Kia Carens Family Hits 3 Lakh Sales: భారత మార్కెట్లో కియా కేరెన్స్ మరో కీలక మైలురాయిని అందుకుంది. కియా కేరెన్స్, కేరెన్స్ క్లావిస్, కేరెన్స్ క్లావిస్ ఈవీ మోడళ్ల కలిపి 3 లక్షల యూనిట్ల అమ్మకాలు దాటాయి. 2022 ఫిబ్రవరిలో కేరెన్స్ తొలిసారి భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి 2026 మే నాటికి మొత్తం 3,01,657 యూనిట్లు అమ్మినట్లు కియా ఇండియా ప్రకటించింది. వీటిలో 32 వేలకుపైగా వాహనాలు విదేశాలకు ఎగుమతి చేసింది. కియా ఇండియా విక్రయిస్తున్న మోడళ్లలో కేరెన్స్ మంచి ఆదరణ పొందిన వాహనంగా నిలిచింది. ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన కియా మోడళ్లలో సెల్టోస్ మొదటి స్థానంలో, సోనెట్ రెండో స్థానంలో ఉండగా, కేరెన్స్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
కేరెన్స్ అమ్మకాల ప్రయాణం కూడా ఆసక్తికరంగా సాగింది. మార్కెట్లోకి వచ్చిన కొద్దికాలంలోనే వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో 16 నెలల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. అయితే, రెండో లక్ష యూనిట్లకు చేరుకోవడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. అనంతరం క్లావిస్, క్లావిస్ ఈవీ మోడళ్లు మార్కెట్లోకి రావడంతో అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. మరో లక్ష యూనిట్ల అమ్మకాలను కేవలం 16 నెలల్లోనే నమోదు చేసింది.
ఆర్థిక సంవత్సరం 2025-26లో కేరెన్స్ కుటుంబం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ కాలంలో 79 వేలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు కేరెన్స్ కు నమోదైన అత్యధిక వార్షిక అమ్మకాల రికార్డు. అదే సమయంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన MPVల జాబితాలో మారుతి ఎర్టిగా, టయోటా ఇన్నోవా తర్వాత మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. కేరెన్స్ ను మొదటిగా మారుతి ఎర్టిగా, XL6 వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా కియా తీసుకొచ్చింది. విశాలమైన క్యాబిన్, 6, 7 సీటర్ ఆప్షన్లు, వివిధ ఇంజిన్ ఎంపికలు, ఆధునిక ఫీచర్ల కారణంగా ఇది కుటుంబ వినియోగదారులను ఆకట్టుకుంది.
2025లో కియా కేరెన్స్ కు మరింత ప్రీమియం వెర్షన్ గా క్లావిస్ ను పరిచయం చేసింది. కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్ తో క్లావిస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సంవత్సరం క్లావిస్ ఈవీని కూడా విడుదల చేయడంతో కియా తన మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ MPVని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కియా కేరెన్స్, క్లావిస్ రెండింటినీ ఒకేసారి విక్రయిస్తోంది. సాధారణ కేరెన్స్ ను బడ్జెట్ కొనుగోలుదారులు, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ఉంచగా, క్లావిస్ ను ప్రీమియం కస్టమర్ల కోసం అందిస్తోంది. అంతేకాకుండా కియా లైనప్ లో CNG ఆప్షన్ పొందిన తొలి మోడల్ గా కూడా కేరెన్స్ నిలిచింది.
ధరల విషయానికి వస్తే, కియా కేరెన్స్ ధర రూ.11.02 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కేరెన్స్ క్లావిస్ ధర రూ.11.22 లక్షల నుంచి రూ.21.58 లక్షల వరకు ఉండగా, క్లావిస్ ఈవీ ధరలు రూ.11.14 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉన్నాయి. పెరుగుతున్న అమ్మకాలతో కియా MPV విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది.
Read Also: కియా సోనెట్ కు షాక్.. క్రాష్ టెస్టులో మరీ ఇంత ఘోరమా?