Affordable Studds Helmet Launched: ప్రముఖ భారతీయ హెల్మెట్ తయారీ సంస్థ స్టడ్స్, తన కొత్త ట్రూపర్ లెగసీ షీల్డ్ హెల్మెట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరను కంపెనీ రూ.2,425గా నిర్ణయించింది. ఈ కొత్త హెల్మెట్ ను ఆన్ లైన్ స్టోర్ తో పాటు స్టడ్స్ ఎక్స్ క్లూజివ్ షోరూమ్ లు, రిటైల్ అవుట్ లెట్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఈ కొత్త హెల్మెట్.. DC సూపర్ హీరోల స్ఫూర్తితో రూపొందించిన డెకాల్ ఎడిషన్ లో భాగంగా వస్తుంది. ముఖ్యంగా సూపర్ మ్యాన్ థీమ్ ఆధారంగా డిజైన్ చేయబడింది. హెల్మెట్ వెనుక భాగంలో పెద్ద సూపర్ మ్యాన్ S షీల్డ్ గ్రాఫిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యువ రైడర్లను దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.
రంగుల విషయానికి వస్తే, ఈ హెల్మెట్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ గ్రే, బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ టీల్ మెటాలిక్ ఫాయిల్, అలాగే బ్లాక్ అండ్ రెడ్ మెటాలిక్ ఫాయిల్ లాంటి కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లు డార్క్ బేస్ డిజైన్ పై ఆధారపడి ఉంటాయి. గ్లోసీ, మ్యాట్ ఫినిషింగ్ రెండింటిలోనూ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
ట్రూపర్ లెగసీ షీల్డ్ హెల్మెట్ ఫుల్ ఫేస్ ఫ్లిప్ అప్ డిజైన్ తో వస్తుంది. రైడింగ్ సమయంలో భద్రత కోసం పూర్తి ఫేస్ కవర్ గా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైనా ఆగినప్పుడు బార్ ను పైకి లేపి సులభంగా మాట్లాడొచ్చు. నగర ప్రయాణాల్లో, పెట్రోల్ బంక్ లు, టోల్ గేట్లు, ట్రాఫిక్ చెకింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
భద్రత పరంగా ఈ హెల్మెట్ లో హై ఇంపాక్ట్ ABS షెల్ ఉపయోగించారు. లోపల డెన్స్ EPS లైనర్ ఉండటం వల్ల ఢీకొన్న సమయంలో మంచి రక్షణ అందిస్తుంది. ఈ హెల్మెట్ ISI సర్టిఫికేషన్‌తో పాటు అమెరికా రవాణా శాఖ ఇచ్చే DOT సర్టిఫికేషన్ ను కూడా కలిగి ఉంది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెప్పవచ్చు.
ఇందులో హైపోఅలెర్జెనిక్ రీప్లేసబుల్ ఇంటీరియర్ లైనర్ ఉంది. దీన్ని అవసరమైతే తీసి శుభ్రం చేసుకోవచ్చు. మార్చుకోవచ్చు కూడా. స్క్రాచ్ రెసిస్టెంట్ క్విక్ రీలీజ్ వైజర్, యూవీ రెసిస్టెంట్ పెయింట్ ఫినిష్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే, క్విక్ రీలీజ్ చిన్ స్ట్రాప్, రస్ట్ ప్రూఫ్ స్టెయిన్ లెస్ స్టీల్ బకిల్ లాంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో స్టైలిష్ డిజైన్ తో పాటు మంచి సేఫ్టీ ఫీచర్లు కలిగిన హెల్మెట్ గా ట్రూపర్ లెగసీ షీల్డ్ మార్కెట్లోకి వచ్చింది. సూపర్ హీరో థీమ్‌తో ఉన్న గ్రాఫిక్స్ యంగ్ రైడర్లను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
Read Also: 160 సీసీ ఇంజన్‌తో కొత్త TVS మ్యాక్సీ స్కూటర్.. ఏరాక్స్‌కు షాక్ తప్పదా?