GMC Hummer EV in India: భారత్ లోకి పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. వీటిలో కొన్ని అధికారికంగా భారత్ లో లాంచ్ కాకపోయినా, ప్రైవేట్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వాటిలో ఒకటి GMC హమ్మర్ EV. ఇది సాధారణ SUV కాదు. ఓ భారీ మిషన్ లాంటి వెహికల్. 2024 నుంచి రైట్ హ్యాండ్ డ్రైవ్ (RHD) కన్వర్షన్ యూనిట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
హమ్మర్ EV స్పెషల్ అట్రాక్షన్ దాని పవర్. ఈ కారు గరిష్టంగా 1,000 హార్స్ పవర్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టార్క్ 15,000 Nm కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పవర్ తో కేవలం 3.5 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. Watts to Freedom అనే స్పెషల్ మోడ్ తో ఈ వేగం మరింత ఎగ్జైటింగ్ కలిగిస్తుంది. కేవలం వేగం మాత్రమే కాదు, టెక్నాలజీ విషయంలో కూడా స్పెషల్. CrabWalk అనే ఫీచర్ ద్వారా వాహనం డయాగనల్ గా కదులుతుంది. అంటే, నేరుగా ముందుకు, వెనక్కి మాత్రమే కాకుండా, కొంచెం సైడ్ యాంగిల్ లో కూడా వెళ్తుంది. కష్టమైన ఆఫ్ రోడ్ మార్గాల్లో చాలా ఉపయోగపడుతుంది. అలాగే, 4 వీల్ స్టీరింగ్ సిస్టమ్ వాహనాన్ని పెద్దదైనా సులభంగా మలుపులు తిప్పేలా చేస్తుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ వెహికల్ కు పెద్ద ప్లస్ పాయింట్. సాధారణంగా ఇది చాలా ఎత్తులో ఉంటుంది. కానీ, Extract Mode ద్వారా సస్పెన్షన్ ను మరింత పెంచి 400 మిమీకి పైగా క్లియరెన్స్ పొందవచ్చు. దీని వల్ల పెద్ద గుంతలు, రాళ్లు ఉన్న మార్గాల్లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు.
హమ్మర్ EVలో సుమారు 200 kWh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే, సుమారు 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. పెద్ద బ్యాటరీకి తగినట్లుగా, ఇది 300 kW పైగా DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. తక్కువ సమయంలోనే మంచి రేంజ్ పొందవచ్చు.
ఈ వెహికల్ దాదాపు 2.2 మీటర్ల వెడల్పుతో, 4,500 కిలోల బరువుతో ఉంటుంది. ఇది సాధారణ నగర రోడ్లకంటే ఆఫ్ రోడ్, ఓపెన్ ఏరియాలకు ఎక్కువగా సరిపోతుంది.ఈ కారు 14 స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, 17 కెమెరాలు, రిమూవబుల్ ఇన్ఫినిటీ రూఫ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత లగ్జరీగా మార్చుతాయి.
ధర విషయానికి వస్తే.. భారత్‌లో దీని ఆన్ రోడ్ ధర సుమారు రూ.4.5 కోట్లు ఉంటుంది. ఈ వెహికల్ అందించే పనితీరు, టెక్నాలజీ, ప్రత్యేకతను చూసినప్పుడు, ఇది ప్రీమియం సెగ్మెంట్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భారీ వెహికల్స్, ఆఫ్ రోడింగ్, హై పర్ఫార్మెన్స్ ఇష్టపడేవారికి ఇదో డ్రీమ్ SUVగా చెప్పుకోవచ్చు.
Read Also: నయా కారవాన్.. జస్ట్ రూ.30 లక్షలకే సింగిల్ బెడ్‌రూమ్ లాంటి లగ్జరీ!