Upcoming TVS Maxi Scooter: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లో టీవీఎస్ కంపెనీ మరో కొత్త ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 125సీసీ, 150సీసీ విభాగాల్లో తన మోడల్స్ ను అందుబాటులో ఉంచగా, ఇప్పుడు సరికొత్త 160సీసీ మ్యాక్సీ స్కూటర్ ను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆటో మొబైల్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
గతంలో టీవీఎస్ Ntorq 150 పేరుతో కొత్త స్కూటర్ ను తీసుకురానుందనే ప్రచారం జరిగింది. ఆ మోడల్, ప్రస్తుతం ఉన్న Ntorq 125 ప్లాట్ ఫారమ్ ఆధారంగానే రూపొందించబడింది. దీంతో పూర్తిస్థాయి మ్యాక్సీ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకునిరాశ కలిగింది. ఇప్పుడు టీవీఎస్ పూర్తిగా కొత్త ప్లాట్ ఫారమ్‌పై 160సీసీ స్కూటర్ ను అభివృద్ధి చేస్తోందన్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
భారత మార్కెట్లో గత కొన్నేళ్లుగా ప్రీమియం స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఎక్కువ పవర్, స్పోర్టీ డిజైన్, ఆధునిక ఫీచర్లు కలిగిన స్కూటర్ల వైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో యమహా ఏరాక్స్ 155 ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకోగా, హీరో జూమ్ 160 కూడా ఈ విభాగంలో పోటీని పెంచింది. త్వరలో హోండా ADV160, యమహా NMax 155 లాంటి మోడళ్లు కూడా భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీవీఎస్ కూడా తన ప్రీమియం స్కూటర్ పోర్ట్ ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త 160సీసీ స్కూటర్‌లో లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో ఉన్న స్కూటర్లు సుమారు 14 నుంచి 15 హెచ్‌పీ వరకు పవర్ ఉత్పత్తి చేస్తున్నాయి. టీవీఎస్ కూడా అదే స్థాయిలో, లేదంటే అంతకంటే కొంచెం ఎక్కువ పనితీరును అందించే ఇంజన్ ను తీసుకురావొచ్చని అంచనా వేస్తున్నారు.
డిజైన్ పరంగా కూడా ఈ స్కూటర్ ప్రత్యేకంగా ఉండే అవకాశముంది. యమహా ఏరాక్స్ తరహాలో స్పోర్టీ స్టైల్ లో వస్తుందా? లేదంటే హీరో జూమ్ 160, హోండా ADV160 మాదిరిగా అడ్వెంచర్ స్కూటర్ లుక్ తో వస్తుందా? అన్నది ఇంకా స్పష్టత లేదు. మరోవైపు యమహా NMax లాంటి సాంప్రదాయ మ్యాక్సీ స్కూటర్ డిజైన్ ను కూడా టీవీఎస్ పరిశీలించే అవకాశం ఉంది. ఈ కొత్త స్కూటర్ లో 14 ఇంచుల వీల్స్ ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే పనితీరుతో పాటు టెక్నాలజీపై కూడా టీవీఎస్ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ TVS Xలో అందిస్తున్న కనెక్టెడ్ టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు, డిజిటల్ సదుపాయాల్లో కొన్ని ఈ కొత్త మోడల్ లో కూడా కనిపించే అవకాశముంది. ప్రీమియం స్కూటర్ విభాగంలో పోటీ మరింత పెరుగుతున్న సమయంలో టీవీఎస్ నుంచి రాబోయే 160సీసీ మ్యాక్సీ స్కూటర్ మార్కెట్లో మరింత ఆసక్తిని కలిగించే అవకాశం కనిపిస్తోంది.
Read Also: భారత్ లో ఈవీ బైక్‌ల జోరు.. త్వరలో మార్కెట్ లోకి అడుగు పెట్టనున్న 5 మోడళ్లు ఇవే!