5 Upcoming Tata Cars in India 2026-27: దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీ టాటా మోటార్స్.. భారతీయ కారు మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సరసమైన ధరల్లో మంచి ఫీచర్లతో కార్లు అందించడం, అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడం వల్ల కంపెనీ ప్రజల్లో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 2026-27కు గాను మరో ఐదు కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. వీటిలో ఎలక్ట్రిక్ మోడళ్లు స్పెషల్ గా నిలువబోతున్నాయి.
ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో టాటా కొత్త సియెర్రా, పంచ్, పంచ్ EV లాంటి మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ లైనప్‌కు కొనసాగింపుగా, మరికొన్ని కొత్త కార్లను త్వరలో తీసుకురానుంది. ఇందులో ముఖ్యంగా సియెర్రా EVపై బాగా హైలెట్ అయ్యింది. ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ SUVగా రానుండగా, దీని డిజైన్ సింపుల్ గా, మోడర్న్ గా ఉండేలా తయారు చేశారు. బయట నుంచి చూస్తేనే ఎలక్ట్రిక్ వాహనం అని గుర్తు పట్టేలా ఉండదు. లోపల కూడా సాధారణ కార్ల మాదిరిగానే సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇక ఈ సియెర్రా EVని రెండు రకాల డ్రైవ్ ఆప్షన్లలో తీసుకురానుంది. ఒకటి రియర్ వీల్ డ్రైవ్. మరొకటి ఆల్ వీల్ డ్రైవ్. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. అలాగే ఈ వాహనం నుంచి ఇతర ఎలక్ట్రిక్ పరికరాలకు పవర్ అందించే ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
ఇక టియాగో, టియాగో EVలకు కొత్త ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు కూడా రాబోతున్నాయి. ఇవి ఇప్పటికే వినియోగదారులలో మంచి ఆదరణ పొందిన కార్లు. కొత్తగా వచ్చే వెర్షన్లలో డిజైన్ లో కొంత మార్పు ఉంటుంది. కొత్త లుక్స్ తో పాటు కొద్దిగా అప్ డేటెడ్ ఫీచర్లు ఉంటాయి. కానీ, ఇంజిన్, బ్యాటరీ విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు.
మరొక ఆసక్తికరమైన మోడల్ సఫారీ EV. ఇది టాటా సఫారీకి ఎలక్ట్రిక్ వెర్షన్ గా రానుంది. పెద్ద ఫ్యామిలీ SUVగా ఉండే ఈ కారు 6 లేదంటే 7 సీటర్లతో అందుబాటులో ఉండొచ్చు. బ్యాటరీ సైజ్ ను బట్టి సుమారు 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వనుంది. ఇది మార్కెట్ లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇక టాటా ఒక కొత్త బ్రాండ్‌ను కూడా పరిచయం చేయబోతోంది. అవిన్యా పేరుతో రానున్న ఈ బ్రాండ్ పూర్తిగా ప్యూచరిస్టిక్ టెక్నాలజీపై ఆధారపడి రూపొందుతోంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చే మొదటి కారు డిజైన్ పరంగా చాలా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇది లోహైట్ డిజైన్ తో, పెద్ద ఇంటీరియర్ స్పేస్‌తో, ఎక్కువ రేంజ్ తో రానుంది. మొత్తంగా 2026-27లో వచ్చే ఈ కొత్త మోడళ్లు టాటాకు మరింత గుర్తింపు తీసుకురానున్నాయి.
Read Also: బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్ To విటారా ఫేస్ లిఫ్ట్.. మారుతి నుంచి 4 క్రేజీ కార్లు!