Smart Helmet Design Confuses Traffic Police: కొన్ని సంఘటనలు వింటే నిజంగా జరిగాయా? లేక సినిమా సీనా? అనే అనుమానం కలిగేలా చేస్తాయి. ఇలాంటి విచిత్రమైన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. ఒక బైక్ రైడర్ కి పదేపదే పోలీసులు చలాన్లు విధించడం అక్కడ పెద్ద చర్చగా మారింది. కారణం కూడా చాలా వింతగా ఉంది. అతడు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడని పోలీసులు భావించేవారు. కానీ, అసలు నిజం తెలిసిన తర్వాత వాళ్లే షాక్ అయ్యారు.
సదరు వ్యక్తి బట్టతలతో ఉండేవాడు. దూరం నుంచి చూసినప్పుడు అతని తల పూర్తిగా కనిపించేది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతను హెల్మెట్ ధరించలేదని అనుకుని ఆపేవారు. మొదటిసారి ఆపినప్పుడు అతను వివరించినా, అధికారులు పూర్తిగా నమ్మలేదు. చలాన్ వేసి పంపించారు. కానీ, అక్కడితో కథ అయిపోలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. మరోసారి పోలీసులు అతడిని ఆపారు. మళ్లీ హెల్మెట్ ఎక్కడ? అని ప్రశ్నించారు. అతను ఎంత చెప్పినా, అధికారులు అతడు సరదాగా చెప్తున్నాడని అనుకున్నారు. మరోసారి జరిమానా విధించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పదే పదే ఇవే సీన్లు రిపీట్ అయ్యాయి. “నేను హెల్మెట్ పెట్టుకున్నాను” అని అతడి చెప్పినా నమ్మేవారు కాదు.
చివరికి ఈ గందరగోళానికి అతడు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరోసారి ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు, అతను ప్రశాంతంగా బైక్ పక్కకు నిలిపాడు. ఆ తర్వాత అధికారిని నేరుగా చూసి, నెమ్మదిగా తన తలపై ఉన్న హెల్మెట్ ను తీసేశాడు. అది సాధారణ హెల్మెట్ కాదు. అతని గుండుతో పూర్తిగా కలిసిపోయేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన మ్యాట్ బ్లాక్ హెల్మెట్. దూరం నుంచి చూస్తే అది నిజంగా అతడి బట్టతలలా కనిపించేది. హెల్మెట్ అంచులు కూడా అతడి శరీరంలో కలిసిపోయేలా ఉన్నాయి. ఎవరైనా చూసినా అది హెల్మెట్ అని గుర్తించడం చాలా కష్టం.
ఆ హెల్మెట్ డిజైన్ చూసి అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతవరకు తాము హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడని అనుకున్న వ్యక్తి, నిజానికి పూర్తిగా రూల్స్ పాటిస్తున్నాడని తెలుసుకుని అవాక్కయ్యారు. ఆ వ్యక్తి కూడా నవ్వుతూ పరిస్థితిని వివరించడంతో అక్కడి వాతావరణం సరదాగా మారిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది ఆ హెల్మెట్ డిజైన్ ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు “ఇది నిజంగా జీనియస్ ఐడియా” అన్నారు. మరికొందరు “ఇంత రియలిస్టిక్ గా హెల్మెట్ తయారు చేయడం గ్రేట్” అంటూ కామెంట్లు చేశారు. కొన్నిసార్లు మన కళ్ల ముందు కనిపించేది నిజం కాకపోవచ్చనే విషయం ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. అదే సమయంలో, క్రియేటివిటీ ఎంత అద్భుతంగా ఉండగలదో కూడా ఈ హెల్మెట్ నిరూపించింది.
Read Also: హెడ్ లైట్ లోనే ప్రొజెక్టర్.. హ్యాపీగా సినిమాలు చూసేయొచ్చు!