి.. కరెక్ట్‌గా ఎంత సమయం పడుతుందో అంచనా వేసుకోవడం మంచిది. అలాగే ఫ్యూయల్ ఖర్చు తగ్గించుకోవాలి అనుకుంటే.. మీ కారు కోసం CNG లేదా పెట్రోల్‌లో ఏది బెటరో చూసుకోండి. జాబ్ టైమ్‌లో మీ కారును రెంటల్‌కు ఇవ్వడం లాంటి ఆప్షన్ల మీద ఫోకస్ పెడితే.. డబ్బులు సరిపోవడం లేదనే ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. అలాగే ఆదాయం పెరిగితే టాక్స్‌ల విషయం పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రూ.20 లక్షలు దాటితే GST, Income Taxను ట్రాక్ చేస్తుండాలి. ముఖ్యంగా ఓవర్‌వర్క్ అవ్వకుండా వారానికి 15 – 20 గంటలకు మించి టైమ్ కేటాయించకుండా లిమిట్ పెట్టుకోవడం ఉత్తమం.