Lady Constable Suicide Attempt: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపానికి గురైన ఓ మహిళా కానిస్టేబుల్ నివాసం ఉంటున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధితురాలిని ప్రమీల (32)గా గుర్తించారు. ఈమె 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ కాగా, ప్రస్తుతం నాచారం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రవి పహార్ తండా వీరి స్వస్థలం కాగా, ఉద్యోగ రీత్యా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె తన భర్త బాలాజీ నాయక్, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.
అయితే, గత కొంతకాలంగా కుటుంబంలో సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తీవ్ర ఆవేదనకు లోనైన ప్రమీల, తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను హుటాహుటిన ఉప్పల్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భర్త బాలాజీ నాయక్ ఆమెను సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Read Also: Hyderabad Crime: విషాదం.. మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్ సూసైడ్