Farmer Policies: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై అవలంబిస్తున్న విధానాలు రైతులకు పూర్తి స్థాయి రక్షణను కల్పించడంలో విఫలమవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణ వంటి అంశాల్లో కేంద్రం సమగ్ర దృష్టితో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు పదేపదే “కేంద్రమే ధాన్యం సేకరిస్తోంది, అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది” అంటూ ప్రచారం చేయడం వాస్తవ పరిస్థితులను వక్రీకరించడం తప్ప మరొకటి కాదని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు.
రైతుల సమస్యలను ఒక్క వరి ధాన్యానికి మాత్రమే పరిమితం చేయడం సరైంది కాదని, తెలంగాణలో వరితో పాటు మొక్కజొన్న, జొన్న, కందులు, పెసలు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పత్తి, ఆయిల్‌పామ్ వంటి అనేక పంటలు విస్తృతంగా సాగు అవుతున్నాయని తెలిపారు. ఈ పంటల కొనుగోలు, మద్దతు ధరలు, దిగుమతి-ఎగుమతి విధానాలు, ఎరువుల ధరలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. వరి ధాన్యం విషయంలో కూడా ఎఫ్‌సీఐ పూర్తి పంటను కొనుగోలు చేయడం లేదని, కేంద్రం వరి ధాన్యానికి క్వింటాకు ₹2,300 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం అదనంగా క్వింటాకు ₹500 బోనస్ ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రులు ఎందుకు గుర్తించడంలేదని ప్రశ్నించారు. రైతు ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని చిన్నచూపు చూడడం బాధాకరమన్నారు. రైతులకు నిజమైన భరోసా కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
కేంద్రం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న పెసలు, కందులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి పంటలపై 25 శాతం పరిమితి విధించడం వల్ల మిగిలిన పంటను రైతులు ఎక్కడ విక్రయించాలనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా తెలంగాణలో విస్తృతంగా సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వం ధర మద్దతు పథకం పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదో స్పష్టం చేయాలని కోరారు. ఇది రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని, ఈ రెండు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ఆ ధరకు ప్రభుత్వ కొనుగోలు హామీ లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: బండి బగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాధితురాలి తల్లి లేఖ వెనుక సంచలనాలు.. ఇరుకుంటున్న పెద్దలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం C2 + 50 శాతం సూత్రాన్ని అనుసరిస్తున్నాయా అనే విషయాన్ని రైతులకు వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో ఎరువులు, డీజిల్, విత్తనాలు, కూలీల ఖర్చులు భారీగా పెరిగినా, అదే స్థాయిలో మద్దతు ధరలు పెరగలేదన్నారు.గత ఐదేళ్లలో డీఏపీ ధరలు 70 శాతం, కాంప్లెక్స్ ఎరువులు 60 శాతం, డీజిల్ ధరలు 40 శాతం, వ్యవసాయ కూలీల ఖర్చులు 100 శాతం వరకు పెరిగినా, మద్దతు ధరల పెరుగుదల మాత్రం వరిపై 27 శాతం, గోధుమపై 26 శాతం, మొక్కజొన్నపై 20 శాతం, జొన్నపై 41 శాతం, పత్తిపై 40 శాతం మాత్రమే ఉండటం రైతులకు న్యాయం కాదన్నారు. ఈ పెరుగుదలలు రైతుల అసలు సాగు వ్యయాలకు సరిపోవడం లేదన్నారు.
ఎంఎస్పీకి చట్టబద్ధ హామీ కల్పించాలని, మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్‌ఎస్ పరిధిలోకి తీసుకురావాలని, కేంద్రం కొనుగోలు చేసే పంటల కొనుగోళ్లపై 25 శాతం పరిమితిని తొలగించి కనీసం 75 శాతం పంటలను కేంద్రమే కొనుగోలు చేయాలని, పంటల ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. దేశీయ రైతులను రక్షించేందుకు అవసరమైన దిగుమతి సుంకాలు పెంచాలని, ఎరువుల ధరలను రేషనలైజ్ చేయాలి లేదా అన్ని ఎరువులపై సబ్సిడీలు అందించాలని,రైతులకు స్థిరమైన ఆదాయ భరోసా కల్పించే విధానాలు అమలు చేయాలని, రైతులకు నష్టం కలిగించే దిగుమతి విధానాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులకు అనుకూలంగా, వారి ఆదాయ భద్రతను పెంచే ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. “రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు సంక్షేమాన్ని రాజకీయ ప్రచారానికి పరిమితం చేయకుండా, ఆచరణాత్మక విధానాలతో ఆదుకోవాల్సిన సమయం ఇది” అని ఆయన పేర్కొన్నారు.
Also Read: గ్రామీణ మహిళలకు లైఫ్ సెట్ అయ్యే సూపర్ ఛాన్స్.. ప్రతి నెల 7 లక్షలు లాభం..!