Tata Punch vs Tata Tiago Comparison: టాటా మోటార్స్ ఇటీవల తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ టియాగోను సరికొత్త అప్ డేట్స్ తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మార్పులతో టియాగో మరింత ఆకర్షణీయంగా, ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ధరలు కూడా పెరగడంతో ఇప్పుడు కొన్ని టియాగో వేరియంట్లు టాటా పంచ్ మైక్రో SUV ధరలకు సమానం అయ్యాయి. ఈ నేపథ్యంలో టియాగో కొనాలా? లేక పంచ్ ఎంచుకోవాలా? అనే అనుమానం కలుగుతోంది. ఇంతకీ వీటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా టియాగో ప్రారంభ ధర రూ.4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు టాటా పంచ్ ధర రూ.5.65 లక్షల నుంచి మొదలవుతుంది. అంటే, ఎంట్రీ లెవల్ లో టియాగో దాదాపు లక్ష రూపాయల వరకు చౌకగా ఉంటుంది. అయితే టాప్ వేరియంట్లలో ఈ తేడా రూ.2 లక్షలకు పైగా పెరుగుతుంది.
సైజు పరంగా చూస్తే పంచ్ పెద్దగా ఉంటుంది. ఇది టియాగో కంటే పొడవుగా, వెడల్పుగా, ఎత్తుగా ఉంటుంది. అలాగే వీల్ బేస్ కూడా ఎక్కువగా ఉండటంతో క్యాబిన్ లో ప్రయాణికులకు మరింత స్థలం లభిస్తుంది. బూట్ స్పేస్ విషయంలో కూడా పంచ్ ముందంజలో ఉంది. టియాగోలో 242 లీటర్ల బూట్ స్పేస్ ఉంటే, పంచ్‌లో 319 లీటర్ల సామర్థ్యం ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఫీచర్లలో రెండు కార్లు కూడా మంచి ప్యాకేజీతో వస్తాయి. LED హెడ్ లైట్లు, LED DRLs, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగులు లాంటి ఆధునిక ఫీచర్లు రెండింటిలోనూ ఉన్నాయి. అయితే, కొన్ని అంశాల్లో టియాగో ముందుంది. డ్రైవర్ సీటుకు 6 వే అడ్జస్ట్ మెంట్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లు టియాగోలో లభిస్తాయి. మరోవైపు పంచ్ లో సన్ రూఫ్, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్ లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్ ఆప్షన్స్ లో కూడా తేడా ఉంది. టియాగోలో 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ, పంచ్ లో అదే ఇంజిన్ తో పాటు శక్తివంతమైన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా లభిస్తుంది. రెండు కార్లలోనూ CNG ఆప్షన్ అందుబాటులో ఉండటం మరో ప్లస్ పాయింట్.
ఓవరాల్ గా చూస్తే బడ్జెట్, నగర ప్రయాణాలు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు కోరుకునేవారికి టియాగో మంచి ఆప్షన్. అయితే, ఎక్కువ స్థలం, SUV లుక్, అదనపు ఫీచర్లు, మంచి రోడ్ ప్రెజెన్స్ కావాలనుకునేవారికి టాటా పంచ్ మరింత మంచి ఆప్షన్. అవసరాలను బట్టి ఈ రెండింటిలో సరైన మోడల్ ను ఎంచుకోవచ్చు.
Read Also: టాటా టియాగో క్రియేటివ్ vs క్రియేటివ్ ప్లస్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్?